Share News

భాష రాక బందీ అయిన దళిత ప్రవాసి

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:01 AM

విమానంలో మానవతా దృక్పథంతో ఒక చిన్నారికి సహాయపడిన తెలంగాణకు చెందిన ఓ దళిత ప్రవాసి, భాష రాకపోవడంతో పరాయి దేశంలో బందీ అయ్యాడు.

భాష రాక బందీ అయిన దళిత ప్రవాసి

సహాయం చేయబోయి జైలుపాలైన తెలంగాణవాసి

కేసు పూర్తయ్యే దాకా శ్రీలంకను విడిచి వెళ్లలేని దుస్థితి

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి, జనవరి 4: విమానంలో మానవతా దృక్పథంతో ఒక చిన్నారికి సహాయపడిన తెలంగాణకు చెందిన ఓ దళిత ప్రవాసి, భాష రాకపోవడంతో పరాయి దేశంలో బందీ అయ్యాడు. సౌదీ నుంచి తెలంగాణకు వస్తూ.. చేయని తప్పుకు శ్రీలంకలో నేర శిక్షాస్మృతితోపాటు అంతర్జాతీయ విమానయాన చట్టాలలో ఇరుక్కొని విలవిలలాడుతున్నాడు. జగిత్యాల జిల్లాలోని పొలాస గ్రామానికి చెందిన బి.శంకరయ్య సౌదీలో పనిచేస్తున్నాడు. గత నెల 12న ఆయన రియాద్‌ నుంచి హైదరాబాద్‌కు శ్రీలంక విమానంలో బయలుదేరాడు. అదే విమానంలో శ్రీలంకకు చెందిన ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కొలొంబోకు వెళ్తోంది. భాష రాకపోడంతో... చలి కారణంగా విమానం క్యాబిన్‌లోని దుప్పటి తీసి పాపకు కప్పాలని ఆమె తనను కోరినట్లుగా భావించిన శంకరయ్య, దుప్పటి తీసి పాపపై కప్పాడు. దీంతో తన పాప పట్ల శంకరయ్య అనుచితంగా ప్రవర్తించాడని ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. తెలుగు తప్ప ఇంగ్లీషు, తమిళం, సింహళం లాంటి ఏ ఇతర భాష తెలియకపోవడంతో శంకరయ్య తన వాదనను స్పష్టంగా వినిపించలేకపోయాడు. విమానం కొలొంబోలో దిగిన వెంటనే పైలట్‌ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శంకరయ్యను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు బెయిల్‌ లభించింది. కానీ అందుకు ఇద్దరు శ్రీలంక జాతీయుల పూచీకత్తు ఇవ్వాల్సి ఉంది. శ్రీలంక జాతీయులెవరూ తనకు తెలియకపోవడంతో బెయిల్‌ మంజూరైనప్పటికీ ఆయన బయటకు రాలేకపోతున్నాడు. ఎవరైనా కరుణించి బెయిల్‌ ఇచ్చినా శంకరయ్య జైలు నుంచి బయటకు వస్తాడు కానీ కేసు విచారణ పూర్తయ్యే వరకూ శ్రీలంకను విడిచి, హైదరాబాద్‌కు గానీ, గల్ఫ్‌కు గానీ వెళ్లలేడు. న్యాయస్థానం కేసు విచారణను మార్చి 1కి వాయిదా వేసింది. అప్పటిలోగా ఆయన సౌదీ వీసా గడువు ముగిసిపోయి, తిరిగి వచ్చే అర్హత, ఉద్యోగం కోల్పోతాడని కేసును చూస్తున్న రియాధ్‌లోని సామాజిక కార్యకర్త, సాటా ప్రతినిధి ముజ్జమీల్‌ షేక్‌ తెలిపారు.

Updated Date - Jan 05 , 2024 | 07:41 AM