Share News

మీకు నేనున్నా.. భయపడకండి..

ABN , Publish Date - Apr 05 , 2024 | 04:00 AM

‘మీకు నేనున్నా.. భయపడకండి.. పిల్లలూ మీరు ఎంత చదివితే అంతవరకు చదివిస్తా’’ అంటూ ఓ కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి అభయ‘ుమిచ్చారు.

మీకు నేనున్నా.. భయపడకండి..

పిల్లలూ మీరు ఎంత చదివితే.. అంత వరకూ చదివిస్తా

ఓ కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి హామీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ‘‘మీకు నేనున్నా.. భయపడకండి.. పిల్లలూ మీరు ఎంత చదివితే అంతవరకు చదివిస్తా’’ అంటూ ఓ కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి అభయ‘ుమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామానికి చెందిన ఓ మహిళ.. మంత్రి కోమటిరెడ్డిని కలిసేందుకు తన ముగ్గురు పిల్లలను తీసుకొని హైదరాబాద్‌లోని మంత్రి నివాసానికి వచ్చింది. లోపలికి వెళ్లేందుకు భయపడి పిల్లలతో మంత్రి ఇంటి బయటే కూర్చుంది. అదే సమయంలో కారులో బయటకు వెళ్తున్న మంత్రి కోమటిరెడ్డి వారిని గమనించి ‘‘మీరెవరు.. ఎందుకొచ్చారు..’’ అంటూ మహిళను ఆరా తీశారు. తన భర్త బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మరణించాడని, ఆస్తులన్నీ అమ్మి వైద్యం చేయించినా తన భర్త దక్కలేదని మంత్రికి చెప్తూ ఆ మహిళ కన్నీరుమున్నీరయింది. పిల్లలను పోషించేందుకు కూడా పైసలు లేవని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం ఇప్పించాలని వేడుకుంది. దాంతో మహిళను, పిల్లలను మంత్రి స్వయంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి, పిల్లలకు చాక్లెట్లు ఇచ్చారు. అనంతరం వారితో మాట్లాడారు. అప్పుడు పిల్లలు తమకు చదువుకోవాలని ఉందని చెప్పగా.. ‘‘మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తా.. మీ బాధ్యత నాది’’ అంటూ హామీ ఇచ్చారు. అంతే కాకుండా వారి కుటుంబానికి అప్పటికప్పుడే రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. సీఎంవోలో సీఎంఆర్‌ఎఫ్‌ విభాగం వ్యవహారాలు చూసే అధికారికి ఫోన్‌ చేసి సదరు మహిళ భర్త వైద్యానికి అయిన ఖర్చు మొత్తం అందించేలా చూడాలని కోమటిరెడ్డి సూచించారు.

Updated Date - Apr 05 , 2024 | 04:00 AM