Share News

ఆన్‌లైన్‌ నమోదులో పొరపాట్లు చేయొద్దు

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:15 AM

అభయహస్తం దరఖాస్తుల ఆన్‌లైన్‌ నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని, ఖచ్చితత్వంతో నమోదు చేయాలని కలెక్టర్‌ దాసరి హరిచందన ఆదేశించారు.

ఆన్‌లైన్‌ నమోదులో పొరపాట్లు చేయొద్దు
నార్కట్‌పల్లిలో దరఖాస్తుల ఆన్‌లైన్‌ నమోదును పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిచందన

కలెక్టర్‌ దాసరి హరిచందన

చిట్యాల, నార్కట్‌పల్లి, జనవరి 10: అభయహస్తం దరఖాస్తుల ఆన్‌లైన్‌ నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని, ఖచ్చితత్వంతో నమోదు చేయాలని కలెక్టర్‌ దాసరి హరిచందన ఆదేశించారు. చిట్యాల తహసీల్దార్‌, నార్కట్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభయహస్తం కోసం వచ్చిన దరఖాస్తుల్లో విధిగా ఆధార్‌ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. టీం లీడర్లు అభయహస్తం దరఖాస్తులను దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. ఆన్‌లైన్‌ పూర్తయిన దరఖాస్తులను ట్రంకు పెట్టెలు, బీరువాల్లో భద్రపరచాలని సూచించారు. ఆన్‌లైన్‌ ఎంట్రీ సమయంలో ఏమైనా సమస్యలు వస్తున్నాయా అని సిబ్బందిని అడిగారు. కొన్ని దరఖాస్తుల్లో ఫోన్‌ నెంబర్లు లేవని సిబ్బంది చెప్పారు. గ్రామపంచాయతీ కార్యదర్శులకు చెప్పి ఫోన్‌ నెంబర్లు తెలుసుకుని చెప్పాలన్నారు. ఆన్‌లైన్‌ నమోదులో ఎదురవుతున్న సందేహాలను కలెక్టర్‌ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, చిట్యాల తహసీల్దార్‌ దశరథ, నార్కట్‌పల్లి ఎంపీడీవో యాదగిరి, మండల ప్రత్యేకాధికారి మల్లయ్య, తహసీల్దార్‌ పద్మ, ఆర్‌ఐ తరుణ్‌, ఎంపీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు పక్కాగా అమలు కావాలి

నల్లగొండ: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అమలవుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో నిర్థిష్ట కార్యాచరణతో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ హరిచందన ఆదేశించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం, స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్‌ లింకేజీ, స్ర్తీ నిధి ఇతర కార్యక్రమాల పథకాలు పక్కగా అమలు కావాలన్నారు. కొన్ని మండలాల్లో అభివృద్ధి పనులు వెనుకబడి ఉన్నాయని, అందుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసరా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి సిద్ధం చేయాలని సూచించారు. సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై ఫిబ్రవరి మొదటి వారంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌, డీఆర్‌డీవో పీడీ కాళిందిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:15 AM