Share News

ప్రతీ విషయాన్ని కూలంకషంగా నేర్చుకోవాలి

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:17 PM

పోలింగ్‌ సిబ్బంది పూర్థిస్థాయి శిక్షణ పొంది ప్రతీ విషయాన్ని కూలంకషంగా నేర్చుకోవాలని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ జి.రవినాయక్‌ అన్నారు.

ప్రతీ విషయాన్ని కూలంకషంగా నేర్చుకోవాలి
పోలింగ్‌ సిబ్బందికి ఇస్తున్న శిక్షణను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవినాయక్‌

- కలెక్టర్‌ రవి నాయక్‌ - పోలింగ్‌ సిబ్బందికి శిక్షణా తరగతులు

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 6 : పోలింగ్‌ సిబ్బంది పూర్థిస్థాయి శిక్షణ పొంది ప్రతీ విషయాన్ని కూలంకషంగా నేర్చుకోవాలని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ జి.రవినాయక్‌ అన్నారు. శనివారం జిల్లాలోని మూడు నియోజకవర్గాల పోలింగ్‌ సిబ్బందికి శిక్షణా తరగతులు ప్రాంభమయ్యాయి. ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ అధికారులకు మూడు కళాశాలల్లో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం వారికి ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో, జడ్చర్ల నియోజక వర్గం వారికి జడ్చర్లలోని బీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో, దేవరకద్ర నియోజకవర్గం వారికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో రోజుకు రెండు బ్యాచ్‌ల చొప్పున శిక్షణకు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ శనివారం శిక్షణా తరగతులను పర్యవేక్షించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులను, సిబ్బంది హాజరును పరిశీలించారు. మూడు విడతల్లో హాజ రు కాని పోలింగ్‌ సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ శిక్షణా కార్యక్ర మంలో 1,233 మంది పీవోలు, 1,219 మంది ఏపీవోలు, 2355 మంది ఓపీవోలకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా శిక్షణా నోడల్‌ అధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ వెంట సహాయ రిటర్నింగ్‌ అధికారులు నవీన్‌, ముకుందారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌, ఆరుగురు జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనర్లు, 26 మంది మాస్టర్‌ ట్రైనర్లు, 26 మంది సాంకేతిక సిబ్బంది, రెవెన్యూ తదితర సిబ్బంది శిక్షణలో పాల్గొన్నారు.

స్కానింగ్‌ సెంటర్లు నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 6 : గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగనిర్ధారణ నిషేధచట్టం, గర్భవిచ్చితి చట్టం నియమ, నిబంధనలను ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లు పాటించాలని కలెక్టర్‌ జి. రవినాయక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మం దిరంలో క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగనిర్ధారణ నిషేధ చట్టం, గర్భ విచ్చితి చట్టం, సీజేరియన్‌ ఆపరేషన్‌ తగ్గించడం గురించి జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల డాక్టర్ల అందరికీ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడారు. హాస్పిటళ్లలో అందించే వైద్యసేవల వివరాలు, వాటికి తీసుకునే ఫీజుల వివరాలు కచ్చితంగా బోర్డుపై ప్రదర్శించాలన్నారు. ఇలా లేనివారికి రిజిష్ట్రేషన్‌ చేయడం జరగదని, అదేకాంకుండా మొదటి శిక్షగా రూ.20 వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, శిక్షణ ఐపీఎస్‌ అధికారి చిత్తరంజన్‌, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ, ఏఎంఏ అద్యక్షుడు డాక్టర్‌ రామ్మోహన్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, డాక్టర్‌ జీవన్‌, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గోవర్ధిని, ఎన్‌జీవో ఇందిర ప్రియదర్శిని, డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌, డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ రఫీక్‌, ప్రోగ్రామ్‌ అధికారులు, మాస్‌ మీడియా అధికారి డాక్టర్‌ తిరుపతి రావు, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:17 PM