Share News

25% బ్యాంకు గ్యారెంటీ ఇస్తేనే ధాన్యం

ABN , Publish Date - Oct 02 , 2024 | 06:30 AM

రాష్ట్రంలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కోసం బ్యాంకు గ్యారెంటీ (బీజీ సిస్టమ్‌) విధానం అమల్లోకి రానుంది. ధాన్యాన్ని అమ్ముకోకుండా, కస్టమ్‌ మిల్లింగ్‌ ప్రక్రియను ఆలస్యం చేయకుండా రైస్‌ మిల్లర్లను కట్టడి చేసేందుకు 2024-25 సేకరణ విధానంలో ఈ నిబంధన చేర్చాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం

25% బ్యాంకు గ్యారెంటీ ఇస్తేనే ధాన్యం

మిల్లుల రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు కూడా అందజేయాలి

మిల్లు లీజుకు తీసుకుంటే ఆ రిజిస్ట్రేషన్‌ డీడ్‌ తప్పనిసరి

ఇదంతా మిల్లర్లు ధాన్యం అమ్ముకోకుండా కట్టడి చేసేందుకే

క్రిమినల్‌ కేసులు, డిఫాల్టర్లుగా ఉన్న మిల్లర్లకు ధాన్యం బంద్‌

ఖరీఫ్‌- 2024 సేకరణ మార్గదర్శకాల్లో చేర్చాలని నిర్ణయం

అధికార్లు జాయింట్‌ కస్టోడియన్‌గా ఉన్నా బాధ్యత మిల్లర్లదే

సార్టెక్స్‌, బ్లెండింగ్‌ మిషన్ల ఏర్పాటుకు డిసెంబరు 31 డెడ్‌లైన్‌

సకాలంలో మిల్లింగ్‌ చేయాల్సిందే!

నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు: డీఎస్‌ చౌహాన్‌

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కోసం బ్యాంకు గ్యారెంటీ (బీజీ సిస్టమ్‌) విధానం అమల్లోకి రానుంది. ధాన్యాన్ని అమ్ముకోకుండా, కస్టమ్‌ మిల్లింగ్‌ ప్రక్రియను ఆలస్యం చేయకుండా రైస్‌ మిల్లర్లను కట్టడి చేసేందుకు 2024-25 సేకరణ విధానంలో ఈ నిబంధన చేర్చాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. దీని ప్రకారం.. మిల్లింగ్‌ కోసం ధాన్యం ఇచ్చేముందే ఆ రైస్‌మిల్లుల తాలూకు రిజిస్ట్రేషన్‌ పత్రాలను డిపాజిట్‌ చేసుకోంది. అలాగే మొత్తం ధాన్యం విలువలో 25 శాతం మొత్తాన్ని బ్యాంకు గ్యారెంటీ కింద తీసుకోనుంది. ఉదాహరణకు ఒక రైస్‌మిల్లర్‌కు కోటి రూపాయల విలువైన ధాన్యం అప్పగించాలంటే సదరు రైస్‌ మిల్లరు రూ. 25 లక్షలు బ్యాంకులో చెల్లించాలి. మిగిలిన రూ.75 లక్షలకు విలువైన ఆస్తులు బ్యాంకులో తాకట్టు పెట్టాలి. అందుకు తగిన చెక్కులు కూడా ఇవ్వాలి. అప్పుడు సదరు బ్యాంకరు... రూ.కోటికి గ్యారెంటీ లెటర్‌ ఇస్తారు. ఆ బ్యాంకు గ్యారెంటీ లెటర్‌ను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు అప్పగిస్తే కోటి రూపాయల విలువైన ధాన్యం ఇస్తారు. అప్పుడు ధాన్యాన్ని దారిమళ్లించకుండా సకాలంలో ధాన్యం మిల్లింగ్‌చేసి.. సీఎంఆర్‌ డెలివరీ చేసి, ఆస్తులు, చెక్కులు తాకట్టు నుంచి విడిపించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏపీ, ఛత్తీ్‌సగఢ్‌లో బ్యాంకు గ్యారెంటీ విధానం అమల్లో ఉంది. సేకరణ, కస్టమ్‌ మిల్లింగ్‌ ప్రక్రియలో అక్రమాలను నియంత్రించేందుకు ఇప్పటికే కొన్ని నిబంధనలు మార్చుతూ సెప్టెంబరు 30న (సోమవారం) జీవో 21 జారీ చేశారు. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం (అక్టోబరు 1న) ధాన్యం సేకరణ సీజన్‌ ప్రారంభమైన దృష్ట్యా మరికొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకొని మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఇందులో ప్రధానంగా 25 శాతం బ్యాంకు గ్యారెంటీ అంశంపై చర్చ జరుగుతోంది. అయితే బ్యాంకు గ్యారెంటీ విధానాన్ని రైస్‌మిల్లర్ల లాబీ ముందుకు పడనిస్తుందా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఆ మిల్లర్లకు ధాన్యం ఇవ్వరు

