Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

తల్లిదండ్రులు, టీచర్లలోనే లోపం

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:40 AM

విద్యార్థుల్లో డ్రగ్‌ సంస్కృతికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాల్లో లోపమే కారణమని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ‘

తల్లిదండ్రులు, టీచర్లలోనే లోపం

పిల్లల్లో డ్రగ్స్‌ సంస్కృతికి అదే కారణం..

ప్రతీ బడిలో డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ కమిటీలు తప్పనిసరి

గుడ్‌ టచ్‌- బ్యాడ్‌ టచ్‌పైనా అవగాహన కల్పించాలి

త్వరలో సర్క్యులర్‌.. ప్రొటోకాల్‌ పాటించాల్సిందే

నార్కోటిక్స్‌ డీ-సెన్సిటైజేషన్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం

వారి సినిమాలను బ్యాన్‌ చేయాలి: శాండిల్య

హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో డ్రగ్‌ సంస్కృతికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాల్లో లోపమే కారణమని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ‘‘ఒకప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పినట్లు పిల్లలు వినేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. పిల్లలు చెప్పినట్లే తల్లిదండ్రులు వింటున్నారు. పిల్లలపై పర్యవేక్షణ లేకపోవడంతో.. వారు పెడదోవ పడుతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగర పోలీసు విభాగం, హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌(హెచ్‌సీఎ్‌ససీ) ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఐసీసీసీ)లో ‘నార్కోటిక్స్‌ అండ్‌ అదర్‌ అడిక్షన్స్‌ డీ-సెన్సిటైజేషన్‌ అండ్‌ రీప్రాసెసింగ్‌ ప్రివెనక్షన్‌’పై ఆదివారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సుమారు వెయ్యి పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. విద్యార్థులు యుక్తవయసులో దుర్వ్యసనాల బారిన పడడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపమే కారణమని విమర్శించారు. ‘‘డ్రగ్స్‌, గంజాయి స్కూలు స్థాయికి చేరడం ఆందోళనకరం. దేశంలోనే అత్యంత యువశక్తి కలిగిన రాష్ట్రం తెలంగాణ. యువశక్తిని పెడదోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, టీచర్లు, ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర అన్ని శాఖలపై ఉంది. అంతా కలిసి సంయుక్తంగా పనిచేయాలి. డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. ఇకపై ప్రతీ స్కూల్‌లో డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల వల్ల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.

గుడ్‌ టచ్‌-బ్యాడ్‌ టచ్‌ గురించి చిన్నారులకు తెలియజేయాలని చెప్పారు. ఈ మేరకు త్వరలో సర్క్యులర్‌ జారీ చేస్తామని, ఆ ప్రొటోకాల్స్‌ను పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీ-న్యాబ్‌) డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య మాట్లాడుతూ.. డ్రగ్స్‌ సేవించే నటులు, దర్శకుల సినిమాలను బ్యాన్‌ చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలని, వారికి డబ్బులిచ్చినంత మాత్రాన బాధ్యత తీరిపోదని సూచించారు. హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ఇప్పుడు డ్రగ్స్‌ మహమ్మారి అన్ని ప్రాంతాలకు విస్తరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాణా దుకాణాలు, పాన్‌ డబ్బాలు, టిఫిన్‌ సెంటర్లలోనూ డ్రగ్స్‌ లభించడం ఆందోళనకరమన్నారు. సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మొహంతి మాట్లాడుతూ డ్రగ్స్‌ ఆఫర్‌ చేసే స్నేహితులపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. రాచకొండ సీపీ తరుణ్‌ జోషి మాట్లాడుతూ డ్రగ్స్‌ సేవించే పిల్లల నడవడికలో మార్పులను గమనించే అవకాశం తల్లిదండ్రు లు, టీచర్లకే ఉంటుందని, తొలినాళ్లలోనే ఆ మార్పు ను గుర్తించి, చర్యలు తీసుకుంటే.. వారిని వ్యసనాలకు దూరం చేయొచ్చన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన, హెచ్‌సీఎ్‌ససీ సలహాదారు భరణి అరోల్‌ పాల్గొన్నారు. అంతకు ముందు డ్రగ్స్‌ వల్ల దుష్ప్రభావాలకు సంబంధించిన బుక్‌లెట్‌ను అతిథులు విడుదల చేశారు.

Updated Date - Mar 04 , 2024 | 07:38 AM