తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భీకర యుద్ధం
ABN , Publish Date - Jan 18 , 2024 | 04:30 AM
రాకెట్ లాంచర్లతో దాడులు.. తుపాకీ తూటాల మోతలతో ఛత్తీ్‌సగఢ్-తెలంగాణ సరిహద్దులు మంగళవారం రాత్రంతా దద్దరిల్లాయి.
పామేడులో సీఆర్‌పీఎఫ్ క్యాంపులను చుట్టుముట్టిన
3 వేల మంది మావోయిస్టులు
మంగళవారం రాత్రి నుంచి కాల్పులు.. గెరిల్లా దాడులు
9 మంది పోలీసులకు గాయాలు.. తప్పించుకున్న ఏపీ కూలీలు
చెట్లు నరికి.. ల్యాండ్ మైన్స్ పేల్చి దిల్సాపురం రోడ్డు బ్లాక్
అదనపు బలగాలు చేరుకోకుండా ప్లాన్.. హిడ్మా వ్యూహం?’’
చర్ల, జనవరి 17: రాకెట్ లాంచర్లతో దాడులు.. తుపాకీ తూటాల మోతలతో ఛత్తీ్‌సగఢ్-తెలంగాణ సరిహద్దులు మంగళవారం రాత్రంతా దద్దరిల్లాయి. ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామంలోని మూడు సీఆర్పీఎఫ్ క్యాంపులతోపాటు.. కొత్తగా నిర్మిస్తున్న ధర్మారం శిబిరాన్ని సుమారు 3 వేల మంది మావోయిస్టులు చుట్టుముట్టి.. రాకెట్ లాంచర్లతో దాడులకు తెగబడ్డారు. మంగళవారం రాత్రి 6 గంటల సమయంలో మొదలైన ఈ దాడులు.. బుధవారం తెల్లవారుజాము వరకు.. సుమారు 10 గంటల పాటు కొనసాగాయి. పక్కా వ్యూహంతో ఈ శిబిరాలను చుట్టుముట్టిన మావోయిస్టులు.. బ్యాకప్ ఫోర్స్ రావడానికి అవకాశమే లేకుండా చర్ల-పామేడు, పామేడు-దిల్సాపురం రోడ్లను దిగ్బంధించారు. ఎక్కడికక్కడ కల్వర్టుల వద్ద మందుపాతరలతో రోడ్లను ధ్వంసం చేశారు. సీఆర్పీఎఫ్ బలగాలకు అండగా బ్యాకప్ ఫోర్స్ రాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికి రోడ్డుపై అడ్డంగా వేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు తీవ్ర గాయాలపాలైనట్లు తెలిసింది. ఏపీకి చెందిన 40 మంది కూలీలు త్రుటిలో మావోయిస్టుల రాకెట్, తుపాకీ దాడుల నుంచి తప్పించుకున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని చెబుతున్న సీఆర్పీఎఫ్ వర్గాలు.. ఘటన వివరాలను వెల్లడించడానికి నిరాకరించాయి. అటు మావోయిస్టుల వైపు నుంచి కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
300కు పైగా రాకెట్ దాడులు
ఘటన జరిగిన స్థలం సమీపం వరకు ‘ఆంధ్రజ్యోతి’ వెళ్లగలిగింది. అయితే.. మావోయిస్టులు ఎక్కడికక్కడ మందుపాతరలు పెట్టారని, ముందుకు వెళ్లడం కుదరదని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. పామేడ్ పోలీ్‌సస్టేషన్ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వరకే అనుమతించారు. అసలు ఏం జరిగిందో చెప్పడానికి నిరాకరించారు. అయితే.. స్థానిక గ్రామస్థులు, ప్రత్యక్ష సాక్షులు, ఏపీకి చెందిన పలువురు కూలీలు మాత్రం రాత్రంతా బాంబుల మోతతో అటవీ ప్రాంతం దద్దరిల్లిందని చెప్పారు. క్యాంపుల చుట్టూ దాదాపు 3 వేల మంది వరకు మావోయిస్టులు తెరిపినివ్వకుండా కాల్పులు జరుపుతుండడం.. నిప్పురవ్వలు సీఆర్పీఎఫ్ 151వ బెటాలియన్‌కు చెందిన శిబిరాల వైపు దూసుకురావడం చూశామన్నారు. ‘‘రాత్రి 6 గంటల సమయంలో ఈ మార్గం మీదుగా వెళ్తున్న వాహనదారులను మావోయిస్టులు నిలిపివేశారు. వేరే మార్గంలో వెళ్లాలని సూచించారు’’అని స్థానికులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో మావోయిస్టులు పెద్దవి, చిన్నవి కలిపి 300కు పైగా రాకెట్లను ప్రయోగించినట్లు తెలిసింది. ఏకే-47, ఇతర అధునాతన రైఫిళ్లతోపాటు.. తూంబాంబులను వాడారని సమాచారం. బుధవారం ఉదయం ఈ మూడు క్యాంపుల సమీపంలో ఎక్కడ చూసినా.. తూటాలు, రాకెట్లు, పేలకుండా మిగిలిన రాకెట్లు కనిపించాయని సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి. ప్రతిదాడుల్లో భాగంగా సీఆర్పీఎఫ్ పోలీసులు కూడా ప్యారాబాంబు(ఆకాశంలోకి వెళ్లి.. పరిసరాలు కనిపించేలా వెలుగుతూనే.. నేలపై పడ్డాక