మూన్నాళ్ల ముచ్చటగా జంక్షన్ల హంగులు
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:58 AM
నగరంలో చేపట్టిన జంక్షన్ల సుందరీకరణ పనులు మూడునాళ్ల ముచ్చటగా మిగిలిపోయాయి. రెండేళ్ల క్రితం కరీంనగర్‌లోని ప్రధాన జంక్షన్లను ఆదునిక హంగులతో సుందరీకరణ చేశారు. నగర వాసులు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు జంక్షన్ వద్ద నిలబడి సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేవారు.
- పనిచేయని పౌంటేన్లు... వెలుగని లైట్లు
- ప్రజాధనం దుర్వినియోగంపై విమర్శలు
కరీంనగర్ టౌన్, అక్టోబర్ 20 (ఆంధ్రజ్యోతి): నగరంలో చేపట్టిన జంక్షన్ల సుందరీకరణ పనులు మూడునాళ్ల ముచ్చటగా మిగిలిపోయాయి. రెండేళ్ల క్రితం కరీంనగర్‌లోని ప్రధాన జంక్షన్లను ఆదునిక హంగులతో సుందరీకరణ చేశారు. నగర వాసులు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు జంక్షన్ వద్ద నిలబడి సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేవారు. రాత్రి వేళలో నగరంలోకి కొత్తగా వచ్చినవారు జంక్షన్లను, ప్రధాన రహదారులను చూసి ఇది కరీంనగరేనా అంటూ ఆశ్చర్యపోయేవారు. ఒక్కో జంక్షన్‌కు 50 లక్షల చొప్పున ఖర్చుచేసి వివిధ డిజైన్లతో ఆధునిక హంగులతో అభివృద్ధి చేశారు. రెండేళ్లు కూడా తిరుగక ముందే జంక్షన్ల హంగులు తగ్గాయి. లైట్లు వెలగడం లేదు. ఫౌంటైన్లు పని చేయడ లేదు. నగర నడిబొడ్డున తెలంగాణచౌక్‌లోని ఇందిరాగాంధీ జంక్షన్‌ను అత్యధికంగా 1.06 కోట్లతో సుందరీకరించారు. అత్యాధునిక హంగులతో సుందరంగా తీర్చిదిద్దిన ఈ జంక్షన్‌ను చూసి నగర వాసులు సంతోషపడ్డారు. జంక్షన్ సొబుగులు రెండేళ్ళకే కనుమరుగై పోయాయి. ఇప్పుడు ఈ జంక్షన్‌లో లైట్లు కూడా వెలగడం లేదు. ఆర్టీసీ బస్‌స్టేసన్ ఇన్‌గేట్ ఎదట శ్రీపాద జంక్షన్, మారుతీనగర్‌చౌరస్తాలోని పడవ నమూనాతో కూడిన జంక్షన్, తీగలవంతెన సమీపంలో రెండు జంక్షన్లను, కోర్టు చౌరస్తా జంక్షన్‌ను, నాకా చౌరస్తా జంక్షన్‌ను, కార్ఖానగడ్డ గాంధీ జంక్షన్‌ను, సుడా నిధులతో మంచిర్యాల చౌరస్తా జంక్షన్‌ను, కమాన్ జంక్షన్‌ను లక్షలతో సుందరీకరించారు. వాటన్నింటి పరిస్థితీ ఇంతే.. వన్‌టౌన్ పోలీసు స్టేసన్ ఎదుట చొక్కారావు, తెలంగాణతల్లి జంక్షన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అవి ఇప్పటీకీ పూర్తికాలేదు.. జంక్షన్ల ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. పనుల్లో నాణ్యత లేక పోవడం, లక్షలు వెచ్చించిన ఈ జంక్షన్ల నిర్వహణను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం జంక్షన్ల సుందరీకరణ, అభివృద్ధి, నిర్వహణపై దృష్టి సారించాలని, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తిరిగి ఫౌంటైన్లు, లైటింగ్ పని చేసేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.