Share News

మేడారంలో భక్త జన సందోహం

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:58 AM

మేడారం జాతర ఇంకా ప్రారంభం కాకముందే వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు జాతర

మేడారంలో భక్త జన సందోహం

వనదేవతల దర్శనానికి 10 లక్షల మందికి పైగా భక్తుల రాక

ములుగు, ఫిబ్రవరి 11: మేడారం జాతర ఇంకా ప్రారంభం కాకముందే వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు జాతర జరగనుంది. 2 నెలల ముందు నుంచే భక్తుల రాక మొదలవ్వగా.. జాతర సమీపిస్తుండడంతో తాకిడి రోజురోజుకి పెరిగిపోతోంది. ఆదివారం 10 లక్షల మందికిపైగా భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో వ్యాపారాలు చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. ములుగు మండలం జాకారం-భూపాల్‌నగర్‌ స్టేజీ మధ్య జరుగుతున్న రహదారి విస్తరణ పనుల వల్ల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఆదివారం సాయంత్రం ఓ లారీ గుంతలో దిగబడడంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రాకపోకలను క్రమబద్ధీకరించారు.

23న సీఎం రేవంత్‌రెడ్డి రాక...

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ నెల 23న మేడారం జాతరకు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. వనదేవతలను ఆదివారం దర్శించుకున్న మంత్రి సీతక్క జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కోటిన్నర మందికి పైగా భక్తులు జాతరకు వచ్చే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రపతి, గవర్నర్‌ను కూడా ఆహ్వానించామని వారు కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతకు ముందు ఏటూరునాగారం మండలంలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

వేడుకగా నాగోబా జాతర

ఇంద్రవెల్లి: రాష్ట్రంలో రెండో అతి పెద్ద గిరిజన ఉత్సవం నాగోబా జాతర ఘనంగా జరుగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ప్రదాన ఆలయం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జాతరలో మూడో రోజు, ఆదివారం... నాగోబా ప్రధాన ఆలయం వెనుక మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో పెర్సాపేన్‌, బాన్‌ దేవతలకు ప్రత్యేక పూజలు జరిగాయి. కొత్తగా బేటింగ్‌(పరిచయం) అయిన కోడళ్లు మర్రి చెట్టు వద్ద ఉన్న బావి నుంచి పవిత్ర జలం తీసుకొచ్చి బాన్‌ దేవత ఆలయం ముందు ఉన్న పాత పుట్టను తొలగించారు. మెస్రం వంశీయులు పాత భాన్‌ దేవతల ప్రతిమలను పవిత్ర జలంతో శుద్ధి చేశారు. కోడళ్లు కొత్త పుట్టలను తయారు చేసి భాన్‌ దేవతకు పూజలు చేశారు. ఇక, జాతరలో అత్యంత ప్రధానంగా భావించే గిరి దర్బార్‌ సోమవారం జరగనుంది.

Updated Date - Feb 12 , 2024 | 02:58 AM