Share News

ఫిర్‌ ఏక్‌ బార్‌..మోదీ సర్కార్‌!

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:19 AM

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించాలని బీజేపీ నిర్ణయించింది.

ఫిర్‌ ఏక్‌ బార్‌..మోదీ సర్కార్‌!

ఇదే బీజేపీ నినాదం.. యువ ఓటర్లపై దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా యువ సమ్మేళనాలు

పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కిషన్‌రెడ్డి భేటీ

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అవసరం లేదని వ్యాఖ్య

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించాలని బీజేపీ నిర్ణయించింది. వారిని పెద్దఎత్తున పార్టీలో చేర్చుకోవాలని సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువ సమ్మేళనాలు విస్తృతంగా నిర్వహించనుంది. కొత్తగా నమోదైన యువ ఓటర్ల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జులు తరుణ్‌ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డితో పాటు సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని సమీక్షించారు. ఇందుకు అనుగుణంగా లోక్‌సభ ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో పార్టీని పటిష్ఠం చేయాలని నిర్ణయించారు. వికసిత్‌ భారత్‌, గావ్‌ చలో బస్తీ చలో కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని నిర్ణయించారు. తరుణ్‌ఛుగ్‌, కిషన్‌ రెడ్డిలు పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. బీజేఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేలతో విడివిడిగా అభిప్రాయాలు తీసుకున్నారు.

మా నినాదమిదే: కిషన్‌రెడ్డి

‘ఫిర్‌ ఏక్‌ బార్‌.. మోదీ సర్కార్‌’.. ఇదే తమ ఎన్నికల నినాదమని కిషన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ అవసరం లేదన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అసమర్థులు కాంగ్రెస్‌ నాయకులని, అందుకే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు కేంద్రానికి లేఖ రాశారో సమాధానం చెప్పాలని కాంగ్రె్‌సను డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే అని నిరూపించేందుకు తాను సిద్ధమని, దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు రామ జన్మభూమిలో అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలన్నారు. సంక్రాంతి నుంచి జనవరి 22 వరకు దేశంలోని దేవాలయాలు, పరిసరాల్లో స్వచ్ఛ అభియాన్‌ నిర్వహించి మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

నెలాఖరులో ప్రధాని పర్యటన!

ప్రధాని మోదీ ఈనెలాఖరులో రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఇందులో ఒకటి ఎన్టీపీసీ 800 మెగావాట్ల ప్లాంటును జాతికి అంకితం చేయడమని చెప్పారు.

Updated Date - Jan 09 , 2024 | 04:19 AM