Share News

కేబినెట్‌లోకి కోదండ?

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:59 AM

తెలంగాణ ఉద్యమ సారఽథి, టీజేఎస్‌ చీఫ్‌, ఎమ్మెల్సీగా నామినేట్‌ అయిన కోదండరాంను.. మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

కేబినెట్‌లోకి కోదండ?

విద్యాశాఖను కేటాయించే అవకాశం

మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు

ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం

ఆరుగురికి చోటు.. ‘మైనారిటీ’పై సందిగ్ధం

ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం,

ఆమీర్‌ నియామకానికి గవర్నర్‌ ఆమోదం

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ సారఽథి, టీజేఎస్‌ చీఫ్‌, ఎమ్మెల్సీగా నామినేట్‌ అయిన కోదండరాంను.. మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన విద్యాశాఖను ఆయనకు కేటాయించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్‌ సమావేశాల్లోపు పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ నెలాఖరులోపు కసరత్తును పూర్తి చేసి ఆమోదం కోసం అధిష్ఠానానికి పంపనున్నారని తెలుస్తోంది. అధిష్ఠానం ఆమోదంతో ఫిబ్రవరి తొలి వారంలో ఆయన తన క్యాబినెట్‌ను పూర్తి స్థాయిలో విస్తరించనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం సహా కేబినెట్‌లో 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి విస్తరణలో చాన్స్‌ దక్కనుంది. కాగా, టీజేఏసీ చైర్మన్‌ హోదాలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కోదండరాంను.. రాష్ట్రం ఏర్పడి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ దూరం పెట్టిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రె్‌సకు బేషరతు మద్దతు ప్రకటించిన కోదండరాంను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీని చేస్తానంటూ అప్పట్లో హామీనిచ్చారు. ఈ మేరకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ సీటుకు కోదండ పేరును రేవంత్‌ సర్కారు ప్రతిపాదించింది. గవర్నర్‌ కూడా ఆమోదం తెలిపారు. అయితే కేసీఆర్‌ దూరం పెట్టినా.. కాంగ్రెస్‌ అక్కున చేర్చుకుని ఆయనును ఎమ్మెల్సీని చేస్తుండటంతో తెలంగాణ ఉద్యమకారులు, సానుభూతిపరుల్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఈ సానుకూలతను మరింత సుస్థిరం చేసుకుని ఓటు బ్యాంకుగా మలుచుకునే వ్యూహంలో భాగంగానే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునే యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని బీఆర్‌ఎస్‌ మళ్లీ తెరపైకి తెచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ నేత కోదండరాంను మంత్రివర్గంలో తీసుకుని బీఆర్‌ఎస్‌ ‘తెలంగాణ’ అస్త్రానికి చెక్‌ పెట్టాలన్న ఆలోచనలో రేవంత్‌ ఉన్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో రేవంత్‌ సహా నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి ఇద్దరు చొప్పున, ఎస్టీ.. బ్రాహ్మణ, వెలమ, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ నేతకు ఈ సారి అవకాశం దక్కవచ్చని సమాచారం. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరిని తీసుకునేందుకు ఆస్కారం ఉందంటున్నారు. బీసీల్లో గౌడ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్‌, మున్నూరుకాపు/పద్మశాలి సామాజిక వర్గాల నుంచి కొండా సురేఖను ఇప్పటికే క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి పేరు మంత్రివర్గ విస్తరణలో ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఇప్పటికే సీఎం రేవంత్‌, మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. శ్రీహరి నియోజకవర్గం మక్తల్‌ కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఉంది. దీంతో మరికొందరు బీసీ ఎమ్మెల్యేల పేర్లనూ ఆయనతో పాటుగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇటు ఎస్టీల్లో ఆదివాసీ వర్గం నుంచి సీతక్క ఉన్న నేపథ్యంలో విస్తరణలో లంబాడా వర్గానికి ఈసారి చోటు దక్కనుందని సమాచారం. ఈ కోటాలో బాలూనాయక్‌ పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిన నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గం నుంచి మరొకరిని తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే మాల సామాజిక వర్గం నుంచి పార్టీ ఎమ్మెల్యేలు గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌లు ఇప్పటికే పోటీలో ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యేలు, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసినా ఉమ్మడి నల్లగొండ నుంచి ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ముగ్గురికి చోటు దక్కినట్లవుతుంది. ఈనేపథ్యంలో ఎస్టీ కోటాలో బాలూనాయక్‌కు చోటు ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ క్రమంలోనే వరంగల్‌కు చెందిన లంబాడా ఎమ్మెల్యే పేరూ పరిశీలిస్తున్నట్లు సమాచారం..

మరి ఆరో బెర్త్‌ ఎవరిది..?

ఇక ఆరో బెర్త్‌ ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాల్సి ఉండగా.. ఎమ్మెల్సీగా నామినేట్‌ అయిన ఆమీర్‌ అలీ ఖాన్‌ను మాత్రమే తీసుకునేందుకు వీలుంటుంది. కానీ పరిపాలన అనుభవం లేని ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకునే యోచనలో రేవంత్‌ లేరని అంటున్నారు. ఇక అమీర్‌కు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి క్యాబినెట్‌ ర్యాంకుతో ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చిన నేపథ్యంలో ముస్లిం మైనార్టీలకు విస్తరణలో చోటు దక్కక పోవచ్చన్న ప్రచారమూ సాగుతోంది. ఆరో బెర్త్‌ను ఇతర సామాజిక వర్గాలకు సర్దుబాటు చేస్తారా.. లేక పెండింగ్‌లో పెట్టి లోక్‌సభ ఎన్నికల తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

సీఎంను కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, ఆమీర్‌అలీఖాన్‌ సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలిశారు. ఎమ్మెల్సీలుగా తమ ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా..ఎమ్మెల్సీ కోదండరాంను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ, ఎస్‌.కె.మహమ్మద్‌, ఉస్మానియా వీసీ డి.రవీందర్‌, శాతవాహన వీసీ స్‌.మల్లేశ్‌, పాలమూరు వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్‌, అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్శిటీ వీసీ కె.సీతారామారావు, ఎంజీ వర్శిటీ వీసీ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి కలిసి సత్కరించారు.

ఎమ్మెల్సీలుగా కోదండ, ఆమీర్‌!

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమీర్‌ అలీ ఖాన్‌ల నియామకంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. గతంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన రాజేశ్వరరావు, ఫరూఖ్‌ హుస్సేన్‌ల పదవీకాలం ముగియడంతో కాంగ్రెస్‌ సర్కారు ఈ పోస్టులకు కోదండరాం, ఆమీర్‌ పేర్లను ప్రతిపాదించింది. వీటిని గురువారమే గవర్నర్‌ ఆమోదించినా.. గెజిట్‌ శనివారం విడుదలైంది. వీరు ఆరేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు.

Updated Date - Jan 28 , 2024 | 03:59 AM