Share News

లైడార్‌ సర్వే ఫలితాల పరిశీలనలో అధికారుల వైఫల్యం

ABN , Publish Date - Mar 14 , 2024 | 06:00 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన లైడార్‌ సర్వేపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ దృష్టిపెట్టింది.

లైడార్‌ సర్వే ఫలితాల పరిశీలనలో అధికారుల వైఫల్యం

సర్వే ఆధారంగానే కాళేశ్వరం డీపీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన లైడార్‌ సర్వేపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ దృష్టిపెట్టింది. ఆ సర్వే ఆధారంగానే కాళేశ్వరం డీపీఆర్‌ సిద్ధం చేశారు. అయితే లైడార్‌ సర్వే జరిగిన తర్వాత ఆ సర్వే ఫలితాలు వాస్తవికంగా ఉన్నాయా..? లేవా...? అనే అంశంపై క్షేత్రస్థాయిలో సర్వే చేశారా...? చేయకుండా ఏ విధంగా డీపీఆర్‌కు ఆమోదం తెలిపారు.. అని ఇటీవలే నిపుణుల కమిటీ అధికారులను ప్రశ్నించింది. అయితే లైడార్‌ సర్వే ఫలితాలను క్రాస్‌ చెక్‌ చేయడంలో అధికారుల వైఫల్యమున్నట్లు ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల బృందం గుర్తించింది. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రీడిజైనింగ్‌ చేసి కాళేశ్వరం చేపట్టగా.. దీనికి ప్రధానంగా కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) నీటి లభ్యతపై ఇచ్చిన నివేదికతో పాటు వ్యాప్కోస్‌ చేసిన లైడార్‌ సర్వేనే ప్రామాణికం చేసుకున్నారు. కాగా, లైడార్‌ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించే విషయంలో లోపాలున్నట్లు ఎన్‌డీఎ్‌సఏ తాజాగా గుర్తించింది. ఏ సర్వే చేసినా.. దాన్ని పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉండగా.. ఆ పని చేయలేదని నిర్ధారించారు. దాంతో త్వరలో ఎన్‌డీఎ్‌సఏ ఇచ్చే నివేదికలో ఈ అంశం కూడా ప్రధానంగా ఉంటుందని తేల్చారు.

60 కిలోల పత్రాలు బట్వాడ..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో ముడిపడిన దాదాపు 60 కిలోల బరువైన పత్రాలను ప్రభుత్వం ఎన్‌డీఎ్‌సఏకు పంపించింది. హైదరాబాద్‌ నుంచి కొరియర్‌ ద్వారా ఢిల్లీలోని నీటిపారుదల శాఖ కార్యాలయానికి వీటిని పంపించి, అక్కడి నుంచి ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీకి పత్రాలను చేరవేశారు.

Updated Date - Mar 14 , 2024 | 06:55 AM