Share News

పరీక్షల వేళ.. పరేషాన్‌ వద్దు!

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:33 AM

పరీక్షల సీజన్‌ వచ్చేసింది..! బుధవారం నుంచి వచ్చే నెల 19 వరకు ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయి.

పరీక్షల వేళ.. పరేషాన్‌ వద్దు!

ప్రశాంతంగా రాస్తేనే మంచి ఫలితాలు..

రోజుకు 9-10 గంటలపాటు నిద్ర అవసరం

పౌష్టికాహారం తీసుకుంటేనే ఏకాగ్రత

ఒత్తిడికి గురైతే ఏడాది శ్రమ వృథా

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): పరీక్షల సీజన్‌ వచ్చేసింది..! బుధవారం నుంచి వచ్చే నెల 19 వరకు ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. వీటితోపాటు.. టీఎ్‌సపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకూ విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవ్వడం సహజమే..! ఏడాదంతా కష్టపడి చదివింది ఒక ఎత్తయితే.. చదివిన దాన్ని పరీక్షల సమయంలో పునఃశ్చరణ చేసుకోవడం మరో ఎత్తు. పునఃశ్చరణ సమయంలోనే విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతుంది. ఈ సమయంలో చేసే చిన్న పొరపాటు కూడా.. టాప్‌లో ఉండే విద్యార్థులు తొందరపాటుతో తప్పులు చేసే ప్రమాదాలుంటాయి. వంద శాతం మార్కులు వస్తాయనే విద్యార్థులు సైతం సగం మార్కులను కూడా సాధించలేని పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్థులు ఏమాత్రం ఆందోళనకు గురవ్వకుండా.. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని.. కొన్ని చిట్కాలను పాటిస్తే ఒత్తిడి, భయం, ఆందోళనలను దూరం పెట్టవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ప్రత్యేక ప్రణాళిక అవసరం

సబ్జెక్టుల పునఃశ్చరణకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని ఉపాధ్యాయులు, నిపుణులు చెబుతున్నారు. రివిజన్‌ కోసం టైంటేబుల్‌ను రూపొందించుకోవాలి

ఒక సబ్జెక్టును చదువుతున్నప్పుడు ముఖ్యాంశాలు, ప్రత్యేకమైన విభాగాలను నోట్‌ చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు, ప్రముఖుల పేర్లు, గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలో ఫార్మూలాలు, లాంగ్వేజ్‌ సబ్జెక్టుల్లో అర్థాలు, నిర్వచనాలు ఈ కోవలోకి వస్తాయి

పెద్ద ప్రశ్నలకు సమాధానాలు చదివేప్పుడే.. లఘు ప్రశ్నలకు సమాధానాలను నోట్‌ చేసుకోవాలి

సమాధానాలను పేరగ్రా్‌ఫల మాదిరిగా కాకుండా.. ముఖ్యాంశాలుగా/పాయింట్లుగా ఒకదాని తర్వాత ఒకటిగా క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి

క్రమ పద్ధతిలో సమాధానాలను గుర్తుపెట్టుకునేందుకు మెమొరీ స్టోరీ(నిమానిక్‌ టెక్నిక్స్‌), విజ్యువలైజేషన్‌ వంటి ప్రక్రియలను ఉపయోగించాలి

పెద్ద ప్రశ్నలకు సమాధానాలు రాసేప్పుడు వర్గాలవారీగా సబ్‌-హెడ్డింగ్‌లను పెడితే మంచి మార్కులు వస్తాయి 9-10 గంటలపాటు నిద్ర అవసరం..