కస్టమ్‌ మిల్లింగ్‌ పరంగా రైస్‌మిల్లుల గత చరిత్రను పరిశీలించిన తర్వాతే ధాన్యం అప్పగించాలని, గతంలో బకాయిలు ఉండి కార్పొరేషన్‌ను సతాయించిన మిల్లర్లకు ఎంతపడితే అంత ధాన్యం ఇచ్చేదిలేదనే నిబంధన కూడా పెట్టారు. రైస్‌ మిల్లులు, సామర్థ్యం వారీగా కేటాయింపులు చేయటానికి గుర్తింపు పొందిన రైస్‌మిల్లర్ల సంఘం నుంచి లెటర్‌ తీసుకోనున్నారు. రైస్‌మిల్లర్‌ స్వయంగా డిక్లరేషన్‌ ఇవ్వటంతోపాటు, అసోసియేషన్‌ నుంచి కూడా లెటర్‌ సమర్పించాల్సి ఉంటుంది. కాగా జాయింట్‌ కస్టోడియన్‌గా రైస్‌మిల్లర్‌తోపాటు డిప్యూటీ తహసీల్దారు/ఏసీఎ్‌సవో/తహసీల్దారును పెట్టారు. రైస్‌ మిల్లర్‌ ధాన్యం అమ్ముకున్నా, సకాలంలో డెలివరీ ఇవ్వకపోయినా అ ధికారిని ఒక్కరినే బాధ్యులను చేసేవారు. ఇప్పుడు రైస్‌మిల్లర్‌నే పూర్తి బాధ్యునిగా చేశారు. ఒకవేళ ఎవరైనా రైస్‌మిల్లును లీజుకు తీసుకుంటే.. తప్పనిసరిగా ఆ రిజిస్టర్డ్‌ డా క్యుమెంటును పౌరసరఫరాల సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక రైస్‌మిల్లులో ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములుంటే.. పార్ట్‌నర్‌షిప్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ డీడ్‌నూ రైస్‌ ఇవ్వాల్సి ఉంటుంది. రైస్‌మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు, 6-ఏ కేసులు పెండింగ్‌లో ఉంటే.. ఈ సీజన్‌తోపాటు వచ్చే రెండు ప్రొక్యూర్మెంట్‌ సీజన్లలో కూడా ధాన్యం ఇవ్వకూడదని నిర్ణయించారు.


3నెలలు దాటితే బియ్యం తీసుకునేదిలేదు

కేంద్ర ప్రభుత్వం నెలలు, ఏళ్ల తరబడి సీఎంఆర్‌ తీసుకోవటానికి ఆసక్తి చూపించటం లేదు. ఈసారి మూడు నెలల టార్గెట్‌ విధించిందని, అంటే.. సేకరణ సీజన్‌లో మూడు నెలల్లో మిల్లింగ్‌చేసి బియ్యం ఇస్తేనే తీసుకుంటామని, లేకపోతే ఆ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం కోటాలోకే వెళ్తాయని, వాటిని కేంద్ర ప్రభుత్వం తీసుకోబోదనిఎఫ్‌సీఐ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వచ్చాయి. ఈ టార్గెట్‌ చేరుకునేందుకు ఎప్పటికప్పుడు మిల్లింగ్‌ చేయించాల్సి ఉంటుంది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేనంత భారం పడుతుంది.

బ్లెండింగ్‌, సార్టెక్స్‌ మిషన్లు మస్ట్‌

రాష్ట్రంలో ఉన్న ప్రతి రైస్‌మిల్లులో బ్లెండింగ్‌, సార్టెక్స్‌ మిషన్లు ఏర్పాటుచేసుకోవాలని ప్రభుత్వం డెడ్‌లైన్‌ విధించింది. పోషకాహార భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సేకరించే బియ్యం మొత్తాన్ని ఫోర్టిఫైడ్‌ రూపంలో తీసుకుంటోంది. ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ను బియ్యంలో కలపటానికి బ్లెండింగ్‌ మిషన్లు తప్పనిసరి. అందుకే ప్రతి రైస్‌మిల్లులో బ్లెండింగ్‌ మిషన్‌ ఏర్పాటుచేసుకోవాలనే నిబంధన పెట్టారు. డ్యామేజ్‌, రంగుమారిన బియ్యం ఇవ్వకుండా ప్రజలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలంటే సార్టెక్స్‌ మిషన్‌ తప్పనిసరి అని ఈ నిబంధన పెట్టారు. '

సకాలంలో మిల్లింగ్‌ చేయాల్సిందే!

రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఖరీ్‌ఫ లో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని రైస్‌మిల్లులు దిం చుకోవాల్సిందేనని, సకాలంలో మిల్లింగ్‌ చేసి 67ు రికవరీతో బియ్యం తిరిగివ్వాల్సిందేనని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమినర్‌ డీఎస్‌ చౌహాన్‌ స్పష్టంచేశారు. కేంద్రం, భారత ఆహార సంస్థ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో సేకరణ ప్రక్రియ జరుగుతుందని, రైస్‌మిల్లర్లు నిబంధనల కు లోబడి సీఎంఆర్‌ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. రాష్ట్ర పౌరసరఫరాల భవన్‌లో మంగళవారం రైస్‌ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చౌహాన్‌ మాట్లాడారు. ఎవరైనా రైస్‌మిల్లర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బియ్యం ఔట్‌టర్న్‌, మిల్లింగ్‌ చార్జీలు, గోనె సంచుల ధరల విషయంలో ఎఫ్‌సీఐ నిబంధనలే వర్తిస్తాయని తెలిపారు. బ్యాంకు గ్యారెంటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించిన తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తుందని స్పష్టంచేశారు. ఈ అంశంపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొక్యూర్మెంట్‌ పాలసీకి అనుగుణంగా రైస్‌మిల్లర్లు నడుచుకోవాలని సూచించారు. తేమ శాతాన్ని 17 నుంచి 14 శాతానికి తగ్గించాలని మిల్లర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై కమిషనర్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఒకేరకం గా 17ు తేమ నిబంధనే అమలులో ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు.

Updated Date - Oct 02 , 2024 | 06:30 AM