Share News

KCR : కాంగ్రెస్‌ వలలో పడొద్దు

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:05 AM

బీజేపీ పట్ల తమ పార్టీ విధానంలో ఎటువంటి మార్పు ఉండబోదని, దీనిపై అనవసరమైన చర్చలు వద్దని.. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులేకుండా పోరాడతామని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

KCR : కాంగ్రెస్‌ వలలో పడొద్దు

పనుల కోసం కొందరు రేవంత్‌ను కలుస్తున్నారు

పనులు చేయకపోగా.. బద్నామ్‌ చేస్తారు.. జాగ్రత్త

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను హెచ్చరించిన కేసీఆర్‌

రుణమాఫీపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు

ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంది

ఉంటుందా? ఉండదా? అనేది వారి చేతుల్లోనే!

ఏడాదిలోపే ప్రజల్లో భ్రమలు తొలగుతాయి

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటరి పోరు

బడ్జెట్‌ సమావేశాలకు హాజరవుతా: కేసీఆర్‌

ఎమ్మెల్యేగా ప్రమాణం.. బీఆర్‌ఎస్‌ఎల్పీ బాధ్యతలు

నేడు తెలంగాణ భవన్‌కు వెళ్లనున్న మాజీ సీఎం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): బీజేపీ పట్ల తమ పార్టీ విధానంలో ఎటువంటి మార్పు ఉండబోదని, దీనిపై అనవసరమైన చర్చలు వద్దని.. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులేకుండా పోరాడతామని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని జరుగుతున్న ప్రచారాలను నిలువరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అయితే, రాష్ట్రంలో బీజేపీ బలపడిందని.. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని కేసీఆర్‌ అన్నారు. గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హైదరాబాద్‌ నందినగర్‌లోని నివాసంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో కేసీఆర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేశారు. ఎమ్మెల్యేలెవరూ కాంగ్రెస్‌ వలలో పడొద్దని సూచించారు.

‘కొందరు ఏదో చేస్తారన్న ఉద్దేశంతో.. సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తున్నారు. వారు అనుకున్నట్లు ఏమీ చేయకపోగా.. ప్రజల్లో రాజకీయంగా బద్నాం చేస్తారు.. జాగ్రత్తగా ఉండండి.. ఇకమీదట అలాంటి పనులు చేయకండి. సీఎంను కలవాలనుకుంటే సమాచారం ఇచ్చి వెళ్లండి’ అని సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంది. ఇబ్బడిముబ్బడి హామీలిచ్చారు. అమలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఉంటుందా? ఉండదా? అనేది వారి చేతుల్లోనే ఉంది. ప్రతిపక్షంగా సమర్థంగా వ్యవహరిద్దాం. ఏడాది లోపే ప్రజలకు అసలు విషయం తెలుస్తుంది. మనం తొందరపడాల్సిన పనిలేదు. సంయమనం పాటిద్దాం. చక్కగా నిలబడితే చాలు.. వచ్చే ప్రభుత్వం మనదే’’నని కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించామని.. ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహం, భయడాల్సిన అవసరం లేదన్నారు. కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే అంశంపై పార్లమెంటులో నిరసన తెలపాలని ఎంపీలకు సూచించారు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రినీ కలవాలని నిర్దేశించారు. లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడదామని.. మంచి అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

అసాధ్యమని ఆర్బీఐనే చెప్పింది

రూ.36 వేల కోట్ల రైతు రుణమాఫీ అసాధ్యమని, ఏక మొత్తంలో ఇన్ని కోట్లు మాఫీ వీలుకాదని ఆర్‌బీఐ తెలిపిందని పార్టీ నేతల వద్ద కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అయినా.. ఏపీలో చెల్లించారు. తెలంగాణలోనూ రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ‘‘మనం అధికారంలో ఉన్నపుడే కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. కాంగ్రెస్‌ ఉంటే చేస్తుందా? వాళ్లకూ చేయదు. శుక్రవారం తెలంగాణ భవన్‌కు వస్తా. బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొంటా’’ అని కేసీఆర్‌ తెలిపారు. కాగా, బడ్జెట్‌ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన తీరుపై చర్చించారు.

ఎమ్మెల్యేగా ప్రమాణం

గజ్వేల్‌ ఎమ్మెల్యేగా కేసీఆర్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్‌ గడ్డ ప్రసాద్‌ తన చాంబర్‌లో మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పోచారం, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని ప్రతిపక్ష నేత చాంబర్‌లో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేసి బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. కాగా, ఈ కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌, కాలె యాదయ్య, పద్మారావుగౌడ్‌ హాజరు కాలేదని సమాచారం.

Updated Date - Feb 02 , 2024 | 03:05 AM