Share News

అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:12 AM

నిత్యం అభివృద్ధి అంటూ పనులపై దృష్టిపెట్టడానికన్నా ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేవాళ్లమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

అబద్ధాల ముందు  అభివృద్ధి ఓడింది

కాంగ్రెస్‌ దుష్ప్రచారం నమ్మి, పనిచేసిన వారిని తిరస్కరించారు

పనులకంటే ప్రచారంపై దృష్టిపెడితే గెలిచేవాళ్లం

గిరిజనులకు ఎంతో చేశాం.. అయినా పూర్తి మద్దతివ్వలేదు

పార్టీ శ్రేణులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు

కేసీఆర్‌ వంటి గొప్ప నాయకుడు మనకున్నారు

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): నిత్యం అభివృద్ధి అంటూ పనులపై దృష్టిపెట్టడానికన్నా ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేవాళ్లమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. నోటికొచ్చిన హామీలు ఇవ్వడంతోపాటు కాంగ్రెస్‌ వాళ్ల తప్పుడు ప్రచారాన్ని నమ్మిన ప్రజలు బాగా పనిచేసిన నాయకులను కూడా తిరస్కరించారని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్‌లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, కడియం శ్రీహరి, ఎంపీ మాలోతు కవిత, పార్టీ నేతలు సత్యవతి రాథోడ్‌, రావులచంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదంటున్నారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6,47,479 రేషన్‌ కార్డులు ఇవ్వడంతోపాటు 29 లక్షల పింఛన్లను 46 లక్షలకు పెంచినట్టు తెలిపారు. దేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది తమ ప్రభుత్వమేనని, ప్రభుత్వ ఉద్యోగులకు 73శాతం జీతాలు పెంచినది సీఎం కేసీఆర్‌ అన్నారు. అయినా తాము చెప్పుకోలేదన్నారు.

అందుకే కాంగ్రెస్‌ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని, పనులమీదకన్నా ప్రచారంపై దృష్టిపెట్టి ఉంటే తామే గెలిచే వాళ్లమని తెలిపారు. ‘గిరిజనవర్గాలకు ఎంతో చేశాం.. సంక్షేమ పథకాలతోపాటు స్థానిక సంస్థల రిజర్వేషన్‌, పోడు భూముల పట్టాల పంపిణీ వంటివి చేపట్టాం. అయినా గిరిజనులు ఎక్కువగా ఉన్నచోట బీఆర్‌ఎ్‌సకు పూర్తి మద్దతు ఇవ్వలేదు’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇలాంటి క్షేత్రస్థాయి అంశాలను సమీక్షించుకుని ముందుకెళ్దామని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. ప్రజలు బీఆర్‌ఎ్‌సను పూర్తిగా తిరస్కరించలేదన్న ఆయన మూడో వంతు (39) సీట్లు దక్కాయని, 14 స్థానాల్లో కేవలం 6వేల ఓట్ల తేడాతోనే ఓటమి చెందామన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు దాన్ని నెరవేర్చలేక గత ప్రభుత్వంలో అప్పులు, శ్వేతపత్రాల నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. పార్టీ శ్రేణులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, కేసీఆర్‌ వంటి గొప్ప నాయకుడు మనకున్నారన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో మనం గెలుపు సాధిద్దామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

భవిష్యత్తులో బీఆర్‌ఎ్‌సకే అధికారం : హరీశ్‌

‘పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్‌ హయాంలో పురోభివృద్ధి సాధించింది. దురదృష్టవశాత్తు మనం ఓటమి చెందాం. ఇది స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమే. భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది‘ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ గ్లోబల్‌ ప్రచారంపై పార్టీ శ్రేణులు ప్రజల్లో చర్చ చేయాలని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తున్న సర్కారు తీరును ఎండగట్టాలని చెప్పారు. నిరుద్యోగ భృతిపై హామీ ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలు చేయడంలేదని జనం రివర్స్‌ అయ్యారని, ఇక్కడా ఆ పరిస్థితి వస్తుందన్నారు. నెలరోజుల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో ఉంటారని, ఎవరికి సమస్య వచ్చినా అందరం బస్సు వేసుకొని మీ ముందుకు వస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం బీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్‌ అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు పార్టీ జిల్లా కార్యాలయాల్లో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామని,. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తామని, అవసరమైతే వారి పిల్లలకూ సహకారం అందిస్తామని చెప్పారు.

Updated Date - Jan 12 , 2024 | 05:14 AM