Share News

చిన్నారుల వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - May 25 , 2024 | 11:40 PM

చిన్నారుల వ్యాక్సిన్‌ విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర సిబ్బందికి సూచించారు.

చిన్నారుల వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం వద్దు

వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర

కొత్తూర్‌, మే 25: చిన్నారుల వ్యాక్సిన్‌ విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించి, ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్‌ స్టాక్‌తో పాటు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుధీర మాట్లాడుతూ సంవత్సరం లోపు చిన్నారులందరికీ విధిగా బుధ, శనివారాల్లో తప్పకుండా వ్యాక్సినేషన్‌ ఇవ్వాలన్నారు. వ్యాక్సినేషన్‌ ఇచ్చే ముందు ఎక్స్‌పైర్‌ డేట్లను విధిగా గమనించాలని, అలాగే వ్యాక్సినేషన్‌ కూలింగ్‌ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వైద్యం అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ స్వర్ణకుమార్‌, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోలు డాక్టర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ దామోదర్‌, స్థానిక పీహెచ్‌సీ డాక్టర్‌ హరికిషన్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాస్‌,హెల్త్‌ ఆఫీసర్‌ చిట్టిబాబు, సూపర్‌వైజర్లు రవికుమార్‌, అనసూయ, ఫార్మసిస్ట్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 11:40 PM