‘తెల్ల’బోతున్న రైతులు
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:50 AM
ఆరుగాలం శ్రమించి, కష్టపడి పండించినా గిట్టుబాటు ధర గగనంగా మారింది. విధిలేని పరిస్థితిలో పత్తి రైతులు ప్రైవేట్ వ్యాపారుల మాటలు నమ్మి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
‘తెల్ల’బోతున్న రైతులు
తెల్లబంగారానికి దళారుల బెడద
దేవరకొండ డివిజనలో పత్తి రైతుల ఇబ్బందులు
తూకాలలో మోసం
తేమ పేరుతో తక్కువ ధరకు కొనుగోలు
పట్టించుకోని అధికారులు
దేవరకొండ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించి, కష్టపడి పండించినా గిట్టుబాటు ధర గగనంగా మారింది. విధిలేని పరిస్థితిలో పత్తి రైతులు ప్రైవేట్ వ్యాపారుల మాటలు నమ్మి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసినా తేమపేరుతో ఆంక్షలు విధిస్తుండటంతో విధిలేని పరిస్థితిలో రైతులు పత్తిని వ్యాపారులు చెప్పిన రేటుకే విక్రయించే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో దేవరకొండ డివిజనలో 1.50 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిపంట సాగు చేశారు. కానీ ఆగస్టు నెలలో వర్షాలు ఎక్కువగా కురవడంతో పత్తిచేలకు ఎర్ర తెగులురావడంతో దిగుబడి తగ్గింది. పత్తి తీసే సమయానికి తుపానతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో పత్తి తడిసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తిని ఆరబెట్టి విక్రయాలు చేద్దామంటే సీసీఐ కేంద్రాల్లో తేమ పేరుతో ఆంక్షలు విధిస్తున్నారు. విధిలేని పరిస్థితిలో దళారీలు క్వింటాల్‌కు రూ.5500 నుంచి 6 వేల వరకు విక్రయిస్తున్నారు. తూకాల్లోనూ వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తూకాల్లోనూ మోసం
పత్తి రైతులను తూకాల్లోనూ వ్యాపారులు మోసం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తూనికలు, కొలతలు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో ధ్రువీకరణ చేయని తూకాల యంత్రాలను వాడుతూ మోసం చేస్తున్నారు. ఇటీవల తూనికల, కొలతలశాఖ జిల్లా అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో నాంపల్లి, చండూ రు, మునుగోడు మండలాలోని పలు గ్రామాల్లోని తనిఖీలు నిర్వహించి ధ్రువీకరించని క్వాంటా బా ట్లు, ధ్రువీకరణ పత్రాలులేని తూకం యంత్రాలు వాడుతున్న నలుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసిన సంఘటనలు ఉన్నాయి. దేవరకొండ డివిజనలో గిరిజన రైతుల అమాయకత్వా న్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాపారులు గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడి వారు నిర్ణయించిన ధరకే పత్తిని కొనుగోలు చేసి మోసాల కు గురి చేస్తున్నారు. ఎకరాకు రూ. 20 వేల వర కు పెట్టుబడులు పెట్టామని ఆ పంట ఎకరాకు 5 నుంచి 10 క్వింటాల్‌లు కూడా చేతికి రావడంలేద ని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.7521 మద్దతు ధర ఇస్తున్నా సీసీఐ అధికారులు తేమపేరుతో ఆంక్ష లు విధిస్తూ కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. విధిలేని పరిస్థితిలో వ్యాపారులకే విక్రయిస్తున్నామని వారు చెబుతున్నారు. తూనికలు, కొలతలశాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించి రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతులతో పాటు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
సీసీఐ కేంద్రాల ఏర్పాటు ...
దేవరకొండ డివిజనలోని చింతపల్లిలో నాలు గు, పీఏపల్లిలో మూడు, కొండమల్లేపల్లిలో ఒక టి, డిండిలో ఒకటి, గుర్రంపోడులో ఒకటి సీసీ ఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశా రు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు రూ.7521 మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాని సీసీఐ కేంద్రాల్లో తేమ పే రుతో ఆంక్షలు విధిస్తుండటంతో చందంపేట, నే రేడుగొమ్ము మండలాలలోని రైతులు విధిలే ని పరిస్థితిలో దళారులకే పత్తిని విక్రయిస్తున్నారు.
పత్తికి గిట్టుబాటు ధర రావడం లేదు
తనకున్న ఎకరంతో పాటు పది ఎకరాలు కౌలుకు తీసుకొని ఈ ఏడాది రెండు లక్షల వరకు ప్రైవేట్ అప్పులు చేసి పత్తిపంట సాగు చేశా ను. వర్షాలు సకాలంలో లేకపోవడం, అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గింది. దీనికితోడు తెగుళ్లు, కూలీల కొరత ఏర్పడింది. ఎకరాకు 10 క్వింటాళ్లు రావాల్సి ఉండగా దిగుబడి 4 క్వింటాళ్లకు పడిపోయింది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు.
జల్లెల శీను, కౌలు రైతు, చందంపేట
ఆంక్షలు విధించకుండా కొనుగోలు చేయాలి
సీసీఐ కేంద్రాల్లో ఆంక్షలు విధించకుండా పత్తిని కొనుగోలు చేయాలి. తేమపేరుతో ఆంక్షలు విధిస్తుండం తో రైతులు విధిలేని పరిస్థితిలో వ్యా పారుల కు విక్రయిస్తున్నారు. దళారీలు రైతులను మోసం చే స్తున్నారు. అధికారులు దాడులు చేసి దళారులపై చర్యలు తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.
సుదర్శనరెడ్డి, సీపీఐ దేవరకొండ మండల కార్యదర్శి.
సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి
పత్తి రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలి. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.7521 మద్దతు ధర కల్పిస్తుంది. తేమలేకుండా ఆరబెట్టుకొని పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించాలి. రైతుల ఖాతాలలోనే డబ్బులు జమ అవుతాయి. దళారులను నమ్మవద్దు.
- శ్రీరాములు, ఆర్డీవో, దేవరకొండ