Share News

తాగునీటి కోసం ఆందోళన చెందొద్దు: సీఎస్‌

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:41 AM

రాష్ట్రంలో వేసవిలో తాగునీటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని ప్రధాన

తాగునీటి కోసం ఆందోళన చెందొద్దు: సీఎస్‌

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వేసవిలో తాగునీటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై మంగళవారం సచివాలయంలో ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటికే ‘సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌’ను రూపొందించి, జిల్లాలకు అవసరమైన మేర నిధులను విడుదల చేశామని తెలిపారు. బోరుబావుల ఫ్లషింగ్‌, పైపుల మరమ్మతు పనులను పూర్తి చేశామని, నిర్వహణాపరమైన లోపాలను ఎప్పటికప్పుడు సవరించి, నిరంతర నీటి సరఫరా జరిగేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లకు ఆమె సూచించారు. వేసవికాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంజూరు చేసిన పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఈసారి లోటు వర్షపాతం ఉన్నా ప్రధాన జలాశయాలైన ఎస్‌ఆర్‌ఎస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, నాగార్జునసాగర్‌లలో నీటి మట్టాలు గతేడాదిలానే ఉన్నాయని, దాంతో తాగునీటి కోసం ఆందోళన అవసరం లేదని చెప్పారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా రూపొందించుకోవాలని కలెక్టర్లను సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు.

Updated Date - Mar 27 , 2024 | 10:28 AM