పేలిపోయే మందుపాతరలు)లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల వ్యూహాత్మక దాడి తర్వాత.. సీఆర్పీఎఫ్ భారీ కూంబింగ్ ఆపరేషన్‌ను చేపట్టింది. పామేడు ప్రధాన రహదారిలోనూ మావోయిస్టులు అక్కడక్కడా మందుపాతరలను పెట్టడంతో.. వాటిని నిర్వీర్యం చేస్తూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. అక్కడక్కడా పేలకుండా మిగిలిన మావోయిస్టుల రాకెట్లను నిర్వీర్యం చేస్తున్నారు. మావోయిస్టులు మందుపాతరలు పెట్టడం, చెట్లను అడ్డంగా నరికి వేయడం వల్ల పోలీసులు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ధర్మారం, రాచపల్లి, పరిసర గూడేలకు చెందిన ఆదివాసీలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. బుధవారం రాత్రి కడపటి వార్తలందేసరికి కూడా ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
హిడ్మా పనేనా?
సుమారు మూడువేల మంది మావోయిస్టులతో సీఆర్పీఎఫ్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడిచేయడాన్ని బట్టి.. కొన్ని రోజులుగా రెక్కీలు జరిపి, భారీ వ్యూహాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ తరహా దాడులకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వీ హిడ్మా సిద్ధహస్తుడు. 2021 ఏప్రిల్ 3న బీజాపూర్ అడవుల్లోని తెర్రాం గ్రామం వద్ద త్రిశూల వ్యూహంతో 23 మంది సీఆర్పీఎ్‌ఫ/కోబ్రా జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. దొరికిన వారిని దొరికినట్లు పాశవికంగా హతమార్చారు. కోబ్రా దళానికి చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ తన తుపాకీ మేగజీన్‌ను లోడ్ చేసుకునేలోపే.. మూకుమ్మడి దాడి చేసి, అతని రెండు చేతులను నరికేశారు. హిడ్మా అక్కడున్న విషయాన్ని పోలీసులకు లీక్ చేసి, చిలిగేరు, జొన్నగూడ గ్రామాల్లో కాపుకాచి, తెర్రాం వద్ద తన వ్యూహాన్ని అమలు చేశాడు. బీజాపూర్ జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు ఈ అడువులపై గట్టి పట్టుంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హిడ్మా.. ఇప్పుడు పామేడు ఘటనతో మళ్లీ తన ఉనికిని చాటుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2021 ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. హిడ్మాను వేటాడడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ ప్రహర్-3’ను చేపట్టింది. కానీ, హిడ్మా జాడను గుర్తించలేకపోయింది. గత ఏడాది హిడ్మాను సీఆర్పీఎఫ్ జవాన్లు చుట్టుముట్టారని, డ్రోన్లతో అతని కదలికలను గుర్తించారనే వార్తలు వెలువడ్డా.. త్రుటిలో తప్పించుకున్నాడు.
త్రుటిలో తప్పించుకున్న ఏపీ వాసులు
పామేడు శివార్లలో చింతవాగు వద్ద నూతనంగా నిర్మిస్తున్న ధర్మారం బేస్‌క్యాంపు వద్ద ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన 40 మంది కూలీలు పనిచేస్తున్నారు. సుమారు 10 గంటల పాటు కొనసాగిన మావోయిస్టుల కాల్పులు.. పోలీసుల ఎదురుకాల్పులతో వారంతా గజగజ వణికిపోయారు. రాకెట్‌లు, తూంబాంబులు తమ తాత్కాలిక ఆవాసాలకు అత్యంత సమీపం నుంచి దూసుకువెళ్లాయని వారు వివరించారు. ‘‘మంగళవారం రాత్రి బాంబుల మోతతో మేము ఉంటున్న ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఏం జరుగుతుందా అని బయటకు వచ్చి చూస్తే.. పక్క నుంచి తూటాలు దూసుకుపోయాయి. మేం ఉంటున్న తాత్కాలిక ఆవాసానికి పక్కనే చెట్లు ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. ఉదయం చూస్తే.. ఆ చెట్లకు అవతలి వైపు తూటాలు కనిపించాయి’’ అని వారు పరిస్థితిని ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. తాము నిర్మిస్తున్న ధర్మారం బేస్‌క్యాంపు పనులను పలుమార్లు మావోయిస్టులు వ్యతిరేకించినట్లు తెలిపారు.