Manchiryāla- తప్పుడు ఆరోపణలు సహించం
ABN , Publish Date - Aug 21 , 2024 | 10:40 PM
బీఆర్‌ఎస్ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
చెన్నూరు, ఆగస్టు 21: బీఆర్‌ఎస్ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా చట్టం ప్రకారం తనకు పామ్‌హౌస్ లేదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఒక వేళ ఆరోపణలు నిరూపించకపోతే కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేస్తానన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోట్లాది రూపాయలతో నిర్మించి ఆ నీటిని కేసీఆర్ పామ్‌హౌస్‌కు తరలించుకుని వెళ్లారని విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలన మోసాలతోనే సాగిందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చెన్నూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల, ఎస్సీ బాలుర వసతి గృహాలను సందర్శించారు. భోజనం, ఇతర సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం మెనూ ప్రకారం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీజడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, నాయకులు హిమవంతరెడ్డి, రవికుమార్, సూర్యనారాయణ, బాపురెడ్డి, బాపగౌడ్, బషీరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిష్టంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే సందర్శించారు. కళాశాలలో నీటి కొరత ఉందని విద్యార్థులు తెలపడంతో స్పందించిన ఆయన ఎమ్మెల్యే నిధుల నుంచి బోర్‌వెల్‌కు నిధులు మంజూరు చేయించి పనులను ప్రారంభించారు. అనంతరం అధ్యాపకులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పట్వర్దన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
జైపూర్: మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. మండల కేంద్రంలోని మహాలక్ష్మీ మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం ఇందిర మహిళ శక్తి కార్యక్రమంలో సూక్ష్మ రుణాల పంపిణీలో బాగంగా ప్రభుత్వం డీఆర్‌డీవో ద్వారా పంపిణీ చేసిన యూనిట్ల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. మహిళా సంఘాలు వాటిని ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు. సూక్ష్మ రుణ పంపిణీ కార్యక్రమంలో భాగంగా త్వరగా యూనిట్లు మంజూరు చేసి వారి అభివృద్ధి లో భాగం కావాలని అధికారులకు సూచించారు. అనంతరం మొక్కలు నాటారు. పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రసూల్‌పల్లె గ్రామంలో ఐకేపీ సభ్యురాలు ప్రభుత్వం నుంచి రుణం తీసుకుని ఏర్పాటు చేసిన మొబైల్ ప్లాంటోనియంను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో కిషన్, ఎంపీడీవో సత్యనారాయణగౌడ్, ఐకేపీ ఏపీఎం రాజ్‌కుమార్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, విశ్వంభర్‌రెడ్డి, మంతెన లక్ష్మణ్, జక్కుల వెంకటేశం, నాయకులు పాల్గొన్నారు.