Share News

తలలు పగిలేలా కొట్టినా.. మౌనమేనా!

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:16 AM

సంప్రదాయంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్న మహిళలపై ఓ వర్గం తలలు పగిలేలా రాళ్లతో దాడి చేసి గాయపరిచినా పోలీసులు మౌనం వహించడం ఏంటని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తలలు పగిలేలా కొట్టినా.. మౌనమేనా!

వధశాల మాఫియా గుప్పిట్లో పోలీసులు

చెంగిచర్ల బాధిత కుటుంబాలకు కిషన్‌రెడ్డి, ఈటల పరామర్శ

ఉప్పల్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): సంప్రదాయంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్న మహిళలపై ఓ వర్గం తలలు పగిలేలా రాళ్లతో దాడి చేసి గాయపరిచినా పోలీసులు మౌనం వహించడం ఏంటని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్లలో ఆదివారం రాత్రి జరిగిన దాడిలో గాయపడిన బాఽధిత కుటుంబాలను సోమవారం రాత్రి మల్కాజిగిరి బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఆధారాలతో బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేసి ఇరవై నాలుగు గంటల గడిచినా దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. చెంగిచర్ల వధశాల మాఫియా గుప్పిట్లో పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని ఆరోపణలు చేశారు. ఓ వర్గం ప్రజలకు అధికార ప్రభుత్వం మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. గతంలోనే చెంగిచర్లలోని వధశాల రద్దు చేయాలని పోరాటం చేశామని, పశువులను హత్య చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీసులు పట్టించుకోవడం మానేశారని విమర్శలు చేశారు. తాజాగా జనంపై తెగబడి దాడులకు దిగినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తమకు రాజకీయాల కంటే బాధితులకు అండగా నిలబడి పోరాటం చేయడమే ముఖ్యమని పేర్కొన్నారు. 24 గంటల్లో నిందితులపై హత్యానేరం కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 26 , 2024 | 03:16 AM