అభివృద్ధి అంతంతే
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:55 AM
జిల్లాలో ఈ ఏడాది అభివృద్ధి, సంక్షేమం అంతంతమాత్రంగానే సాగాయి. నిధుల కేటాయింపుల కోసం అన్ని శాఖలు ఎదురు చూశాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నిధులు లేక అభివృద్ధి అటకెక్కింది. ఆరు గ్యారంటీల్లో సంక్షేమం కొంత మేరకు ఊరటను ఇచ్చినా కొత్త పథకాలు రాలేదు. కొత్త పింఛన్లు, రేషన్ కార్డులకు నిరీక్షణ తప్పలేదు.
- వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో ముందడుగు
- ప్రారంభంకాని మల్కపేట రిజర్వాయర్
- అందని కొత్తపింఛన్లు, రేషన్‌కార్డులు
- అన్నదాతలకు రుణమాఫీ ఊరట
- రైతు భరోసాలో నిరాశ
- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఒడిదుడుకులు
- నెరవేరిన యారన్ డిపో కల
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
జిల్లాలో ఈ ఏడాది అభివృద్ధి, సంక్షేమం అంతంతమాత్రంగానే సాగాయి. నిధుల కేటాయింపుల కోసం అన్ని శాఖలు ఎదురు చూశాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నిధులు లేక అభివృద్ధి అటకెక్కింది. ఆరు గ్యారంటీల్లో సంక్షేమం కొంత మేరకు ఊరటను ఇచ్చినా కొత్త పథకాలు రాలేదు. కొత్త పింఛన్లు, రేషన్ కార్డులకు నిరీక్షణ తప్పలేదు. అన్నదాతలకు రుణమాఫీ వచ్చినా రైతు భరోసా నిరాశ కలిగించింది. జిల్లాలో ప్రధానంగా వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధిలో ముందడుగు పడిందని, సిరిసిల్ల సెగ్మెంట్ వెనకడుగు వేసిందని విమర్శలు వచ్చాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పాత బకాయిల విడుదల మినహా నేతన్నలకు ఊరటనిచ్చే చర్యలు కనపించలేదు. వేములవాడ కేంద్రంగా యారన్ డిపో ఏర్పడింది. నిధులు లేక అనేక అభివృద్ధి పనులు నెమ్మదించాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు వచ్చిన సందర్భంలో మల్కపేట రిజర్వాయర్‌ను ప్రారంభిస్తారని ఎదురు చూసినా నిరాశ పర్చింది. వేములవాడ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్వయంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందించిన ఆరు గ్యారంటీల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.500 కోట్ల లబ్ధి చేకూరింది. రైతులకు రూ.380 కోట్ల రుణమాఫీ, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.379 కోట్ల బకాయిలు వచ్చాయి. గడిచిపోతున్న 2024 సంవత్సరంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం అంతంత మాత్రమే సాగాయి.
వీటీడీఏ విస్తరణ
జిల్లాలోని పల్లె ప్రాంతాలు పట్టణ సొబగులు దిద్దుకోనున్నాయి. ప్రభుత్వం 13 జిల్లాలను అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో విలీనం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని విస్తరిస్తూ అక్టోబరులో నోటఫికేషన్ జారీ చేసింది. వీటీడీఏ పరిధి పెరగడంతో అభివృద్ధి పెరుగుతుందని భావిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలు 255 గ్రామ పంచాయతీలు, 152 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా వీటీడీఏను మార్చడం అభివృద్ధికి అడుగులు పడుతుందని భావించారు.
రాజన్న ఆలయ అభివృద్ధికి అడుగులు
ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక హామీల మధ్యే కాలం గడిచిపోగా ఈ సంవత్సరం వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో అభివృద్ధికి అడుగులు పడ్డాయి. భక్తులకు సౌకర్యవంతంగా, వేగంగా దర్శనం కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. బ్రేక్ దర్శనం అమలు చేశారు. మూలవాగు మీదుగా రాజన్న ఆలయానికి చేరుకునే విధంగా ప్రభుత్వం రూ.127 కోట్ల నిధులు కేటాయించి పనుల్లో వేగం పెంచింది. కోడె మొక్కులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ గోశాలల అభివృద్ధికి రూ.66 లక్షలు కేటాయించారు. రూ.43 లక్షలతో సీసీ ఫ్లోరింగ్, రూ.18 లక్షలతో మురికి కాలువలు, రూ.50 లక్షలతో గోశాల షెడ్‌కు నిధులు కేటాయించారు. రూ.35 కోట్ల అంచనాలతో అన్నదాన సత్రం నిర్మాణానికి భూమిపూజ చేశారు.
నేతన్నకు కాస్త ఊరట
సిరిసిల్ల నేతన్నలకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం క్లాత్ ఉత్పత్తి ఆర్డర్లకు రూ.28.84 కోట్లు అందించింది. గత ప్రభుత్వ హయాంలో రావాల్సిన బతుకమ్మ చీరలు, ఇతర ఆర్డర్లకు సంబంధించిన బకాయిలు రూ.379 కోట్లు చెల్లించారు. తాజాగా రూ.66 లక్షల మీటర్ల ఆర్వీఎం క్లాత్ ఆర్డర్లు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. స్వశక్తి సంఘాల మహిళలకు రెండు చీరల చొప్పున అందించడానికి కోటి 30 లక్షల చీరల ఉత్పత్తి ఆర్డర్లు కూడా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. సిరిసిల్ల నేతన్నలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యారన్ డిపోను రూ.50 కోట్లతో వేములవాడ కేంద్రంగా ఏర్పాటు చేశారు. 90 శాతం క్రెడిట్‌పై కార్మికులకు యారన్ అందిస్తున్నారు. 11,698 మంది కార్మికులకు త్రిఫ్ట్ కింద రూ.36 కోట్లు అందించారు. నేతన్నకు బీమా కింద 43 మందికి రూ.5 లక్షల చొప్పున అందించారు. యారన్ సబ్సిడీ రూ.37 కోట్లు చెల్లించారు.
