Share News

ఉచిత ఇసుకకు అడ్డంకులొద్దు!

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:12 AM

ఇసుక అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో స్థానికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉచితంగా అందించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది.

ఉచిత ఇసుకకు అడ్డంకులొద్దు!

సొంత ఇళ్లు, నిర్మాణాలు చేపట్టే ప్రజలు ఫ్రీగా తీసుకెళ్లొచ్చు

గ్రామాలు, మండల కేంద్రాల్లోని ప్రజలకు అవకాశం

ఇందిరమ్మ ఇళ్లకూ ఫ్రీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

1, 2, 3 క్యాటగిరీ ఇసుక రీచ్‌లకు వర్తింపు

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఇసుక అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో స్థానికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉచితంగా అందించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్‌ ఎక్కా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికంగా నిర్మాణాలు చేపడుతున్న వారికి ఇసుకను ఉచితంగా అందించాలని నిబంధనలు (2015 నాటి ఇసుక రవాణా మార్గదర్శకాలు) ఉన్నప్పటికీ.. పోలీసు, రెవెన్యూ సిబ్బంది తమను అడ్డుకుంటున్నారంటూ పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. అధికారుల చర్యలతో ఇసుక దొరక్క ఇళ్ల నిర్మాణాలకు ఆటంకం ఏర్పడుతుందని ప్రజలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్వస్థలాల్లో సొంత ఇంటి నిర్మాణం కోసం, సొంత అవసరాల కోసం స్థానిక ప్రజలు, మండల కేంద్రాల్లోని ప్రజలు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చని పే ర్కొంది. 1, 2, 3 క్యాటగిరీల్లో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నామని తెలిపింది. స్థానికంగా ఉన్న వాగులు, వంకల్లోని రీచ్‌లన్నీ 1, 2, 3 క్యాటగిరీ కిందికే వస్తాయి. గోదావరి, కృష్ణా నదుల ఇసుక రీచ్‌లు, మున్నేరు లాంటి పెద్ద ఉపనదుల్లోని రీచ్‌లు తప్ప ఇతర స్థానిక వాగులు, చిన్న ఉపనదుల రీచ్‌ల నుంచి ఉచితంగా ఇసుకను తీసుకెళ్లే వెసులుబాటు ఈ ఉత్తర్వులతో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇసుక కొరత లేకుండా, నిర్మాణాలు ఆగకుండా చూడాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. రహదారుల నిర్మాణం, పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ పథకాలకూ ఇసుకను ఉచితంగా అందించాలని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది.

Updated Date - Mar 24 , 2024 | 03:12 AM