Share News

కదం తొక్కుదాం.. తడాఖా చూపుదాం

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:49 AM

‘‘రాష్ట్రం నలుమూలల నుంచి తుక్కుగూడ జనజాతర సభకు కదం తొక్కుదాం. కాంగ్రెస్‌ తడాఖాను దేశానికి చాటుదాం’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం తుక్కుగూడలో జరగనున్న తెలంగాణ కాంగ్రెస్‌ జనజాతర సభ ఏర్పాట్లను ఆయన

కదం తొక్కుదాం.. తడాఖా చూపుదాం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తుక్కుగూడ సభ ఏర్పాట్ల పరిశీలన

బీఆర్‌ఎస్‌ నేతలు ప్రతిపక్షంలోనూ పనికిరారని ధ్వజం

ఇబ్రహీంపట్నం/మహేశ్వరం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రం నలుమూలల నుంచి తుక్కుగూడ జనజాతర సభకు కదం తొక్కుదాం. కాంగ్రెస్‌ తడాఖాను దేశానికి చాటుదాం’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం తుక్కుగూడలో జరగనున్న తెలంగాణ కాంగ్రెస్‌ జనజాతర సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడ్డారు. ‘‘బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రతిపక్షంలో ఉండడానికి కూడా పనికిరారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి.. నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు’’ అని విమర్శించారు. జనజాతర వేదిక నుంచి ఏఐసీసీ నాయకత్వం తెలంగాణ మోడల్‌గా సందేశం ఇవ్వబోతుందని భట్టి వివరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనాయకులు రాహుల్‌, ప్రియాంకలు ఇదే వేదిక నుంచి ఆరు గ్యారెంటీలను ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా ఇక్కడి నుంచే ప్రకటించనున్నట్లు తెలిపారు. పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన బీఆర్‌ఎస్‌.. మతం పేరుతో దేశంలో వైషమ్యాలను సృష్టిస్తున్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో తగిన శాస్తి తప్పదని.. ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రె్‌సతోనే సాధ్యమని అన్నారు.

ఎండలు పెరిగినా విద్యుత్తు కోతలుండవు

ఖమ్మం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండలు పెరుగుతుండడంతో విద్యుత్తు వినియోగం పెరుగుతోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. అయినా.. విద్యుత్తు కోతలు ఉండబోవని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి ఉన్నచోట పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. గత ప్రభుత్వం యాదాద్రి పవర్‌ప్లాంట్‌ వంటి ప్రాజెక్టులను మొదలు పెట్టాయని, ఆ ప్లాంట్‌కు బొగ్గు తరలిపునకే అధిక వ్యయం అవుతుందని విమర్శించారు.

Updated Date - Apr 05 , 2024 | 05:49 AM