Share News

illegal distribution of sheep : గొర్రెల పంపిణీ అక్రమాలపై ఫోకస్‌!

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:55 AM

గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. బినామీ పేర్లతో ఖాతాలు తెరిచి రూ.2.08 కోట్ల నిధుల దారి మళ్లింపు, పశుసంవర్థక భవన్‌లో ఫైళ్లు మాయమైన ఉదంతాలపై విచారణ జరుగుతోంది.

 illegal distribution of sheep : గొర్రెల పంపిణీ అక్రమాలపై ఫోకస్‌!

రూ.2.08 కోట్లు దారి మళ్లింపు కేసు ఏసీబీకి!..

రైతులకు డబ్బు ఎగ్గొట్టి బినామీ ఖాతాల్లో జమ

నలుగురు అధికారులు, ఇద్దరు దళారులపై కేసు

ఫైళ్ల మాయం వ్యవహారంలో మాజీ మంత్రి తలసాని ఓఎస్డీపై విచారణ

హైదరాబాద్‌/రాయదుర్గం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. బినామీ పేర్లతో ఖాతాలు తెరిచి రూ.2.08 కోట్ల నిధుల దారి మళ్లింపు, పశుసంవర్థక భవన్‌లో ఫైళ్లు మాయమైన ఉదంతాలపై విచారణ జరుగుతోంది. నిధుల మళ్లింపు వ్యవహారంలో నలుగురు అధికారులు, ఇద్దరు గొర్రెల దళారులపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఏసీబీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు కొంతమేర దర్యాప్తు చేపట్టినా మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. మరోవైపు ఫైళ్ల మాయం ఘటనపై రాష్ట్ర పశు సంవర్థక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేషీలో ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్‌ కుమార్‌ ప్రమేయంపైనా పోలీసుల విచారణ కొనసాగుతోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన గొర్రెల పంపిణీ పథకం అవినీతి, అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం విదితమే.

పశుసంవర్థక శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు కుమ్మక్కై నిధులను దారి మళ్లించారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్‌, ఆదిత్య కేశవ్‌సాయి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు కలిసి గతేడాది ఆగస్టు 13 నుంచి 23 మధ్యకాలంలో ఏపీలో పర్యటించారు. 18 మంది రైతుల నుంచి 133 యూనిట్లు (2,793 గొర్రెలు) సేకరించారు. వాస్తవానికి గొర్రెలు విక్రయించిన ఏపీ రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాల్సి ఉంది. కానీ అలా చేయకుండా దళారులకు చెందిన బినామీ ఖాతాల్లోకి రూ.2.08 కోట్లు మళ్లించారు. డబ్బులు రాకపోవటంతో ఏపీ రైతులు కాంట్రాక్టర్‌ను నిలదీశారు. పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్‌లో ఆరా తీయగా డబ్బుల చెల్లింపు పూర్తయినట్లు అధికారులు ఽధ్రువీకరించారు. దీంతో కాంట్రాక్టర్‌ వెళ్లి గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పశుసంవర్థక శాఖ ఏడీలు రవికుమార్‌, ఆదిత్య కేశవ్‌ సాయితోపాటు ఇద్దరు దళారులపై ఐపీసీ సెక్షన్లు- 406, 409, 420 ప్రకారం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కల్యాణ్‌ కుమార్‌ మసాబ్‌ ట్యాంక్‌లోని రాష్ట్ర పశుసంవర్థకశాఖ కార్యాలయానికి వెళ్లి కీలక ఫైళ్లను చించేసి, కాగితపు ముక్కలను బస్తాలో మూటగట్టుకొని తన కారులో వేసుకొని వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి, రూ.2.08 కోట్ల నిధులు బోగస్‌ ఖాతాల్లోకి దారి మళ్లడానికి సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మొదటి విడతలో నిధుల దుర్వినియోగం

