విద్యా బోధన.. సాగేదెట్లా!
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:13 PM
ఈ విద్యా సంవత్సరంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనకు ఇక్కట్లు తప్పేలా లేవు. పాఠశాలలు తెరిచేలోగా నెలకొన్న ఉపాధ్యాయుల కొరత పరిష్కారమవుతుందని ఆశించినా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరిచే ప్రయత్నం కత్తిమీద సాములా మారుతోంది.

జిల్లాలో ఉపాఽధ్యాయుల కొరత.. ఖాళీలతో తప్పని ఇబ్బందులు
నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం
విద్యా వలంటీర్ల నియామకంపై స్పష్టత కరువు
ఈ విద్యా సంవత్సరంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనకు ఇక్కట్లు తప్పేలా లేవు. పాఠశాలలు తెరిచేలోగా నెలకొన్న ఉపాధ్యాయుల కొరత పరిష్కారమవుతుందని ఆశించినా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరిచే ప్రయత్నం కత్తిమీద సాములా మారుతోంది.
వికారాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్నత పాఠశాలల్లో ప్రధాన సబ్జెక్టుల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఉండడంతో ఆ ప్రభావం పది ఫలితాలపై పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ప్రభావం పదో తరగతి ఉత్తీర్ణతపై తీవ్ర ప్రభావం చూపింది. ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉన్న ఉన్నత పాఠశాలలకు ఇతర పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి విద్యార్థుల చదువులు కొన సాగేలా చర్యలు తీసుకున్నా ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోయింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తప్పేలా లేదు. 2017 టీఆర్‌టీలో ఎంపికైన ఉపాధ్యాయుల నియామకాల తరువాత విద్యా వలంటీర్ల ప్రక్రియ నిలిపివేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డీఎస్పీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉపాధ్యాయ అర్హత పరీక్షల (టెట్) ప్రక్రియ ముగిసిన అనంతరం జూన్ 12న ఫలితాలు ప్రకటించి.. ఆ తరువాత డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేయాలని విద్యా శాఖ భావిస్తోంది. డీఎస్సీ ఫలితాలు ప్రకటించి నియామకాలు చేపట్టే వరకు మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు వచ్చే వరకు విద్యార్థులు నష్టపోకుండా విద్యా వలంటీర్లను నియమించి.. వారితో విద్యాబోధన చేయిస్తారా ? లేక గత ఏడాది మాదిరిగానే ఉపాధ్యాయులను ఉన్న చోటు నుంచి లేని పాఠశాలలకు సర్దుబాటు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
జిల్లాలో 1068 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు
జిల్లాలో 1068 ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు 776, ప్రాథమికొన్నత 111, ఉన్నత పాఠశాలలు 176, ఎయిడెడ్ పాఠశాలలు 5 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 84448 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యా బోధన చేసేందుకు 4617 ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 3944 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అన్ని కేటగిరిలకు సంబంధించి 750 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో ఎస్‌జీటీ, పీఈటీ, ఆ కింది పోస్టులు మినహా జీహెచ్‌ఎం, ఎల్‌ఎఫ్ హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం పదోన్నతులు, మిగతా 30 శాతం మాత్రం డీఎస్సీ నియామకాలతో భర్తీ చేయాల్సి ఉంటుంది.
ఆరు నెలలు గడిస్తేనే కొత్త ఉపాధ్యాయులు
ఇదిలా ఉంటే, గత మార్చి నెలలో జిల్లాలో 359 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చే సేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టుల్లో 102 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 195 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులు, 23 లాంగ్వేజ్ పండిత్, 5 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నాయి. అంతే కాకుండా స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 6 స్కూల్ అసిస్టెంట్, 28 ఎస్‌జీటీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వివరించింది. మొత్తం 195 ఎస్‌జీటీ పోస్టుల్లో 169 తెలుగు మీడియం, 26 ఉర్దూ మీడియం పోస్టులు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 5 పోస్టులు, లాంగ్వేజ్ పండిత్ హిందీ 11, తెలుగు పండిత్ 8, ఉర్దూ పండిత్ 3, సంస్కృతం ఒక పోస్టు ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 102 ఉండగా, వాటిలో బయోసైన్స్ 21, ఇంగ్లీష్ 23, హిందీ 3, తెలుగు 9, ఉర్దూ 3, ఫిజికల్ ఎడ్యుకేషన్ 3, ఫిజికల్ సైన్స్ 6 (తెలుగు 4, ఉర్దూ 2), సోషల్ స్టడీస్ 25 (తెలుగు 23, ఉర్దూ 2), తెలుగు 7, ఉర్దూ 2 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
ఫలితాలు అంతంతే..
పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంది. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత కారణంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదనే వాదన ఉంది. ఇతర పాఠశాలల నుంచి సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా ...మెరుగైన ఫలితం దక్కట్లేదని చెబుతున్నారు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో ఒక్కో సబ్జెక్టుకు రెండు పోస్టులు అవసరం ఉండగా, ఒక్కరితోనే నెట్టుకు వస్తున్నారు. ఓ పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంటే, మరో పాఠశాలలో ఎక్కువగా ఉంటోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు అత్యవసర పరిస్థితుల్లో విధులకు హాజరు కాకపోతే ఆ రోజు పాఠశాలలకు అనధికార సెలవుగా మారుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉంటేనే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పడడానికి అవకాశం ఉంటుంది. ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరిచే ప్రయత్నం కత్తిమీద సాములాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విద్యా ప్రమాణాలు పెరిగితేనే..
విద్యా ప్రమాణాలు పెరిగితేనే ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరగనుంది. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సదుపాయాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం చేకూరే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా పాఠశాలల పున: ప్రారంభించే నాటికివిద్యా వలంటీర్లను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు అర్హత కలిగిన వారిని విద్యా వలంటీర్లుగా నియమించిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం మళ్లీ విద్యా వలంటీర్లను నియమిస్తామని ప్రకటించడంతో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.