Share News

ఏడాది కూడా ఉండదు

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:39 AM

‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. కాంగ్రె్‌సలోని ఎమ్మెల్యేలే బీజేపీలో కలిసే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరతారో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే జంప్‌ కొడతారేమో తెలియదు. ఇటువంటి

ఏడాది కూడా ఉండదు

లిల్లీపుట్‌గాళ్ల ప్రభుత్వం ఇది.. ముఖ్యమంత్రే జంప్‌ చేస్తాడేమో

మేం కట్టిన అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జయంతిరోజు ఒక్క పువ్వు కూడా పెట్టలేదు

సిగ్గు లేకుండా సచివాలయంలో కూర్చున్నారు.. లిల్లీపుట్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భాషేమిటి!?

పోలీసుల అరాచకాలను రికార్డు చేస్తున్నాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం.. మీ సంగతి చూస్తాం

మేం గెలవకపోతే మీకే నష్టం.. బీఆర్‌ఎ్‌సకు నష్టం లేదు..

సుల్తాన్‌పూర్‌ సభలో మాజీ సీఎం కేసీఆర్‌

సంగారెడ్డి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. కాంగ్రె్‌సలోని ఎమ్మెల్యేలే బీజేపీలో కలిసే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరతారో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే జంప్‌ కొడతారేమో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవడు ఎవనికి బీ-టీమో ఆలోచించుకోవాలి’’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. తమకేమీ ఓర్వలేనితనం లేదని, ఐదేళ్లూ ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. అప్పుడే నలుపేందో తెలుపేందో ప్రజలకు తెలుస్తుందన్నారు. పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్టు లిల్లీపుట్‌గాళ్లకు అధికారం ఇచ్చారని వ్యాఖ్యానించారు. తన గుడ్లు పీకి ఆడుకుంటామని, తనను పండబెట్టి తొక్కుతానని, ముడ్డి మీద చెడ్డీ లేకుండా గుంజుకుంటామని లిల్లీపుట్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడడం ఏమిటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయి ఉండి అలా మాట్లాడడం ఏమిటంటూనే.. తాను ఏ రోజైనా ఇలాంటి భాష వాడానా? అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపైనా కేసీఆర్‌ మండిపడ్డారు. పోలీసులు అరాచకాలను బంద్‌ చేయాలని, గ్యారంటీగా మళ్లీ తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు వాళ్ల సంగతి చూస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ వద్ద మంగళవారం సాయంత్రం మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ‘‘ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 ఫీట్ల అంబేడ్కర్‌ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాం. కానీ, ఆ మహనీయుని జయంతి రోజున ఈ లిల్లీపుట్‌ గాళ్ల ప్రభుత్వం ఆ విగ్రహం వద్దకు పోలేదు. ఒక్క పువ్వు కూడా పెట్టలేదు. పూలమాల వేయలేదు. అంజలి ఘటించలేదు. ఇంత అహంకారమా? కండకావరమా? అజ్ఞానమా? ఆ విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకుండా ప్రహరీకి తాళం వేశారు. అలా అయితే.. సచివాలయం కూడా ఆ మహనీయుని పేరిటే ఉంది. మరి సిగ్గు లేకుండా సచివాలయానికి వెళ్లి ఎలా కూర్చుంటున్నారు. యాదగిరిగుట్టను బీఆర్‌ఎస్సే తీర్చిదిద్దింది. అక్కడికి ఎందుకు పోతున్నారు!?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ రెండు ఎంపీ సీట్ల కంటే ఎక్కువ రావని అన్ని సర్వే రిపోర్టులు చెబుతున్నాయన్నారు.

బీఆర్‌ఎస్‌ గెలవకపోతే మీకే నష్టం

తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ ఇచ్చామని, భారీగా వేతనాలు చెల్లించామని, సమాజంలో సముచిత గౌరవం కల్పించామని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏం జరుగుతోందో ఒక్కసారి ఆలోచించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘కాంగ్రెస్‌ హామీలు నెరవేర్చాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచి తీరాలి. లేకపోతే మీరే నష్టపోతారు. బీఆర్‌ఎ్‌సకు వచ్చే నష్టమేమీ లేదు. 24 గంటలపాటు కరెంట్‌ సరఫరా కావాలన్నా, 2 లక్షల రూపాయల రుణ మాఫీ అమలు చేయాలన్నా, మీ హక్కులు సాధించాలన్నా బీఆర్‌ఎస్‌ గెలవాలి’’ అని వ్యాఖ్యానించారు. గత డిసెంబరు 9న రుణ మాఫీ చేస్తామని, ఆడబిడ్డలకు రూ.2,500 చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కటైనా అమలు చేసిందా? అని ప్రశ్నించారు. రైతు బంధు ఇప్పటికీ రాలేదని, బోనస్‌ ఇస్తామన్న మాట బోగస్సే అయ్యిందని విమర్శించారు.

పోలీసుల తీరును రికార్డు చేస్తున్నాం

‘‘మీ డ్యూటీ మీరు చేయండి. అంతేగానీ అతిగా ప్రవర్తించవద్దు’’ అని పోలీసులను కేసీఆర్‌ హెచ్చరించారు. అమాయకులను బెదిరించడం, కొట్టడం, తమ పార్టీ ఫ్లెక్సీలు లేకుండా చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసుల మితిమీరిన పనులన్నింటినీ రికార్డు చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో సోషల్‌ మీడియాలో పోస్టు చేసినందుకు తమ కార్యకర్త మాధవరావుపై దౌర్జన్యం చేసి అరెస్ట్‌ చేశారని, అతనిపై దౌర్జన్యం చేసిన సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. సభలో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, హరీశ్‌రావు తదిరులు ప్రసంగించారు. కాగా, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం నోటీసులు జారీ చేసింది. సిరిసిల్లలో కేసీఆర్‌ తమ పార్టీ నేతలను దుర్భాషలాడారని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఉదయం 11 గంటలలోగా కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు జారీ చేసింది.

రైతాంగ సమస్యల పరిష్కారానికి పోస్టుకార్డు ఉద్యమం

రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం చేపట్టాలని కేసీఆర్‌ కోరారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటికే ఈ ఉద్యమం సాగుతోందని, సిద్దిపేటను ఆదర్శంగా తీసుకొని రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా వరి కోతలు సాగేవని, ఇప్పుడు కరెంట్‌ కోతలు, క్రాప్‌ హాలీడేలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్‌ ఉన్నా రైతులకు బోనస్‌ ఇవ్వవచ్చని, తామేమీ ఫిర్యాదు చేయమని, ఒకవేళ ఇబ్బంది అనుకున్నా ఎన్నికలు ముగిసిన మరుసటి రోజైనా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక, బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టమన్నారు. ఆ పార్టీ కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నా ఒక్క మెడికల్‌ కాలేజ్‌ కానీ, ఒక్క నవోదయ స్కూల్‌ గానీ, ఒక్క జాతీయ ప్రాజెక్టు కానీ ఇవ్వలేకపోయిందని విమర్శించారు.

Updated Date - Apr 17 , 2024 | 03:39 AM