Share News

స్థానిక పోరుపై సందిగ్ధం!

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:33 PM

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అప్పట్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. ఆ దిశగా ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

స్థానిక పోరుపై సందిగ్ధం!

ఫబీసీ రిజర్వేషన్లపై స్పష్టత కరువు

ఆశావహుల్లో ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం

వికారాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అప్పట్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. ఆ దిశగా ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. గ డువు తీరిన గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా కనిపించడం లేదు. గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోయాయి. 2024, ఫిబ్రవరి ఒకటో తేదీతో గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసియగా, పాలక వర్గాల స్థానంలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. మండల ప్రజా పరిషత్‌ పాలకవర్గాల గడువు ఈనెల 3వ తేదీతో ముగియగా, ఈనెల 4వ తేదీతో జిల్లా ప్రజా పరిషత్తు పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తారా? లేక సవరణ చేసి అమలు చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ రిజర్వేషన్లు మార్చి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తే.. ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను సేకరిస్తారా? లేక బీసీ కులగణన ఆధారంగా ఖరారు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై బీసీ కమిషన్‌ నివేదిక కీలకం కానుంది. పంచాయతీలు, మండల, జడ్పీ ప్రజా పరిషత్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వాటా ఏ మేర ఉండనుందనేది రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. వికారాబాద్‌ జిల్లాలో జిల్లాలో 566 గ్రామ పంచాయతీలు ఉండగా, 20 మండల ప్రజా పరిషత్‌, జిల్లా ప్రజా పరిషత్‌ ఉంది. మండల పరిషత్‌లలో ఇది వరకే 18 మండల ప్రజా పరిషత్‌లు ఉండగా, దుద్యాల, చౌడాపూర్‌ మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఈసారి జరిగే ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ రెండు మండలాల్లో మండల పరిషత్‌ పాలక వర్గాలు కొలువు తీరనున్నాయి.

2018లో కొత్త చట్టం అమల్లోకి..

నూతన పంచాయతీరాజ్‌ చట్టం - 2018 ప్రకారం స్థానిక సంస్థల్లో ఒకసారి ఖరారైన రిజర్వేషన్లు పదేళ్ల పాటు అమలు చేసేలా ఈ చట్టంలో మార్పు తీసుకు వచ్చారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 2019 జనవరి నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అదే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ఎంపీసీటీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాక ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సన్నాహాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామ పంచాయతీలు, వార్డులకు సంబంధించిన సమాచారం సిద్ధం చేశారు. ఓటింగ్‌ కోసం అవసరమయ్యే పోలింగ్‌ బాక్సులు కూడా సిద్ధం చేసుకున్నారు.

తెరపైకి కులగణన

లోక్‌సభ ఎన్నికలు తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని భావించినా బీసీ రిజర్వేషన్ల అంశంపై తేల్చకపోవడం, కులగణన డిమాండ్‌ తెరపైకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీలు, మండల, జడ్పీ ప్రజా పరిషత్తు పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. స్థానిక సంస్థలకు ఐదేళ్ల పదవీ కాలం ముగియగానే కొత్త పాలక వర్గాలు కొలువుదీసే విధంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కాగా, బీసీ రిజర్వేషన్ల అంశం తేలకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం మరో ఆరు నెలల్లో ముగియనుంది. వచ్చే ఏడాది జనవరిలో మునిసిపాలిటీలు, ఆ తరువాత వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘ (పీఏసీఎస్‌) పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది.

గత ఎన్నికల్లో 50 శాతానికి లోబడి..

గత పంచాయతీ ఎన్నికల్లో 2011 జనాభాను పరిగణనలోకి తీసుకుని ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్లు నిర్ధారించారు. బీసీలకు మాత్రం 50 శాతం కోటా మించరాదన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వీరికి సర్పంచ్‌ పదవులను రిజర్వు చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కల్పించగా, 50 శాతం మించకుండా అమలు చేస్తున్న రిజర్వేషన్లలో బీసీలకు ఈసారి 22.78 శాతం మాత్రమే రిజర్వేషన్లు దక్కాయి. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వు చేయగా, 2019 ఎన్నికల్లో మాత్రం 22.78 శాతం రిజర్వేషన్‌ అమలు చేశారు.

రిజర్వేషన్లపై ఉత్కంఠ ..

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చిన పంచాయతీరాజ్‌ చట్టం-2018 ఎన్నికల స్థానాలకు రిజర్వేషన్లు పదేళ్ల పాటు వర్తిస్తాయని పేర్కొంటోంది. తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక రిజర్వేషన్లలో ఏమైనా మార్పులు చేస్తుందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించే అవకాశంపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చే స్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీసీ గణన అంశంపై తెరపైకి వచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనేది స్పష్టమవుతోంది.

Updated Date - Jul 08 , 2024 | 11:33 PM