Share News

Hyderabad: వరద.. వేదన!

ABN , Publish Date - May 26 , 2024 | 03:31 PM

చినుకుపడితే హైదరాబాద్‌ మహానగరవాసులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కారణం రోడ్లపై వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడమే. వర్షం పడకముందు వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు వర్షం పడిన సందర్భంలో ఏం చేయాలి? గంటలతరబడి ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలా?

Hyderabad: వరద.. వేదన!

వానొస్తే వాహనం కదలదు

గ్రేటర్‌లో పెరుగుతోన్న వాటర్‌ లాగింగ్‌ ప్రాంతాలు

ఇటీవలి వర్షానికి మూడు రోజుల్లో 158 ఫిర్యాదులు

క్షేత్రస్థాయిలో ఇబ్బందులు మరీ ఎక్కువ

రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం సున్నా

వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల ఏమైనట్లో

హైదరాబాద్‌ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): చినుకుపడితే హైదరాబాద్‌ మహానగరవాసులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కారణం రోడ్లపై వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడమే. వర్షం పడకముందు వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు వర్షం పడిన సందర్భంలో ఏం చేయాలి? గంటలతరబడి ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలా? ఇన్ని ప్రభుత్వ విభాగాలు.. వేలాదిమంది సిబ్బంది ఉన్నా ఎందుకిలా అంటే అందరి వేళ్లూ జీహెచ్‌ఎంసీ వైపు. కారణం ఎన్ని చర్యలు తీసుకున్నామని చెబుతున్నా రోడ్లపై భారీగా వరద నీరు నిలుస్తుండడమే. మహానగర వరద ప్రవాహ వేగం గంటకు రెండు సెంటిమీటర్లు. ఏళ్లుగా అధికారులు ఇదే చెబుతున్నారు తప్ప ఆ వ్యవస్థ మెరుగుదలకు చేపట్టిన చర్యలు శూన్యమనే చెప్పాలి. వెచ్చించిన నిధులు ఎటుపోయాయి అన్నదీ ప్రశ్నార్ధకంగా మారింది. గతంలో వరద నీరు నిలుస్తున్నట్టు గుర్తించిన ప్రాంతాల్లో పరిష్కార చర్యలు చేపట్టామని ఇంజనీరింగ్‌ అధికారులు గొప్పలు చెప్పారు. కానీ మెజారిటీ ఏరియాల్లో పరిస్థితి మారకపోగా కొత్త ప్రాంతాల్లోనూ వర్షపు నీరు నిలుస్తోంది. ఇటీవల కురిసిన మూడు వర్షాలకు వరద నీరు నిలిచాయని 158 ఫిర్యాదులు వచ్చాయి. సగటున ఒక్కో రోజు 50కిపైగా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. వర్షం కురిసిన రోజు మాత్రమే కాదు.. ఆ తర్వాత రెండుమూడు రోజులూ వరద నీరు ఇంకా ఉందని ఫిర్యాదులు రావడం గమనార్హం.

రూ.కోట్లు వెచ్చించినా...

గ్రేటర్‌లో 9,103 కి.మీల మేర రహదారులు ఉన్నాయి. 1302 కి.మీల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉంది. అభివృద్ధి చెందిన నగరాల్లో రహదారులకు ఇరువైపులా వరద నీటి ప్రవాహ వ్యవస్థ ఉంటుంది. హైదరాబాద్‌ నగరంలో ఆ పరిస్థితి లేదు. ప్రధాన, అంతర్గత రోడ్ల పక్కన కొన్నిచోట్ల వరద నీటి డ్రైన్లు ఉన్నాయి. ఇంకొన్నిచోట్ల వరద నీరు సమీపంలోని నాలాల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఇదే నగరంలోని రహదారులపై వరద నీరు నిలిచేందుకు ప్రధాన కారణమవుతోంది. గత అయిదారేళ్లుగా వరద నీరు వీలైనంత త్వరగా వెళ్లేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతారు. ఇందుకోసం దాదాపు రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేశారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఎన్‌డీపీ) ఫేజ్‌-1లో భాగంగా నాలాల అభివృద్ధి, విస్తరణకు ఇప్పటికే రూ.500 కోట్లకుపైగా వెచ్చించారు. అయినా పరిస్థితి మారలేదు. లోతట్టు ప్రాంతాల్లో ముంపును పక్కన పెడితే పధాన రహదారులపై వర్షపు నీరూ సాఫీగా వె ళ్లే పరిస్థితిలేదు. గతేడాది 54 ప్రాంతాల్లో వరద నీరు నిలుస్తుందని గుర్తించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. కానీ ప్రస్తుతం దాదాపు 70-80 ప్రాంతాల్లో వరద నీరు నిలుస్తుందని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఇందులో ఫిర్యాదులు వస్తోన్నవి 50 శాతంలోపు మాత్రమే. సాధారణంగా వర్షం తగ్గిన గంట, రెండు గంటల్లో వరద నీరు ఉండకూడదు. కానీ కొన్నిచోట్ల రోజులతరబడి వరద నీరు అలాగే ఉంటోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జామ్‌జాటానికి కారణమిదే..

నగరంలో చినుకు పడినపుడు ట్రాఫిక్‌ జామ్‌జాటానికి రోడ్లపై వర్షపు నీరు నిలవడమే ప్రధాన కారణం. ఈ ఇబ్బందులకు చెక్‌ పెడుతున్నామని జీహెచ్‌ఎంసీ పదేపదే చెబుతున్నా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(డీఆర్‌ఎఫ్‌), మాన్‌సూన్‌ అత్యవసర బృందాలు (జూన్‌ 1 నుంచి అందుబాటులోకి వస్తాయి) క్షేత్రస్థాయిలో పని చేస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. పంజాగుట్ట, రాజ్‌భవన్‌, అంబర్‌పేట ఛే నెంబర్‌, హిమాయత్‌నగర్‌ వాసు మెడికల్స్‌, చింతల్‌కుంట, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-10, మూసాపేట జంక్షన్‌, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో పనులు చేసినా పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవలి వర్షాలకు కూకట్‌పల్లి జోన్‌లో అత్యధికంగా 44 ఫిర్యాదులు వచ్చాయి.

రోడ్లు...

బీటీ రోడ్లు - 2,846 కి.మీలు

సీసీ రోడ్లు - 6,167 కి.మీలు

మొత్తం - 9,013 కి.మీలు

వరద నీటి ప్రవాహ వ్యవస్థ

మేజర్‌ నాలాలు - 390 కి.మీలు

మైనర్‌ నాలాలు - 912 కి.మీలు

మొత్తం- 1,302 కి.మీలు

వరద నీటి నిల్వపై ఫిర్యాదులు

(మే 1 నుంచి 24వ తేదీ వరకు)

జోన్‌ ఫిర్యాదుల సంఖ్య

ఎల్‌బీనగర్‌ 20

చార్మినార్‌ 30

ఖైరతాబాద్‌ 29

శేరిలింగంపల్లి 17

కూకట్‌పల్లి 44

సికింద్రాబాద్‌ 18

మొత్తం 158

Updated Date - May 26 , 2024 | 03:42 PM