Share News

రైతు భరోసా 10ఎకరాలకు ఇవ్వాలి

ABN , Publish Date - Dec 30 , 2024 | 01:01 AM

ప్రభుత్వం బేషరతుగా ప్రతీ రైతుకు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు డీసీసీబీ చైర్మన కుంభం శ్రీనివాస్‌రెడ్డి కోరారు.

 రైతు భరోసా 10ఎకరాలకు ఇవ్వాలి
మంత్రి తుమ్మలను కలిసిన డీసీసీబీ చైర్మన కుంభం శ్రీనివాస్‌ రెడ్డి

రైతు భరోసా 10ఎకరాలకు ఇవ్వాలి

మంత్రి తుమ్మలకు డీసీసీబీ చైర్మన శ్రీనివాస్‌రెడ్డి వినతి

నల్లగొండ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం బేషరతుగా ప్రతీ రైతుకు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు డీసీసీబీ చైర్మన కుంభం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి నాయకత్వంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. రైతులకు పెట్టుబడి రూపేన అందాల్సిన రైతుభరోసాను ఎన్నికల ముందు ఎకరానికి రూ.7500 చెల్లిస్తామని ప్రకటించినందున ఈ సీజనలో సంక్రాంతి పండుగ నుంచి రైతుభరోసా నిధులు జమ చేయాలన్నారు. గత ప్రభుత్వం ఎకరాకు రూ.5వేలు మాత్రమే ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరాకు రూ.7500లు, సంవత్సరానికి ఎకరాకు రూ.15వేలు ఇవ్వడం హర్షణీయమన్నారు. అదేవిధంగా రుణమాఫీ నిధులను వెంటనే కేటాయించి మిగిలిన రైతులందరికీ రుణమాఫీని వర్తింప చేయాలని కోరారు. రైతుభరోసాతో పాటు రుణమాఫీ పూర్తి చేయడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీని అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేసిందన్నారు. సహకార బ్యాంకుల బలోపేతం కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీసీసీబీ రూ.2700 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని, దానిని రూ.3వేల కోట్ల టర్నోవర్‌ తీసుకెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ సంకాంత్రి పండుగ తర్వాత రైతుభరోసా నిధులు జమ చేస్తామని, అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తింప చేస్తామన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 01:01 AM