Share News

గోదావరి ఎక్స్‌ప్రెస్ కు యాభైఏళ్లు

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:40 AM

గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రైలు ప్రయాణికులకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రైలు.

గోదావరి ఎక్స్‌ప్రెస్ కు యాభైఏళ్లు

భాగ్యనగరం నుంచి వాల్తేరుకు మొదటి రైలు ఇదే

1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రైలు ప్రయాణికులకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రైలు. గోదావరి ఎక్స్‌ప్రె్‌సలో బెర్తు దొరికిందంటే.. బంగారం బిస్కెట్‌ దొరికినంతగా విశాఖ ప్రాంతవాసులు ఆనందపడతారంటే అతిశయోక్తికాదు. 1974 ఫిబ్రవరి 1న హైదరాబాద్‌-విశాఖపట్నం మధ్య ప్రారంభమైన మొట్టమొదటి రైలు ఇది. అంటే ఈ రైలు ప్రవేశపెట్టి గురువారానికి సరిగ్గా యాభై ఏళ్లు పూర్తయ్యాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రస్తుతం హైదరాబాద్‌(నాంపల్లి) స్టేషన్‌ నుంచి సాయంత్రం 5.05గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి మీదుగా.. విశాఖపట్నానికి చేరుకుంటుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్ధండులైన ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఇది ఎంతో ముఖ్యమైన రైలుగా ఉండేది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రావాలన్నా, ఇక్కడ్నుంచి స్వస్థలాలకు వెళ్లాలన్నా ఈ రైలులో వెళ్లడాన్ని సౌకర్యవంతంగా భావిస్తారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారుల తాకిడి కొంత తగ్గినా.. సాధారణ ప్రయాణికుల నుంచి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. దక్షిణ మధ్యరైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు మొత్తం 18స్టేషన్లలో ఆగుతుంది. 24 బోగీలతో అతిపొడవైన రైలుగా పేరుగాంచిన ఈ ఎక్స్‌ప్రెస్‌ 710 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురువారం సాయం త్రం గోదావరి ఎక్స్‌ప్రె్‌సకు రైల్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిఽధులు నాంపల్లి స్టేషన్‌లో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం విశేషం. దక్షిణ మధ్య రైల్వే కూడా ఈ ఎక్స్‌ప్రె్‌సను సర్వాంగ సుందరంగా అలంకరించింది. ఈ రైలు ఆగే అన్ని స్టేషన్లలో వేడుకలు జరిపారు. 1990లోనే 24 కోచ్‌లతో అతి పెద్ద రైలుగా పేరొందిన గోదావరి ఎక్స్‌ప్రె్‌సలో 2000 సంవత్సరం నుంచి ఫస్ట్‌క్లాస్‌ ఏసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 1993 నుంచే థర్డ్‌ ఏసీ కోచ్‌లున్న ఈ రైలు.. దక్షిణ మధ్య రైల్వేలోనే మొదటి ఏసీ కోచ్‌ ఉన్న ఎక్స్‌ప్రె్‌సగా పేరుగాంచింది. ఈ ఎక్స్‌ప్రె్‌సను నేరుగా దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ పర్యవేక్షిస్తారంటే దానికి ఉన్న ప్రాముఖ్యత చెప్పనక్కర్లేదు. రైలు నిర్వహణ నుంచి సమయపాలన, పరిశుభ్రత, ఆహార నాణ్యత, ఫిర్యాదులు, ఇతర ఆపరేషన్స్‌ అన్నీ ప్రతిరోజూ జీఎం టేబుల్‌ మీద ఉండాల్సిందేనని చెబుతుంటారు.

Updated Date - Feb 02 , 2024 | 10:20 AM