భక్తిశ్రద్ధలతో దీపారాధన
ABN , Publish Date - Jan 19 , 2024 | 11:00 PM
హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా ఉర్సు వేడుకల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం దీపారాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
రెండో రోజూ జేపీ దర్గాలో ఘనంగా ఉర్సు వేడుకలు
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం
కొత్తూర్, జనవరి 19: హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా ఉర్సు వేడుకల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం దీపారాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు చిన్నారులకు తలవెంట్రుకలను తీయించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కాగా, దర్గా ఆవరణలో భక్తులు పెద్దఎత్తున దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం అనవాయితీ. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం కావడంతో మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దర్గాలో ప్రార్థనల అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ముఖ్యంగా నగరం నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుని నియాజ్‌లు నిర్వహించి అన్నదానాలు చేశారు. ఓ వైపు విద్యుత్ దీపాలంకరణ, మరోవైపు దీపారాధనలతో దర్గా ప్రాంతం ధగధగ మెరిసిపోయింది. ఉర్సు సందర్భంగా దర్గా ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. కొత్తూర్ ఇన్‌స్పెక్టర్ నర్సింహారావు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే ఉదారత.. 50వేల వాటర్‌బాటిళ్ల పంపిణీ
ఉర్సును పురస్కరించుకొని దర్గాకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సొంత ఖర్చుతో రూ.50వేల వాటర్‌బాటిళ్లను సమకూర్చారు. సీడబ్లూసీ మెంబర్ వంశీచంద్‌రెడ్డితో కలిసి వాటర్‌బాటిళ్లను గురువారం రాత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వంశీచంద్‌రెడ్డి ఎమ్మెల్యే శంకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. దర్గాకు వచ్చిన వేలాదిమంది భక్తులు సైతం ఎమ్మెల్యే వీర్లపల్లికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.