Share News

పథకాలు రద్దు చేస్తే లబ్ధిదారులతో కలిసి పోరాటం

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:00 AM

దళిత బంధు, గృహలక్ష్మి, బీసీలకు రూ.లక్ష సాయం, గొర్రెల పంపిణీ కార్యక్రమాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని.. ఇలా చేస్తే వాటి లబ్ధిదారులతో కలిసి పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

పథకాలు రద్దు చేస్తే లబ్ధిదారులతో కలిసి పోరాటం

ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ 420 హామీలు

అప్పులు, శ్వేత్రపత్రాలంటూ దాటవేసే డ్రామాలు

రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

ఈ సారి నిజామాబాద్‌ ఎంపీ సీటు మాదే: కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి): దళిత బంధు, గృహలక్ష్మి, బీసీలకు రూ.లక్ష సాయం, గొర్రెల పంపిణీ కార్యక్రమాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని.. ఇలా చేస్తే వాటి లబ్ధిదారులతో కలిసి పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రైతు బంధు డబ్బులు వేయకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ అస్తవ్యస్త పనితీరు, పాలనను పార్టీ కేడర్‌ ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలో క్షేత్రస్థాయి నుంచి మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. కేడర్‌ను పటిష్టం చేసుకుని ప్రజల్లో వెళ్తామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో కేటీఆర్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం ఉండాలని.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా, ప్రజల ప్రయోజనాలపై గట్టిగా కొట్లాడితే విజయం వరిస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే.. నిజామాబాద్‌ పార్లమెంటు స్థానంలో ఓట్ల పరంగా బీఆర్‌ఎస్‌ మొదటి స్థానంలో ఉందని, ఎంపీ సీటు తమ పార్టీకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోటీకి అవకాశం ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ అడ్డగోలుగా 420 హామీలిచ్చిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేమని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలోనే చెప్పారని.. అప్పులు, శ్వేతపత్రాల పేరిట తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. పేదల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల రద్దుకు కుట్రలు పన్నతోందన్నారు. ఇది దుర్మార్గ చర్యని కేటీఆర్‌ విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తాము దళిత బంధును ప్రారంభించామని చెప్పారు. దళితులను కేలం ఒటు బ్యాంకుగా చూసిన కాంగ్రెస్‌, ఎన్నికల సందర్భంగా ఆ పథకం లబ్ధిని రూ.12 లక్షలకు పెంచుతామని చెప్పి మరిచిపోయిందన్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోందని, వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తోందని ఆరోపించారు. గొర్రెల పంపిణీ కోసం డీడీలు కట్టినవారిని పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గానికి 3 వేలమందిని గృహలక్ష్మి పథకం కింద ఎంపిక చేశామని, ప్రొసీడింగ్‌ అందాక, దాన్ని రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత ప్రభుత్వంపై నిందారోపణలు చేస్తోందన్నారు. 420 హామీలను విస్మరించి.. 6 గ్యారెంటీల పేరుతో తప్పించుకోవాలని చూస్తే ఊరుకోమన్నారు. ప్రతి పథకానికి దరఖాస్తు కోసం ప్రజలను లైన్లలో నిల్చోబెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారని, తమ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ సర్కారు ప్రజలను ఇబ్బందిపెడుతోందన్నారు. పార్టీ సెక్రటరీ జనరల్‌ కేకే, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్‌.రమణ, నిజామాబాద్‌ పార్లమెంటు పరిధి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 04:01 AM