Share News

TG Politics: కాంగ్రెస్ మలి జాబితాపై ఉత్కంఠ!

ABN , Publish Date - Mar 21 , 2024 | 04:31 AM

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల మలి జాబితాపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సామాజిక సమతుల్యత, ఆర్థిక పరిస్థితి, నేతలకు ఇచ్చిన హామీలు, సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఈ నెల 19న సుదీర్ఘంగా చర్చించినా..

TG Politics: కాంగ్రెస్ మలి జాబితాపై ఉత్కంఠ!

  • ఇంకా విడుదల కాని కాంగ్రెస్‌ ‘లోక్‌సభ’ రెండో లిస్ట్‌

  • పెండింగ్‌లో ఖమ్మం, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, భువనగిరి, హైదరాబాద్‌

  • నేడు సీఈసీలో తెలంగాణపై లేని చర్చ..

  • ఇతర రాష్ట్రాల జాబితాతో కలిసి ప్రకటించే చాన్స్‌

  • కారు దిగిన నేతలకు కాంగ్రెస్‌లో సీట్లు!

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల మలి జాబితాపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సామాజిక సమతుల్యత, ఆర్థిక పరిస్థితి, నేతలకు ఇచ్చిన హామీలు, సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఈ నెల 19న సుదీర్ఘంగా చర్చించినా.. ఆరేడు సీట్లపై ఇంకా స్పష్టత రానట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, భువనగిరి, హైదరాబాద్‌ సీట్లలో అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో పడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని సీట్లపైనా స్పష్టత వచ్చాకే అధిష్ఠానం జాబితాను ప్రకటిస్తుందా.. లేక స్పష్టత వచ్చిన సీట్లకు అభ్యర్థులను గురువారం ప్రకటిస్తుందా.. అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. 19న జరిగిన సీఈసీ సమావేశంలో సికింద్రాబాద్‌ (దానం నాగేందర్‌), మల్కాజిగిరి (పట్నం సునీతా మహేందర్‌రెడ్డి), చేవెళ్ల (రంజిత్‌రెడ్డి), వరంగల్‌ (పసునూరి దయాకర్‌), పెద్దపల్లి (గడ్డం వంశీ), నాగర్‌కర్నూలు (మల్లు రవి), ఆదిలాబాద్‌ (డాక్టర్‌ సుమలత) సీట్లపై స్పష్టత వచ్చినట్లు చెబుతున్నారు. ఇక నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, స్థానికంగా డాక్టర్‌ అయిన కవితారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌ సీటుకు ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌ పేర్లను సీఈసీ పరిశీలించింది. అయితే పక్కపక్కనే ఉన్న నిజామాబాద్‌, కరీంనగర్‌ సీట్లను రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడంపై తర్జన భర్జన నడిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ సీటును బీసీకి కేటాయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగినట్లు తెలిసింది. కాగా, మెదక్‌లో నీలం మధు పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన మరో నేత పేరు చర్చలో ఉన్నట్లు చెబుతున్నారు.

భువనగిరికి పరిశీలనలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే!

భువనగిరి సీటుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన భార్య లక్ష్మికి ఆ టికెట్‌ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్త్తున్నారు. వీరే కాకుండా.. బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరి పేరు కూడా ఇక్కడినుంచి పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక హైదరాబాద్‌ సీటుకు సుప్రీంకోర్టు న్యాయవాది అయిన షెహనాజ్‌ అనే మహిళ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఖమ్మం స్థానానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య, మంత్రి పొంగులేటి సోదరుడు, మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తనయుడితోపాటు టీపీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమ్‌కుమార్‌ తీవ్రంగా పోటీ పడుతుండడంతో ఆ సీటును కూడా పెండింగ్‌లో పెట్టారు. అయితే పెండింగ్‌లో ఉన్న అన్ని సీట్లపైనా చర్చ పూర్తి చేసి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తే.. తెలంగాణకు సంబంధించి మలి జాబితా హోలీ పండుగ తర్వాతనే ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. గురువారం పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై సీఈసీ మరోసారి భేటీ అవుతోంది. కానీ, ఈ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ జరగడంలేదు. ఈ భేటీ అనంతరం వివిధ రాష్ట్రాల అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే.. తెలంగాణలో స్పష్టత వచ్చిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చిన సీట్లను కూడా సామాజిక సమతుల్యత, ఇతర కారణాలతో అధిష్ఠానం పెండింగ్‌లో పెట్టింది.

2 సీట్ల కోసం మాదిగ వర్గం నేతల ఒత్తిడి..

రాష్ట్రంలో మాదిగ, మాల జనాభా నిష్పత్తి దృష్ట్యా.. మూడు ఎస్సీ రిజర్వుడు సీట్లలో రెండు మాదిగ సామాజిక వర్గానికి, ఒకటి మాల సామాజిక వర్గానికి కేటాయించాలని మాదిగ వర్గం నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే మాల వర్గానికే రెండు సీట్లు (నాగర్‌ కర్నూల్‌, పెద్దపల్లి) కేటాయిస్తున్న నేపథ్యంలో మాదిగ వర్గం నేతలు బుధవారం అధిష్ఠానం పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. అలాగే సికింద్రాబాద్‌ సీటును బొంతు రామ్మోహన్‌కు లేదా ఆయన భార్యకు ఇస్తామంటూ గతంలో హామీ ఇవ్వగా.. తాజాగా ఈ సీటుకు దానం నాగేందర్‌ పేరు ఖరారైంది. కానీ, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌.. కాంగ్రెస్‌ బీ ఫారంపై పోటీ చేయాలంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల మలి జాబితా ప్రకటన పట్ల కాంగ్రెస్‌ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈ జాబితాలో ఇప్పటికే ఖరారైనట్లు చెబుతున్న సీట్లలో.. కారు దిగిన నేతలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్‌ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలు కాగా.. దానం నాగేందర్‌ ఆ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. సునీతామహేందర్‌రెడ్డి ఇటీవలే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇక గడ్డం వంశీ.. బీజేపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మెదక్‌లో ప్రధానంగా పరిశీలనలో ఉన్న నీలం మధు కూడా ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచే వచ్చి చేరారు. కాగా, ఆదిలాబాద్‌ సీటుకు ఖరారైన డాక్టర్‌ సుమలత, హైదరాబాద్‌, నిజామాబాద్‌ సీట్లకు చర్చలో ఉన్న షెహనాజ్‌, కవితారెడ్డి కాంగ్రె్‌సకు పార్టీకి కొత్త ముఖాలు.

Updated Date - Mar 21 , 2024 | 08:46 AM