Share News

పచ్చని చెట్లపై గొడ్డలి వేటు

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:05 AM

‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’ అంటూ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపడుతుంటే.. ఇటు కొందరు అధికారుల నిర్లక్ష్యం మూలాన పచ్చని చెట్లపై గొడ్డలివేటు పడుతోంది.

పచ్చని చెట్లపై గొడ్డలి వేటు
నల్లగొండ జిల్లాకేంద్ర లైబ్రరీలో చెట్లను కొట్టేసి బయట కుప్పగా వేసిన కూలీలు

జిల్లాకేంద్ర గ్రంథాలయంలో చెట్లను నరికివేసిన వైనం

వేసవి సమీపిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు, పాఠకులు

గ్రంథాలయ సిబ్బంది వైఖరికి నిరసనగా ఆందోళన

‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’ అంటూ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపడుతుంటే.. ఇటు కొందరు అధికారుల నిర్లక్ష్యం మూలాన పచ్చని చెట్లపై గొడ్డలివేటు పడుతోంది. ఎన్నో ఏళ్లుగా పెంచిన చెట్లను మొదళ్ల కాడికి నరికివేయడంతో జిల్లాకేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగులు, పాఠకులు శనివారం నిరసన వ్యక్తం చేశారు.

నల్లగొండ

జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ప్రతీ రోజు సుమారు 300 నుంచి 400 మంది నిరుద్యోగులు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవడంకోసం వస్తుంటారు. అయితే వారు మధ్యాహ్నంవేళ గ్రంథాలయంలోని ప్రారంభంలో ఉండే గార్డెన్‌లో కూర్చొని భోజనం చేస్తుంటారు. చెట్ల నీడ ఉండడంతో వాళ్లకు ఇన్నాళ్లు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే ఈ నెల 26న గ్రంథాలయ సిబ్బంది ఆదేశాల మేరకు కూలీలు చెట్లను నరికివేశారు. అయితే ఇందులో రోడ్డు వెంట విద్యుత్‌ స్తంభాల వైర్లకు తలుగుతున్న చెట్ల కొమ్మలతోపాటు లైబ్రరీ గార్డెన్‌లోని చెట్లను కూడా నరికివేశారు. ఇదేమని అడిగితే మీరు ఏం చేసుకుంటారో.. చేసుకోండని గ్రంథాలయ సిబ్బంది సమాధానం ఇచ్చారని నిరుద్యోగులు చెబుతున్నారు. అయితే గార్డెన్‌లోని సుమారు 10 నుంచి 20 వరకు పెద్దపెద్ద చెట్లను నరికివేయడంతో వేసవిలో తమ పరిస్థితి దారుణంగా ఉంటుందని, ఎండ వేడిమిని తట్టుకోవడం కష్టమని ఉద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదనపు కలెక్టర్‌ దృష్టికి సమస్యలు

ఇటీవల నల్లగొండ అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ గ్రంథాలయ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇటీవల ఆయన గ్రంథాలయాన్ని సందర్శించిన సమయంలో నిరుద్యోగులు పలు సమస్యలను లేవనెత్తారు. ఇందులో ప్రధానంగా సిబ్బంది నిర్లక్ష్యపు విధానాలు మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి జిల్లాకేంద్ర గ్రంథాలయంలో తిష్ఠవేసి, తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఫ గ్రంథాలయం ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రధాన ద్వారా ముందు నుంచి గ్రంథాలయంలోకి వచ్చేవారు. అయితే ప్రస్తుతం ముందు నుంచి డోర్‌ మూసి వేసి, సైడ్‌ నుంచి డోర్‌ తెరుస్తుండడంతో అందులో చదువుకునే వారికి ఇబ్బంది కలుగుతుందని ఆయనకు వివరించారు. ఎందుకంటే సైడ్‌ డోర్‌నుంచి పాఠకులు, నిరుద్యోగులు, బయట వారు పుస్తక విభాగం పక్కనే ఉన్న పత్రికా విభాగంలోకి వచ్చి వెళుతుంటారు. అదే విధంగా పక్కన వాటర్‌ ఫిల్టర్‌ శబ్ధం కూడా వస్తుంది. దీంతో పుస్తక విభాగంలో చదువుకునే వారికి ఇబ్బంది అవుతుందని అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని నిరుద్యోగులు చెబుతున్నారు.