పరీక్షల సమయంలో అర్ధరాత్రి వరకు పుస్తకాలతో కుస్తీపట్టడం.. కాసేపు పడుకుని, తెల్లవారుజామున నాలుగింటికే లేవడం వంటివి చేయకూడదు

సాధారణ రోజుల మాదిరిగానే 9-10 గంటల నిద్ర అవసరం. సరిపడా నిద్ర ఉన్న విద్యార్థులే కాన్ఫిడెంట్‌గా సమాధానాలు రాయగలుగుతారు

కంటినిండా నిద్ర లేకుంటే.. చదివినది అర్థం కాదు. ఎంత నేర్చుకున్నా.. గుర్తుండదు. నిద్రలేమి వల్ల తెలిసిన సమాధానాలను కూడా సరిగ్గా రాయలేరు.ఖాళీ కడుపుతో ఉండొద్దు

ఎక్కువగా పరీక్షలు ఉదయం వేళల్లో ఉంటాయి. ఇంటర్‌ పరీక్షలు కూడా ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ హడావుడితో విద్యార్థులు అల్పాహారాన్ని మానేస్తుంటారు. అలా చేయడం సరికాదని సైకాలజిస్టులు చెబుతున్నారు

ఒకవేళ ఉదయం అల్పాహారం తీసుకునే అవకాశం లేకుంటే.. సలాడ్లు, కనీసం పండ్ల రసాలు తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తున్నారుగదిలో ప్రశాంతంగా కూర్చోవాలి

విద్యార్థులు తమ ఆందోళనలను పరీక్ష హాలు బయటే వదిలిపెట్టాలి. గదిలోకి వెళ్లగానే తమకు కేటాయించిన సీట్లలో ప్రశాంతంగా కూర్చోవాలి

ఇన్విజిలేటర్‌ నుంచి ప్రశ్నపత్రం తీసుకోగానే.. ప్రశాంతంగా ప్రతి ప్రశ్నను క్షుణ్నంగా చదవాలి

ప్రశ్నపత్రం తీసుకున్న వెంటనే సమాధానాలు రాయడానికి ఉపక్రమించకుండా.. అన్ని ప్రశ్నలను చదివి.. బాగా రాయగలిగేవాటిని టిక్‌ చేసుకోవాలి

వేగంగా సమాధానాలు రాయాలనే ఆరాటం ఉంటే.. సమాధానాలను మరిచిపోయే ప్రమాదం ఉంది. ఒక్కో సమాధానానికి నిర్ణీత సమయాన్ని కేటాయించుకుని, పరీక్షలను రాయాలి

ఒకేప్రశ్నను సాగదీయకుండా రాయొద్దు. మార్కుల కేటగిరీని బట్టి, సరైన సమాధానం ఇవ్వాలి

సమయంలోగా సమాధానాలు రాయడం పూర్తయితే.. వెంటనే పేపర్‌ ఇచ్చి, బయటకు రావొద్దు. నిదానంగా కూర్చుని, రాసిన సమాధానాలను పరిశీలించుకోవాలి. దీనివల్ల తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకోవచ్చు

పరీక్షలను భూతద్దంలో చూడొద్దు

(ఉస్మానియా యూనివర్సిటీ)

పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను విద్యార్థులు భూతద్దంలో చూడొద్దు. వాటిని అంతకు ముందే రాసిన ఎఫ్‌ఏ, ఎస్‌ఏ మాదిరిగానే భావించి, రాయాలి. ఇప్పటివరకు చదివిన పాఠాలపైనే దృష్టి పెట్టాలి. చదవని వాటిని చదివితే తెలిసినవి మరిచిపోయే ప్రమాదం ఉంటుంది. జీవితంలో పరీక్షలు ఒక భాగం మాత్రమే..! జీవన్మరణ సమస్య కాదు. అందుకే.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆందోళనకు గురికావొద్దు. పర్సంటేజీలపై తల్లిదండ్రులు పిల్లలకు టార్గెట్‌ విధించకుండా.. వారికి మనోధైర్యం కల్పించాలి.

- స్వాతి, సైకాలజీ ప్రొఫెసర్‌

నిమిషం నిబంధన వద్దు

ఇంటర్‌ పరీక్షల్లో నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించాలని ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (పీడీఎ్‌సఎఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, కుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి బస్టాపులో బస్సులు ఆపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్‌ ప్రభుత్వాన్ని కోరారు. పరీక్షలు ముగిసే వరకు విద్యార్థులు ఎక్కడ బస్సులు ఆపినా ఎక్కించుకునేలా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 28 , 2024 | 03:33 AM