Share News

కర్షకులకు తీన్‌మార్‌

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:10 AM

ఖరీఫ్‌ సీజన్‌లో అన్నదాతలకు తీన్‌మార్‌ తీపి కబురు అందనుంది. రైతులకు భరోసాగా ఉండేందుకు కాంగ్రెస్‌ ప్రకటించిన మూడు కీలక హామీలను వానా కాలం నుంచి అమలు చేసేందుకు

కర్షకులకు తీన్‌మార్‌

ఖరీఫ్‌ సీజన్‌లో రైతు భరోసా,

పంటల బీమా, వరికి రూ. 500 బోనస్‌

3 పథకాలకు వానాకాలం పంట నుంచే శ్రీకారం

విధివిధానాలపై కసరత్తు చేస్తున్న వ్యవసాయ శాఖ

‘కోడ్‌’ ముగియగానే పట్టాలెక్కనున్న పథకాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌లో అన్నదాతలకు తీన్‌మార్‌ తీపి కబురు అందనుంది. రైతులకు భరోసాగా ఉండేందుకు కాంగ్రెస్‌ ప్రకటించిన మూడు కీలక హామీలను వానా కాలం నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా రైతు భరోసా, పంటల బీమా, వరికి రూ.500 బోనస్‌ పథకాలను జూన్‌ నుంచి ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే యాసంగి సాగు పురోగతిలో ఉంది. గడచిన మూడు నెలల్లో రైతులకు మేలుచేసే సంక్షేమ పథకాలపై రేవంత్‌ సర్కారు దృష్టిసారించలేదు. ఆరు గ్యారెంటీలు, మహాలక్ష్మి పథకాలపైనే ప్రభుత్వం ఎక్కువ ఫోకస్‌ పెట్టింది. కొత్త వ్యవసాయ క్యాలెండర్‌ జూన్‌ నుంచి మొదలవుతుంది. అప్పుడే కొత్త వ్యవసాయ పథకాలను అమలులోకి తీసుకురావాలని రేవంత్‌ సర్కారు సమాయత్తం అవుతోంది. మరోవైపు ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్‌ నాలుగో తేదీన పూర్తవుతుంది. అప్పటి వరకు విధివిధానాలను రూపొందించుకొని సిద్ధంగా ఉంటే.. ‘కోడ్‌’ ఎత్తివేయగానే పథకాలను పట్టాలెక్కించవచ్చనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్నదాతలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు అనుగుణంగా మూడు పథకాలను ఏకకాలంలో అమలుచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరు సందర్భాల్లో ప్రకటించారు.

రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు..

కేసీఆర్‌ ప్రభుత్వం ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధు పంపిణీ చేసింది. వానాకాలంలో రూ.5 వేలు, యాసంగిలో రూ.5 వేల చొప్పున ఇచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పెట్టుబడి సాయాన్ని 50 శాతం పెంచబోతోంది. అంటే.. ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు పంపిణీ చేయబోతోంది. ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ‘రైతుభరోసా’ పేరుతో ఈ పథకాన్ని అమలుచేయనుంది. అయితే కేసీఆర్‌ సర్కారు హయాంలో రైతుబంధు పథకంలో నిధుల దుర్వినియోగం జరిగింది. అనర్హులైన వేలాది మందికి పెట్టుబడి సాయం అందించారు. వ్యవసాయ భూముల జాబితాలో ఉంటే చాలు.. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, రోడ్లు, ఫామ్‌ హౌస్‌లు, వెంచర్లకు కూడా రైతుబంధు ఇచ్చారు. సంపన్నులు, సినీ ప్రముఖులకూ సాయం అందించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులకే రైతు భరోసా ఇస్తామని, అనర్హులకు ఇచ్చేదిలేదని ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన ‘మీట్‌ ది మీడియా’లో కూడా సీఎం రేవంత్‌రెడ్డి ‘రైతు భరోసా’ అమలుపై స్పష్టత ఇచ్చారు. కేవలం సాగు భూములకే నిధులు ఇస్తామని, పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అనర్హులను ఏరిపారేస్తామని, ఖరీఫ్‌ నుంచి అర్హులకే రైతు భరోసా అమలు చేస్తామని సీఎం ప్రకటించారు.

పంటల బీమాకు లైన్‌ క్లియర్‌..

దేశంలో పంటల బీమా పథకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రైతుబంధు ఇస్తున్నామనే నెపంతో కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని ఎత్తివేసింది. పీఎం-ఎ్‌ఫబీవై(ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన) నుంచి ఐదేళ్ల క్రితం బయటకు వచ్చింది. దీంతో ప్రకృతి విపత్తులు వచ్చినపుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని గ్రహించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. వానాకాలం నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనలో చేరుతున్నట్లు ప్రకటించింది. ప్రీమియంలో కేంద్ర ప్రభుత్వ వాటాధనం పోగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతుల వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించింది. అంటే రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని ‘ఉచితంగా’ అమలు చేయాలని రేవంత్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

వరి క్వింటాకు రూ.500 బోనస్‌..

ప్రస్తుతం రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) ప్రకారమే కొనుగోళ్లు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నారు. ప్రస్తుతం సాధారణ వరి ధాన్యానికి క్వింటాకు రూ.2,183.. ఏ-గ్రేడు ధాన్యానికి రూ.2,203 ఎమ్మెస్పీ ఉంది. అయితే, అధికారంలోకి వస్తే వరికి రూ.500 బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇప్పుడున్న ఎమ్మెస్పీ ప్రకారం లెక్కిస్తే.. సాధారణ రకాలకు రూ. 2,683.. ఏ- గ్రేడు ధాన్యానికి రూ.2,703 వచ్చే అవకాశం ఉంది. ఈ పథకాన్ని కూడా ఖరీఫ్‌ సీజన్‌ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - Apr 03 , 2024 | 03:10 AM