Share News

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:54 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం శాస్త్రోక్తంగా నిత్య పూజలు నిర్వహించారు.

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు
ధనుర్మాస పర్వాల్లో భాగంగా మంగళహారతులు నిర్వహిస్తున్న మహిళా భక్తులు

కొనసాగుతున్న ధనుర్మాసోత్సవాలు

భువనగిరి అర్బన్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం శాస్త్రోక్తంగా నిత్య పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వయంభువులను మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టామూర్తులను వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. ప్రాకార మండపంలో సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో వైభవంగా చేపట్టారు. అష్టభుజి ప్రాకార మండపంలో స్వామి అమ్మవార్లను ముగ్ధమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజవాహన సేవలో ఊరేగించి విష్వక్సేనుడి తొలిపూజలతో నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో చేపట్టారు. సాయంత్రం వేళ ప్రధానాలయ ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు చేశారు. పాతగుట్ట ఆలయంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామికి మహామడపంలో స్ఫటికమూర్తులకు నిత్యారాధనలు, యాగశాలలో నిత్య రుద్రహవన పూజలు శైవాగమ పద్ధతిలో కొన సాగాయి.

కొనసాగుతున్న ధనుర్మాసోత్సవాలు

ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా పక్షిని ఆవహించిన భ కాసురుడిని శ్రీకృష్ణుడు, రావణుడిని సంహరించిన శ్రీరాముడి నామస్మరణతో శ్రీరంగనాథున్ని ఆరాధిస్తూ గోదాదేవి తిరుప్పావై వ్రతంలో పదమూడో పాశురాన్ని భక్తులు పఠించారు. తెల్లవారుజామున జరిగి న వేడుకల్లో మహిళ భక్తులు హారతి నివేదించగా పొంగలి ప్రసాదా న్ని వితరణ చేశారు. కొండపైన నిర్వహించే సంగీత సభల్లో భాగం గా కళారాధన మ్యూజిక్‌, డాన్స్‌ అకాడమీ (విశాఖకు చెందిన టి.సందీ్‌పకుమార్‌) కూచిపూడి నృత్యం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.

లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్న అదనపు డీజీపీ

లక్ష్మీనృసింహుడిని అదనపు డీజీపీ వి.వి శ్రీనివాసరావు, అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆర్‌ఎం దోబ్రియల్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఈవో ఏ. భాస్కర్‌రావు వారికి లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Updated Date - Dec 29 , 2024 | 12:54 AM