Share News

ఆర్థిక ఇబ్బందులున్నా అమలు చేసి తీరతాం

ABN , Publish Date - Feb 28 , 2024 | 02:56 AM

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా, రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా.. ప్రజలకిచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

ఆర్థిక ఇబ్బందులున్నా అమలు చేసి తీరతాం

ఆరు గ్యారెంటీలను పక్కాగా అందిస్తాం

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు

ఉచిత విద్యుత్తు పథకాలను ప్రారంభించిన రేవంత్‌

రూ.400 ఉన్న సిలిండర్‌ను 1200కు పెంచిన మోదీ

కేసీఆర్‌ దానిని ఆదాయ వనరుగానే చూశారు: సీఎం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా, రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా.. ప్రజలకిచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దుబారా ఖర్చు తగ్గించుకుని.. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి క్రమపద్ధతిలో నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలను మంగళవారం సచివాలయంలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తమ ప్రభుత్వం వందశాతం కట్టుబడి ఉందన్నారు. పథకాలు పేదలకు సులువుగా చేరేలా ఆయా శాఖల అధికారులు విధి విధానాలు రూపొందించారని చెప్పారు. పథకాల అమలు విషయంలో ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎలాంటి మాటలు మాట్లాడినా ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. పథకాలు అమలు కాకపోతే బాగుండునన్నట్లుగా తండ్రీ, కొడుకులు, మామా-అల్లుళ్లు ప్రయత్నం చేస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావునుద్దేశించి రేవంత్‌ వ్యాఖ్యానించారు. కానీ, వారిని ప్రజలు విశ్వసించడంలేదన్నారు. నిజమైన లబ్ధిదారులకు పథకాలను అందించేందుకే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా అర్హులను గుర్తించినట్లు తెలిపారు. వారికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి ఈ పథకాలను ప్రియాంకగాంధీ చేతుల మీదుగా చేవెళ్ల సభలో ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. కానీ, సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూలు విడుదలైందని, ఆ జిల్లాలో ఉన్న కొన్ని మండలాలు ఇతర జిల్లాల్లోనూ ఉన్నాయని అన్నారు. దీంతో చేవెళ్లలో ప్రారంభించుకోవాలనుకున్న పథకాలను ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో సచివాలయంలో ప్రారంభించామని తెలిపారు. అయినా.. మహిళల కళ్లలో ఆనందం చూసేందుకు బహిరంగ సభకు వెళ్లాలని నిర్ణయించామన్నారు.

సోనియా మాట ఇస్తే.. శిలాశాసనమే..

మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటుతోపాటు ఆరు గ్యారెంటీలను 2023 సెప్టెంబరు 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ ప్రకటించారని సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. ఆమె మాట ఇచ్చారంటే అది శిలాశాసనమేనని, తమ ప్రభుత్వం ఆ మాటను అమలు చేస్తుందని చెప్పారు. వాస్తవానికి కట్టెల పొయ్యితో కష్టాలు పడుతున్న మహిళల కోసం ‘దీపం’ పథకాన్ని యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చిందని రేవంత్‌ అన్నారు. ఆ పథకం కింద అపుడు గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కే కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తే.. ఆ తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ ధరను దాదాపు రూ.1,200కు పెంచిందని విమర్శించారు. అయితే కేంద్రం సిలిండర్‌ ధర పెంచినా.. అప్పటి సీఎం కేసీఆర్‌ దానిని తగ్గించే ప్రయత్నం చేయలేదని, కేంద్రం పెంచినా కొద్దీ జీఎస్టీ ద్వారా ఆదాయం వస్తుందనే ఆలోచనలోనే ఉన్నారని తప్పుబట్టారు. గ్యాస్‌ను కూడా ఆదాయ వనరుగానే చూశారని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చరిత్రాత్మకమైనవని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. ఇవి దేశానికి ఒక దశ - దిశను నిర్దేశం చేస్తాయని భావిస్తున్నామన్నారు. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు వచ్చిన అర్హులందరికీ మార్చి నుంచి ‘జీరో’ బిల్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.

Updated Date - Feb 28 , 2024 | 02:56 AM