Share News

కాంగ్రెస్‌ ప్రచారంలో ఢిల్లీ పోలీసుల జోక్యం

ABN , Publish Date - May 09 , 2024 | 05:25 AM

టీపీసీసీ సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శుల వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడంతో పాటు ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు వారిని వేధిస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైకోర్టును

కాంగ్రెస్‌ ప్రచారంలో ఢిల్లీ పోలీసుల జోక్యం

వారెంట్‌ లేకుండా కార్యకర్తల ఇళ్లల్లోకి వెళ్లి సోదాలు

హైకోర్టులో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పిటిషన్‌

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శుల వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడంతో పాటు ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు వారిని వేధిస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైకోర్టును ఆశ్రయించారు. 29 మంది టీపీసీసీ సోషల్‌ మీడియా స్టేట్‌ సెక్రటరీలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. అమిత్‌ షా మార్ఫింగ్‌ వీడియోను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలు సోషల్‌ మీడియాలో పెట్టారన్న ఆరోపణలతో దాదాపు 150మంది ఢిల్లీ పోలీసులు తమ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తులో ఉండగా ఢిల్లీ పోలీసులు తమ సోషల్‌ మీడియా కార్యదర్శులకు 91/160సీఆర్పీసీ నోటీసులు ఇవ్వడంతో పాటు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి వారంట్‌ లేకుండా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ పిటిషన్‌ గురువారం జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది.

Updated Date - May 09 , 2024 | 08:23 AM