Share News

ప్రశ్నించే గొంతును గెలిపించాలి

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:25 AM

‘‘కాంగ్రెస్‌ నేతలు వంద రోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. పైగా ఎన్నికల కోడ్‌ను సాకుగా చెబుతున్నారు. కాంగ్రెస్‌ హామీలు అమలు కావాలంటే రాష్ట్రంలో ప్రశ్నించే గొంతును గెలిపించాలి. మాట తప్పిన కాంగ్రె్‌సను

ప్రశ్నించే గొంతును గెలిపించాలి

కాంగ్రెస్‌ హామీలపై నిలదీయాలి

స్వార్థపరులే పార్టీలు మారుతున్నారు: హరీశ్‌రావు

యాదాద్రి/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ నేతలు వంద రోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. పైగా ఎన్నికల కోడ్‌ను సాకుగా చెబుతున్నారు. కాంగ్రెస్‌ హామీలు అమలు కావాలంటే రాష్ట్రంలో ప్రశ్నించే గొంతును గెలిపించాలి. మాట తప్పిన కాంగ్రె్‌సను ఓడించాలి’’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారంయాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనకు వందరోజులు నిండాకే కోడ్‌ అమల్లోకి వచ్చిందని, ఆరు గ్యారెంటీల్లో తొలి హామీ అయిన మహిళలకు రూ.2500అమలు చేయలేదని విమర్శించారు. రూ.2లక్షల రుణమాఫీ, వడ్లకు రూ.500బోనస్‌, రూ.4వేల పింఛన్‌, రూ.15వేల రైతుబంధు, తులం బంగారం, రూ.4వేల నిరుద్యోగ భృతి, విద్యార్థులకు రూ.5లక్షల బ్యాంకు కార్డు.. వీటిలో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. రైతులను, నిరుద్యోగులను, మహిళలను, విద్యార్థులను, నిరుపేదలందరినీ కాంగ్రెస్‌ మోసం చేసిందని మండిపడ్డారు. దానం నాగేందర్‌, కడియం కావ్య, రంజిత్‌రెడ్డి, పట్నం సునీతామహేందర్‌రెడ్డిలు పార్టీ మారడాన్ని ప్రజలు హర్షించడంలేద న్నారు. స్వార్థపరులే పార్టీలు మారుతున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, గ్యాస్‌, పెట్రోల్‌, ధరలను భారీగా పెంచిందన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడంకాదని, ప్రజలకు చేసిన మేలేంటో బీజేపీ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రూ.2లక్షలు రైతు రుణమాఫీ చేయండి

రైతు రుణమాఫీ చేస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం రూ.2లక్షలు మాఫీచేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎంకు లేఖ రాశారు. ‘‘కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది డిసెంబరు 9న రూ.2లక్షలు రుణమాఫీ చేయాల్సి ఉండగా.. నేటికి అమలు పర్చలేదు. తీసుకున్న అప్పులకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనంటూ బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తూ వేధిస్తున్నాయి. రాష్ట్రంలో 24గంటల ఉచిత విద్యుత్‌ అందక పంటలు ఎండిపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయండి’’ అని హరీశ్‌ కోరారు.

Updated Date - Apr 04 , 2024 | 05:25 AM