అన్నదాతలకు రూ.380 కోట్ల రుణమాఫీ
జిల్లాలో ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి మూడు విడతల్లో చెల్లించింది. 47,977 మంది రైతులకు రూ.381.46 కోట్లు రుణమాఫీ చేసింది. జిల్లాలో 248 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలం సీజన్‌కు సంబంధించి 37,398 మంది రైతుల నుంచి 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా రూ.490.13 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. హామీ మేరకు రైతు భరోసా మాత్రం అమలు చేయలేదు.
పెండింగ్ ప్రాజెక్ట్‌లపై దృష్టి
జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్యాకేజీ 9లో రూ.1180కోట్లతో ఇప్పటి వరకు 81 శాతం పూర్తి చేశారు. మిగతా పనుల కోసం రూ.340కోట్లు కేటాయించారు. ప్యాకేజీ పనులు పూర్తి చేస్తే సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో 56 వేల ఎకరాలు, వేములవాడ నియోజకవర్గంలో కోనరావుపేటలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 10వ ప్యాకేజీ పనులు రూ. 2400 కోట్లతో 90 శాతం పూర్తి చేశారు. మిగతా పనులకు రూ.134కోట్లు కేటాయించారు. దీనికి ద్వారా ఇల్లంతకుంట మండలంలో 15 వేల ఎకరాలు సాగులోకి రానుంది. 11వ ప్యాకేజీలో 75 శాతం పనులు పూర్తి చేశారు. మిగతా పనులకు రూ.152 కోట్లతో పనులు పూర్తి చేయనున్నారు. దీని ద్వారా సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లో 32 వేల ఎకరాలకు నూతనంగా సాగునీరు అందనుంది. 22 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. బోయినపల్లిలో 10 వేల ఎకరాలు, ఆయకట్టుకు నీరందుతుంది. 12వ ప్యాకేజీలో రూ.3200 కోట్లతో 94 శాతం పనులు పూర్తి చేశారు. మరో రూ.50 కోట్లతో పనులు పూర్తి చేయనున్నారు. దీని ద్వారా గంభీరావుపేట ముస్తాబాద్ మండలాల్లో 22 వేల ఎకరాలు నూతంగా సాగులోకి రానుంది. మల్కపేట రిజర్వాయర్ పనులు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నా ప్రారంభించకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. మిడ్ మానేరు నిర్వాసితులకు చేయూతను అందించే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇళ్ల్లు లేని నిర్వాసితుల్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మంజూరు చేసింది. ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు అందించనుంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుండగా రూ.236 కోట్ల విలువైన 4696 ఇందిరమ్మ ఇళ్లను నిర్వాసితులకు మంజూరు చేశారు.
సంక్షేమ సంబరం
జిల్లాలో ఆరు గ్యారంటీల ద్వారా రూ.500 కోట్ల వరకు లబ్ధి చేకూరింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సంఘాల్లోని 63 లక్షల మందిని వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడానికి ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే స్కూల్ యూనిఫాం కుట్టే పని అందించారు. కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఇల్లంతకుంటలో మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు. 12 రకాల వ్యాపార యూనిట్లకు ప్రణాళికలు రూపొందించారు. ఉపాధి హామీ ద్వారా 96 వేల జాబ్ కార్డులను అందించారు. మహిళా శక్తి ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం విజయవంవతంగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.61.60 కోట్ల విలువైన 1.64 కోట్ల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు. జిల్లాలో రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా 93,104 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.7.35 కోట్ల సబ్సిడీని జమ చేశారు. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల జీరో బిల్లుకు రూ.37.50 కోట్లు చెల్లించారు. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, ఒంటరి మహిళకు ఉపాధి కల్పించేందుకు రూ.5 కోట్ల వ్యయంతో ప్రెటోల్ బంక్ ఏర్పాటు చేశారు. 24 మందికి ఉద్యోగాలు అందించారు. కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్లను అందించారు. మత్స్యశాఖ ద్వారా 440 చెరువుల్లో 70.58 లక్షల చేపపిల్లలను వదిలారు. జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. భవిష్యత్‌లో ప్రజల అవసరాలను తీర్చే దిశగా సామాజిక, అర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వేను చేపట్టారు. 1,92,432 ఇళ్ల సర్వేకు సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తున్నారు. క్రీడాకారులను ప్రొత్సహించే దిశగా సీఎం కప్ నిర్వహించారు. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యాక్రమాలను చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక యాప్ ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలో 1,07,398 దరఖాస్తులను ఇంటింటి సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం సర్కారు పాఠశాలను బలోపేతం చేసేదిశగా ఖాళీల భర్తీకి పూనుకుంది. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ సెంటర్‌లుగా అభివృద్ధి చేయడంతోపాటు డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టింది. అమ్మఆదర్శ పాఠశాలల కింద 283 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లాలో 136 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, భాషా పండితులు, పీఈటీ పోస్టులు, భర్తీ చేసి నియామక పత్రాలను అందించారు. 455 మంది టీచర్లకు పదోన్నతులు, గ్రూప్ 4 ద్వారా 124 మందికి ఉద్యోగాలు అందించారు.