రైతు బంధుపై తప్పుడు ప్రచారం
ABN , Publish Date - Apr 02 , 2024 | 04:48 AM
రైతుబంధుపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. గత ప్రభుత్వం మే నెలాఖరు వరకు యాసంగి రైతు బంధు అందించిందని, ఈసారి
ఇప్పటికే ఐదెకరాల్లోపు భూములకు ఇచ్చాం..
నెలాఖరులోగా మిగిలిన వాటికీ పంపిణీ
వానాకాలం నుంచి వరికి 500 బోనస్
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
కేసీఆర్ వల్లనే తెలంగాణలో కరువు
ఎంపీగా బండి సంజయ్ సాధించిందేమిటి: పొన్నం
కేసీఆర్ మొసలి కన్నీరు: శ్రీధర్ బాబు
పదవి పోగానే రైతులు గుర్తొచ్చారా..?
కేసీఆర్‌పై మంత్రి కొండా సురేఖ ధ్వజం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రైతుబంధుపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. గత ప్రభుత్వం మే నెలాఖరు వరకు యాసంగి రైతు బంధు అందించిందని, ఈసారి ఈ నెలాఖరులోగానే ఇస్తామని తెలిపారు. ఇప్పటికే 5 ఎకరాల్లోపు వరకు రైతు బంధు జమ చేశామని, మిగిలిన రైతులకు నెలాఖరులోగా సహాయం అందిస్తామని వెల్లడించారు. ఇప్పటికే 92.3 శాతం మందికి రైతు బంధు ఇచ్చామని.. ఇంకా 4 లక్షల మందికి మాత్రమే ఇవ్వాల్సి ఉందన్నారు. వానాకాలం రైతుబంధు సాయంపై అసెంబ్లీలో చర్చించి.. విధి విధానాలు రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ-ఏపీ సరిహద్దులోని అశ్వారావుపేట మండలం కొత్తకన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయాన్ని మంత్రి తుమ్మల సోమవారం దర్శించుకున్నారు. అనంతరం మండలంలోని పాతకన్నాయిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరికి రూ.500 బోన్‌సను వచ్చే వానాకాలం అమలు చేస్తామన్నారు. వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం, ఇతర ఉత్పత్తులను కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కంటే తక్కువకు కొనుగోలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జల విద్యుత్ కోసం ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను వినియోగించడంతోనే నీటి ఎద్దడి ఏర్పడిందని తుమ్మల వివరించారు. కొన్నిచోట్ల చివరి ఆయకట్టు పంటలు ఎండిపోతే దాన్ని బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ వల్లనే కరువు: పొన్నం
కరువుకు కాంగ్రెస్ కాదు.. కేసీఆరే కారణమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాకాలం వచ్చిందా..? బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్షాకాలం ఉందా..? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో వర్షాలు కురవలేదని.. కరువుకు కేసీఆరే కారణమని విమర్శించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సరైన వర్షాలు లేకపోవడంతో వేసవికి ముందే భూగర్భజలాలు అడుగంటిపోయాయని.. ఇది తెలియకుండా కేసీఆర్ మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. వాటితో నీటి సమస్య ఉన్న పల్లెల్లో బోర్లు వేయిస్తామని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్, అక్కన్నపేట, చిగురుమామిడి మండలాలకు సాగునీరు అందనుందని.. దేవాదుల ద్వారా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు నీరు అందుతుందని పేర్కొన్నారు. ఐదేళ్లు ఎంపీగా ఉండి బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంకా కోతలే పూర్తికాలేదని, బండి సంజయ్ మాత్రం రైతుల సమస్యలపై కల్లాల వద్ద పడుకుంటానని అంటున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఫొటోతో గెలిచే పరిస్థితి లేదని గ్రహించి రాముడి ఫొటోతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ మొసలి కన్నీరు: శ్రీధర్ బాబు
గడచిన పదేళ్లలో రైతులను పట్టించుకోని కేసీఆర్, బీఆర్‌ఎస్ నేతలు.. ఎంపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మొసలి కన్నీరు కారుస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో కొంత పంట నష్టం జరిగితే ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. పెద్దపల్లిలో సోమవారం శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.
కేసీఆర్ భయపడుతున్నారు?:సురేఖ
గత పదేళ్లలో ఏనాడూ రైతులను పట్టించుకోని కేసీఆర్‌కు.. పదవి పోగానే అన్నదాతలు గుర్తుకొచ్చారని మంత్రి కొండా విమర్శించారు. గిట్టుబాటు ధరలు అడిగిన రైతులకు బేడీలు వేసిన చరిత్ర ఆయనదని చెప్పారు. సోమవారం వరంగల్‌లో సురేఖ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనపై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు ఆయనను దూరం పెట్టారని, బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుంటే కేసీఆర్ అభద్రతాభావానికి లోనవుతున్నారని, ఆయన భయపడుతున్నారని అన్నారు.. ఫోన్ ట్యాపింగ్‌లు చేస్తూ హీరోయిన్లను బ్లాక్‌మెయిల్ చేసిన ఘనత కేటీఆర్‌దన్నారు. అనేక కుంభకోణాల్లో ఇరుక్కున్న కేసీఆర్, కేటీఆర్‌లకు మాట్లాడే హక్కు లేదన్నారు.