ద్విచక్రవాహనాలు బయట పెట్టమంటే ఎలా?

చదువుకునేందుకు వచ్చే మహిళలు, నిరుద్యోగ అభ్యర్థులు తమ ద్విచక్రవాహనాలు గ్రంథాలయంలో పార్కింగ్‌ చేసి ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు చదువుకుంటారు. అయితే గ్రంథాలయ సిబ్బంది తమను బైక్‌లు బయట పెట్టుకోవాలని ఆదేశిస్తున్నారని నిరుద్యోగులు చెబుతున్నారు. అసలే వేసవి కాలం, ఆపై బైక్‌లలో పోయించే పెట్రోల్‌ అర లీటర్‌, లీటర్‌ అది కూడా ఎండకు ఆవిరైపోతే, తాము ఇంటికి ఎలా వెళ్లాలని, తమకు ఆర్థికంగా ఇబ్బందిగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. బయట ఎక్కడ పడితే అక్కడ, రోడ్డు వెంట పెడితే పోలీసుల ఛలాన్లు తమకు తలకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భోజనం ఎక్కడ చేయాలి

ఇన్నాళ్లు గార్డెన్‌లోని పచ్చనిచెట్ల కింద నీడలో భోజనం చేశామని, ఇక ఉన్న చెట్లు కొట్టేస్తే తాము భోజనం ఎక్కడ చేయాలని మహిళా నిరుద్యోగ అభ్యర్థులు గ్రంథాలయ కార్యదర్శిని ప్రశ్నించారు. అయితే ఆమె సమాధానంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయంలోని రేకుల షెడ్డు కింద ద్విచక్రవాహనాలు తీసి, అక్కడే కూర్చొని తి నాలని కార్యదర్శి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్నది వేసవి.. రేకుల షెడ్డు కింద కూర్చొని ఎలా తినాలని నిరుద్యోగులు ప్రశ్నించారు. కనీసం చెట్ల నీడన కూర్చొని తిందామన్నా కూడా కార్యదర్శి ఒప్పుకోకపోవడం విచారకరమన్నారు.

సిబ్బందిని బదిలీ చేయాలని ఆందోళన

జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే బదిలీ చేయాలని ఉద్యోగార్థులు డిమాండ్‌చేశారు. గ్రంథాలయంలో చెట్ల నరికివేతను నిరసిస్తూ శనివారం గ్రంథాలయంలో నిరరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ సిబ్బంది నిర్లక్ష్యంతోనే గ్రంథాలయంలో సమస్యలు పేరుకుపోయాయని, వారి తీరు సరిగాలేదని ఆరోపించారు. జిల్లా అధికారులను సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రంథాలయంలో చెట్లు కొట్టివేయడం ద్వారా శబ్ధ, వాయి కాలుష్యం పెరిగి తమ ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలున్నాయన్నారు. ఆందోళన చేస్తున్న విషయాన్ని కార్యదర్శి పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు. వారు నిరుద్యోగులతో మాట్లాడి నిరసనను విరమింపజేశారు. కార్యక్రమంలో ఉద్యోగ అభ్యర్థులు నీలం వెంకన్న, హనుమంత చారి, యాదగిరి, కొప్పు శివ, శ్రీనివాస్‌, హరీష్‌, నాగరాజు, జాని, నాగేశ్వర్‌రావు, నరేష్‌, శ్రీనాథ్‌, వినయ్‌, కోటేష్‌, సైదులు, అంజలి, మమత పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 12:05 AM