Share News

అక్రమ రోడ్డును పరిశీలించిన దేవాదాయ కమిషనర్‌

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:37 AM

మంచిరేవులలోని దేవాదాయశాఖ భూముల్లో హైకోర్టు స్టేట్‌సకో ఉత్తర్వులకు విరుద్ధంగా నార్సింగ్‌ మున్సిపాలిటీ వేసిన రోడ్డును రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పరిశీలించారు.

అక్రమ రోడ్డును పరిశీలించిన దేవాదాయ కమిషనర్‌

అక్కడి నుంచే రంగారెడ్డి కలెక్టర్‌కు ఫోన్‌

మున్సిపల్‌ అధికారులతో కలెక్టర్‌ భేటీ

నార్సింగ్‌ కమిషనర్‌ మీద ఆగ్రహం

నార్సింగ్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మంచిరేవులలోని దేవాదాయశాఖ భూముల్లో హైకోర్టు స్టేట్‌సకో ఉత్తర్వులకు విరుద్ధంగా నార్సింగ్‌ మున్సిపాలిటీ వేసిన రోడ్డును రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పరిశీలించారు. గండిపేట మండలం మంచిరేవుల గ్రామంవేణుగోపాలస్వామి ఆలయ భూముల్లో మున్సిపాలిటీ అక్రమంగా రోడ్డు వేస్తోందంటూ శుక్రవారం దేవాదాయ అధికారులు అడ్డుకున్నారు. విషయం శనివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం కావడంతో స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్‌ శనివారం వచ్చి వివాదాస్పద రోడ్డును పరిశీలించారు. ఆయన ఆదేశం మేరకు దేవాదాయ శాఖ అధికారులు అక్కడ ఉన్న నిర్మాణ సామగ్రిని తొలగించారు. దేవాదాయభూములో ఎలాంటి అక్రమాలు జరిగినా ఉపేక్షించొద్దని అనిల్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచే రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ దేవాదాయ, మున్సిపల్‌ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నార్సింగ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌రెడ్డి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ అనిత, అసిస్టెంట్‌ కమిషనర్‌ శేఖర్‌, రంగారెడ్డి జిల్లా ఎంఆర్‌వో అనిత, సూపరింటెండెంట్‌ మోహన్‌, ఆలయం ఈవో నరేందర్‌, ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు పాల్గొన్నారు. తాము రోడ్డు నిర్మాణాన్ని ఆపినా అర్ధరాత్రి పూట నిర్మాణం చేపట్టారని, తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని, దేవాదాయ శాఖ అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ నార్సింగ్‌ మున్సిపల్‌ కమిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, అర్ధరాత్రి పూట రోడ్డు వేయడం పట్ల వివరణ ఇవ్వాలని ఆదేశించారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. రోడ్డు పనులు ప్రస్తుతానికి నిలిచిపోయాయని, జిల్లా కలెక్టర్‌ ఈ వివాదంపై విచారణ జరిపి ఏం చేయాలో నిర్ణయిస్తారని చెప్పారు.

Updated Date - Jan 21 , 2024 | 11:15 AM