Share News

వైద్యాధికారికి లంచాల రోగం

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:22 AM

లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు. ఆస్పత్రికి నాన్‌టెండర్‌ సర్జికల్‌, డ్రగ్స్‌ సరఫరా చేసే కాంట్రాక్టర్‌ నుంచి శుక్రవారం

వైద్యాధికారికి లంచాల రోగం

ఏసీబీకి చిక్కిన నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

నాన్‌టెండర్‌ సర్జికల్స్‌, డ్రగ్స్‌ సరఫరాకు రూ.3 లక్షలు డిమాండ్‌

అత్యవసరానికి సంబంధించిన పనుల్లో అధికారి పైసల కక్కుర్తి

రెండు సార్లు రూ.లక్ష చొప్పున ఇచ్చినా ఇంకా కావాలని పట్టు

నల్లగొండ టౌన్‌, ఫిబ్రవరి 16: లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు. ఆస్పత్రికి నాన్‌టెండర్‌ సర్జికల్‌, డ్రగ్స్‌ సరఫరా చేసే కాంట్రాక్టర్‌ నుంచి శుక్రవారం లచ్చునాయక్‌ తన ఇంట్లో రూ.3లక్షలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని రవి మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్‌ రాపోలు వెంకన్న ఎల్‌-1 కాంట్రాక్టర్‌. రెండేళ్ల కిందట జేసీ అధ్యక్షతన గల కొనుగోలు కమిటీ ద్వారా ఆస్పత్రికి అవసరమయ్యే మందుల సరఫరాకు సంబంధించిన టెండర్‌ దక్కించుకున్నాడు. టెండర్‌ ప్రకారం మందులు సరాఫరా చేయడమే కాకుండా గత ఏడాది మార్చి నెల నుంచి అధికారుల ఆదేశానుసారం నాన్‌టెండర్‌లోని అత్యవసర సర్జికల్‌, డ్రగ్స్‌ను కూడా డిస్కౌంట్‌ మేరకు సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ నాన్‌టెండర్‌ సర్జికల్‌, డ్రగ్స్‌ సరఫరా విషయంలో సదరు డిస్ట్రిబ్యూటర్‌ను మందుల సరఫరాకు టెండర్‌ పిలుస్తానని వేధిస్తున్నారు. టెండరు లేకుండా సరఫరా చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు వెంకన్న 45 రోజల కిందట రూ.లక్ష, ఆ తర్వాత 10 రోజుల తర్వాత మరో రూ.లక్ష సూపరింటెండెంట్‌కు ఇచ్చాడు. అయినప్పటికీ సూపరింటెండెంట్‌ వేధింపులు ఆగలేదు. మరో రూ.3 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశాడు. దీంతో డిస్ట్రిబ్యూటర్‌ రాపోలు వెంకన్న అవినీతి ఏసీబీ ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు వెంకన్న శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో రూ.3లక్షల నగదును సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ ఇంటికి వెళ్లి ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ అనంతరం రిమాండ్‌ నిమిత్తం లచ్చునాయక్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు వెంకట్రావ్‌, రామారావు, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 04:22 AM