Share News

అన్నదాతలూ.. ఆత్మహత్యలు వద్దు

ABN , Publish Date - Mar 29 , 2024 | 05:52 AM

అన్నదాతలు ధైర్యంగా ఉండండి. ఆత్మహత్యలతో కుటుంబాలను ఇబ్బందుల పాలు చేయవద్దు. ధైర్యంగా ముందుకు వెళ్దాం. ప్రభుత్వంతో కొట్లాడుదాం. సర్కారు మెడలు వంచైనా బోనస్‌ తెచ్చుకుందాం. రుణమాఫీ, నష్టపరిహారం

అన్నదాతలూ.. ఆత్మహత్యలు వద్దు

సర్కారు మెడలు వంచి పరిహారం తెచ్చుకుందాం.. రుణమాఫీ, బోన్‌సను సాధించుకుందాం

రైతులను పరామర్శించే తీరిక ముఖ్యమంత్రి రేవంత్‌కు లేదు: కేటీఆర్‌

సిరిసిల్ల , మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ‘అన్నదాతలు ధైర్యంగా ఉండండి. ఆత్మహత్యలతో కుటుంబాలను ఇబ్బందుల పాలు చేయవద్దు. ధైర్యంగా ముందుకు వెళ్దాం. ప్రభుత్వంతో కొట్లాడుదాం. సర్కారు మెడలు వంచైనా బోనస్‌ తెచ్చుకుందాం. రుణమాఫీ, నష్టపరిహారం సాధించుకుందాం. మేడిగడ్డను రిపేరు చేసుకొని కాళేశ్వరం నీళ్లు మనకు వచ్చేటట్లు చేసుకుందాం. ఆత్మహత్యలు వంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దు’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ఎండిపోయిన పొలాలను గురువారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచి జరుగుతుందని ఆశించి రైతులు కాంగ్రె్‌సకు ఓట్లు వేసి గెలిపించుకుంటే.. ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రులకు రైతులను పరామర్శించే తీరికే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలను నమ్మి రైతులు, ప్రజలు మోసపోయారని అన్నారు. రైతులెవరూ అధైర్య పడొద్దని, తాము అండగా ఉంటామని అన్నారు. ‘‘డిసెంబరు 9న అధికారంలోకి వస్తున్నాం.. రుణాలు తీసుకోని వారు కూడా తీసుకోండి... వెంటనే రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ, ఇప్పుడు రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా రైతులకు లీగల్‌ నోటీసులు ఇచ్చి రుణాలకు కడతారా? చస్తారా? అనే విధంగా వ్యవహరిస్తున్నారు’’ అని మండిపడ్డారు. గత ఏడాది ఎండాకాలంలో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి జిల్లాల్లోని చెరువులను నింపామని గుర్తు చేశారు. మేడిగడ్డ వద్ద మూడు పిల్లర్లు కుంగి మూడు, నాలుగు నెలలు అవుతున్నా.. రిపేరు చేయడానికి కాంగ్రెస్‌ సర్కార్‌కు టైమ్‌ సరిపోవడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై కడుపు మంటతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ తీసుకొచ్చిన కరువని అన్నారు. ఇప్పటికే దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. రైతులపై ప్రేమ ఉంటే ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. మిగిలిన పంటనైనా క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు రూ.2లక్షల మేర రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15వేలు ఇవ్వాలని, ఇందుకోసం అవసరమైతే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాలని సూచించారు.

Updated Date - Mar 29 , 2024 | 05:52 AM