Share News

Kumaram Bheem Asifabad- తాగునీటి సమస్య రాకుండా చూడాలి

ABN , Publish Date - Feb 20 , 2024 | 09:32 PM

మండలంలో ప్రతి గ్రామంలో వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా చూడాలని జడ్పీ సీఈవో అనిల్‌కుమార్‌ అన్నారు. సిర్పూర్‌(టి) ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు.

Kumaram Bheem Asifabad-   తాగునీటి సమస్య రాకుండా చూడాలి
సిర్పూర్‌(టి)లో జడ్పీ సీఈవోకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎంపీడీవో

సిర్పూర్‌(టి), ఫిబ్రవరి 20: మండలంలో ప్రతి గ్రామంలో వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా చూడాలని జడ్పీ సీఈవో అనిల్‌కుమార్‌ అన్నారు. సిర్పూర్‌(టి) ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనా రాయణ, ఎంపీవో కృష్ణమూర్తి, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఏజెన్సీ గ్రామాలపై దృష్టి సారించాలన్నారు. ఈజీఎస్‌ పనులు ఎంత వరకు వచ్చాయని ఏపీవో రామ్మోహన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలోని డోర్‌పల్లి, కర్జపెల్లి, పారిగాం, టోంకిని గ్రామాల్లో పర్యటించారు. ఆయన వెంట ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో కృష్ణమూర్తి, సూపరింటెండెంట్‌ వీణ, సీనియర్‌ అసిస్టెంట్‌ సదాశివ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ రాజ్‌కుమార్‌, ఈజీఎస్‌ సిబ్బంది ఉన్నారు.

పెంచికలపేట: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈఓ అనీల్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని మండలపరిషత్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. మండలంలో చేపడుతున్న ఉపాధిహామీ పనులపై ఆరా తీశారు. నర్సరీల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి ప్రజలకు ఆహ్లాదం పంచే విధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాసింగ్‌, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

బెజ్జూరు గ్రామాల్లోని పరిసరాలు వీధులు పరిశుభ్రంగా ఉంచాలని జడ్పీ సీఈవో అనీల్‌ కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పల్లె ప్రకృతి వనాలు, మొక్కలు పెరిగేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా సీఈవోను సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మాధవి, ఎంపీవో రమేశ్‌రెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ సోహెల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 09:32 PM