వరకట్న పిశాచాలు!
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:01 AM
అదనపు వరకట్నం కోసం భర్తల వేధింపులకు నాలుగు ప్రాణాలు బలయ్యాయి. భర్త వేధింపులు భరించలేని భార్య.. పేగుతెంచుకు పుట్టిన కొడుకుకు విషగుళికలు ఇచ్చి తాను మింగి

భార్యను కొట్టి పుట్టింటికి పంపిన భర్త
కొడుకుకు విష గుళికలు తినిపించి, తానూ తీసుకుని భార్య బలవన్మరణం
కుమార్తె, మనవడి చావు చూడలేక ఆమె తల్లి ఆత్మహత్య
కరీంనగర్ శివారులో ఘటన
సిరిసిల్ల జిల్లాలో మరో మహిళ..
కరీంనగర్ క్రైం, చందుర్తి, ఏప్రిల్ 2: అదనపు వరకట్నం కోసం భర్తల వేధింపులకు నాలుగు ప్రాణాలు బలయ్యాయి. భర్త వేధింపులు భరించలేని భార్య.. పేగుతెంచుకు పుట్టిన కొడుకుకు విషగుళికలు ఇచ్చి తాను మింగి ప్రాణాలు తీసుకుంది. కళ్లముందే కన్నకూతురు, మనవడు చనిపోవడం జీర్ణించుకోలేని మృతురాలి తల్లి కూడా విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనరగ్ జిల్లాలో జరిగింది. కరీంనగర్ శివారులోని విజయనగర్ కాలనీకి చెందిన గద్దె శ్రీజ(27)కు వరంగల్‌కు చెందిన మొద్దుంపూర్ నరేష్‌తో 2021లో పెళ్లయింది. వారికి కొడుకు రేయాన్ష్ అలియాస్ అర్విన్ (11 నెలలు) ఉన్నాడు. పెళ్లి సమయంలో నరే్‌షకు శ్రీజ కుటుంబం వరకట్నంగా 3లక్షల డబ్బు, ఇతర లాంఛనాలు ముట్టజెప్పింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే నరేష్ కొన్నేళ్లుగా వరంగల్‌లో ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. కొంతకాలంగా అదనపు కట్నం కావాలని నరేష్ తరచూ శ్రీజతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గత నెల 29న నరేష్, అతడి అమ్మనాన్నలు.. శ్రీజను కొట్టి అదనపు కట్నం తీసుకురమ్మని బాబుతో సహా పుట్టింటికి పంపించారు. ఈనెల 5న కొడుకు రేయాన్ష్ మొదటి పుట్టిన రోజని, భర్తను రమ్మని శ్రీజ మంగళవారం ఉదయం ఫోన్ చేసింది. అయితే తాను రానని, మీరే చేసుకోండంటూ శ్రీజను, ఆమె తల్లిదండ్రులను దూషించాడు. మీరు చచ్చిపోండంటూ నరేష్ మాట్లాడాడు.
దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీజ కొడుకు రేయాన్ష్‌తో విష గుళికలు మింగించి ఆమె కూడా మింగింది. ఆస్పత్రికి తరలిస్తుండగా రేయాన్ష్ చనిపోయాడు. శ్రీజ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మనవడు, కూతురి చావును జీర్ణించుకోలేక పోయిన శ్రీజ తల్లి జయప్రద(51) ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చి విష గుళికలు తిన్నది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మరో ఘటనలో రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తండా గ్రామ పంచాయతీ పరిధిలోని జలపతి తండాకు చెందిన గుగులోతు జలంధర్ వివాహం వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన శోభతో ఆరేళ్ల క్రితం జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకలు ఇచ్చి పెళ్లి జరిపించారు. వీరికి నాలుగేళ్ల క్రితం కుమారుడు జన్మించాడు. ఇటీవల దంపతుల మధ్య అదనపు వరకట్న వేధింపుల గొడవలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో సోమవారం రాత్రి శోభ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.