మొదటి విడత గొర్రెల పంపిణీ పథకంలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఒక్కో గొర్రెల యూనిట్‌ ధర (20+1) రూ.1.25 లక్షలు కాగా... ఒక్కో యూనిట్‌ పేరు మీద రూ.50 వేలు దారిమళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామంలో 21 మందికి గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయి. వీరిలో 11 మందికి 2021 ఏప్రిల్‌ 10న ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల నుంచి 11 యూనిట్ల గొర్రెలు తీసుకొచ్చారు. గొర్రెల కొనుగోలు కోసం ఏపీకి వెళ్లిన అధికారులతో అక్కడి దళారీ ఒకరు రీ-సైక్లింగ్‌కు ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారు. బావుపేట శివారులో గొర్రెలు దించి... ఒక్కో యూనిట్‌కు రూ.72,500 చొప్పున లబ్ధిదారులకు చెల్లించి... అధికారుల ధ్రువీకరణ అనంతరం తిరిగి అదే వాహనంలో గొర్రెలను ఏపీకి తీసుకెళ్తుండగా హసన్‌పర్తి పోలీసులు అడ్డుకొని కేసు నమోదు చేశారు. 2021 జనవరి 21న జగిత్యాల జిల్లాలో సాక్షాత్తూ అప్పటి పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేతుల మీదుగా లాంఛనంగా పంపిణీ చేసిన యూనిట్లలో కూడా గోల్‌మాల్‌ జరిగింది. 21 గొర్రెలకు బదులు 13-16 గొర్రెలు మాత్రమే ఇచ్చి మోసం చేశారు. నర్సింహులపల్లె గ్రామానికి చెందిన తడుక రామక్కకు 14, అమ్మక్కపేటకు చెందిన అగ్గ రాజన్నకు 16 గొర్రెలు మాత్రమే ఇచ్చారు. మొదటి విడతలో అప్పటి ప్రభుత్వం 3.50 లక్షల యూనిట్లు పంపిణీ చేయగా సింహభాగం యూనిట్ల విషయంలో ఇదే తరహాలో దందా జరిగింది. దీనిలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర పశుసంవర్థకశాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, దళార్లు భాగస్వాములైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్రంలోని గొల్ల-కురుమలకు రూ.75 వేలు చేతిలో పెట్టి యూనిట్లు కాజేసిన సంఘటనలు, గొర్రెలతో లబ్ధిదారుల ఫొటోలు తీయించి, వాహనాల్లో తీసుకెళ్లి, రైతులతో ఒప్పందం చేసుకొని, మళ్లీ అవే వాహనాల్లో తిరిగి జీవాలను తీసుకెళ్లిన ఉదంతాలు కోకొల్లలుగా జరిగాయి. 20 గొర్రెలు, ఒక పొట్టేలుకు బదులుగా చిన్నవి, నాణ్యత లేని, రోగాల బారిన పడిన జీవాలను కూడా రైతులకు అంటగట్టారు. గొర్రెల రీ-సైక్లింగ్‌ అక్రమ రవాణాపై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర పశుసంవర్థక శాఖకు చెందిన 24 మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. కొందరు అధికారులను సస్పెండ్‌ చేశారు. మరికొందరిని ప్రొక్యూర్మెంట్‌ బాధ్యతల నుంచి తప్పించారు. అయితే గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. విచిత్రమేమిటంటే... రాష్ట్రంలో గొర్రెల సంపద సృష్టించామని, మాంసం దిగుమతులు తగ్గించామని, పింక్‌ రెవెల్యూషన్‌ తీసుకొచ్చామని అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసుకుంది. గొర్రెలు, వాటికి పుట్టిన పిల్లల లెక్కలు చెప్పి వాటి జనాభా కోట్లలో పెరిగినట్లు సభలు, సమావేశాల్లో ప్రకటించారు. కానీ రాష్ట్రంలో మాంసం ధర మాత్రం తగ్గలేదు. మటన్‌ రేటు కిలోకు రూ.900 నుంచి రూ.వెయ్యికి పైగా పలుకుతోంది.

Updated Date - Jan 12 , 2024 | 05:55 AM