Share News

ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల డ్రగ్స్‌ దందా

ABN , Publish Date - Apr 18 , 2024 | 04:28 AM

ఆంధ్రప్రదేశ్‌ వాస్తవ్యులైన ఆ ఇద్దరు ఉన్నత కుటుంబాలకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు! డ్రగ్స్‌ అలవాటు ఇద్దరి మధ్య స్నేహం కుదిరేలా చేసింది. అదే అలవాటు.. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్‌ విక్రయాలకూ పురిగొల్పింది!!

ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల డ్రగ్స్‌ దందా

సులభంగా డబ్బు సంపాదన కోసం మత్తు పదార్థాల విక్రయాలు

అరెస్ట్‌ చేసిన మాదాపూర్‌ పోలీసులు

రూ.4.20 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ వాస్తవ్యులైన ఆ ఇద్దరు ఉన్నత కుటుంబాలకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు! డ్రగ్స్‌ అలవాటు ఇద్దరి మధ్య స్నేహం కుదిరేలా చేసింది. అదే అలవాటు.. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్‌ విక్రయాలకూ పురిగొల్పింది!! బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ‘సరుకు’తో వచ్చినా తమకు కస్టమర్లు ఉన్న రాజమండ్రిలో విక్రయించేందుకు ఎన్నికల కోడ్‌ కారణంగా అక్కడ నిఘా ప్రతిబంధకంగా మారడంతో గ్రేటర్‌ పరిధిలోనే అమ్మేయాలనుకున్నారు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే పోలీసులకు దొరికిపోయారు. ఆ ఇద్దరు.. ఏపీలోని రాజమండ్రికి చెందిన కాటూరి సూర్య కుమార్‌ (22), గుత్తుల శ్యాంబాబు (22). సూర్య తండ్రి రైల్వేలో ఇంజనీర్‌, ఇంజనీరింగ్‌ చదివేందుకు సూర్య బెంగుళూరులోని జైస్‌ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ బెంగుళూరుకు చెందిన స్నేహితుడు అభి ద్వారా ఎండీఎంఏ డ్రగ్స్‌కు సూర్య అలవాటు పడ్డాడు. ఆ తర్వాత తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు సూర్య డ్రగ్స్‌ అమ్మకాలు మొదలుపెట్టాడు. నిరుడు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న సూర్యను చందానగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి, జైలుకు పంపారు. మూడు నెలలు జైల్లో ఉన్నా బుద్ధి మార్చుకోని సూర్య మళ్లీ డ్రగ్స్‌ దందా మొదలు పెట్టాడు. సూర్యకు నైజీరియన్‌ డ్రగ్‌ స్మగ్లర్‌ గాడ్‌ ఆఫ్‌ సోల్మె్‌సను అభి పరిచయం చేశాడు. ఆ నైజీరియన్‌ నుంచి ఎండీఎంఏ కొన్న సూర్య, తన మరో స్నేహితుడు గుత్తుల శ్యాంబాబుకు డ్రగ్స్‌ తీసుకోవడాన్ని అలవాటు చేశాడు. అతడి సాయంతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు ఎండీఎంఏ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నాడు. సూర్య ఈనెల 14న బెంగళూరు వెళ్లి సోల్మ్‌సను కలిసి 30 గ్రాముల ఎండీఎంఏ కొన్నాడు. 16న నగరానికి వచ్చాడు. స్నేహితుడు శ్యాంబాబును నగరానికి పిలిపించుకున్నాడు. ఇద్దరు కలిసి 2 గ్రాముల ఎండీఎంఏను సేవించారు. మిగతా 28 గ్రాముల డ్రగ్స్‌ను విక్రయించాలని పథకం వేశారు. ఎన్నికల సందర్భంగా రాజమండ్రిలో పోలీసు నిఘా ఉంటుందని భావించి హైదరాబాద్‌లోనే విక్రయించాలని ప్రయత్నించారు. ఈ ఇద్దరి గురించి పక్కా సమాచారమందుకున్న మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు, మాదాపూర్‌ పోలీసులతో కలిసి వలపన్నారు. మాదాపూర్‌లోని చంద్రానాయక్‌ తండా, రాజారెసిడెన్సీ సమీపంలో ఎండీఎంఏ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సూర్యకుమార్‌, శ్యాంబాబును అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 4.20 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 04:28 AM