Share News

వీఐపీల డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:21 AM

రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వీఐపీల డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు

లాస్య నందిత మరణం నేపథ్యంలో నిర్ణయం

ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలకు డ్రైవర్లుగా ఉన్న వారందరికీ డ్రైవింగ్‌, ఫిట్‌నెస్‌ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియాకు వెల్లడించారు. గాంధీ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. వీఐపీలు సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సరైన శిక్షణ తీసుకున్న డ్రైవర్లను నియమించుకోవాలని, ప్రతిభ లేని డ్రైవర్లను విధుల్లో పెట్టుకోవద్దని సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలోని వీఐపీలందరికీ లేఖలూ రాయనున్నామన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా డ్రైవ్‌ నిర్వహించి.. ఎక్కడికక్కడ ఈ టెస్టులు నిర్వహించనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అన్ని టెస్టులూ పాసైతేనే డ్రైవింగ్‌ లైసెన్సు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజూ 50 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ. 6వేల కోట్ల అప్పుల్లో కూరుకు పోయిన ఆర్టీసీ.. ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోందన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేల చొప్పున సాయం చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేస్తామన్నారు. బిహార్‌ తరహాలో కులగణన నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన వెల్లడించారు.

Updated Date - Feb 25 , 2024 | 10:52 AM