Share News

సాగు ప్రణాళిక ఖరారు!

ABN , Publish Date - May 22 , 2024 | 11:50 PM

జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధ్దం చేశారు.

సాగు ప్రణాళిక ఖరారు!

జిల్లాలో 28,115వేల ఎకరాల్లో పంటల సాగు అంచనా

మేడ్చల్‌ మే22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధ్దం చేశారు. గతేడాది వానాకాలం సీజన్‌లో సరైన వర్షాలు లేక, వరి, పత్తి పంటలకు వివిధ రకాల తెగుళ్లు సోకి రైతులు పూర్తిగా నష్టపోయారు. యాసంగి సీజన్‌లో సరైన నీటి సౌకర్యం లేక ఆశించిన స్థాయిలో పంటల సాగు చేయలేదు. అయితే కొద్ది రోజులుగా మోస్తరు వర్షం కురుస్తుండడంతో వానాకాలం పంటల సాగుకు రైతులు భూములను సిద్ధ్దం చేస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో 28,115 ఎకరాల్లో పంటల సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

అవగాహన కల్పిస్తేనే ప్రయోజనం

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మన తెలంగాణ- మన వ్యవసాయం కార్యక్రమం అమలు చేసి వానాకాలం సీజన్‌లో సాగు చేయాల్సిన పంటలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం నిర్వహించడం లేదు. జిల్లాలో 5 మండలాల పరిధిలో మొత్తం 15 వేల మంది రైతులు ఉన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ పరిధిలో 7 మంది ఏవోలు, 9 మంది ఏఈఓలు విధులు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఒక ఏఈవోకు రెండు, మూడు గ్రామాలను అప్పగించారు. ఏఈవోలు 5 వేల ఎకరాల్లో సాగు చేసే పంటలను పర్యవేక్షణ చేయనున్నారు. ప్రస్తుతం వివిధ కంపెనీల విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖాధికారులు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.

పంటల సాగు అంచనా

వరి 18,900 ఎకరాలు, కందులు 50 ఎకరాలు, మొక్కజొన్న 250 ఎకరాలు, 25 ఎకరాల్లో జొన్న, 130 ఎకరాల్లో పత్తి, 25 ఎకరాల్లో మినుములు, పండ్ల తోటలు 4,170 ఎకరాలు, కూరగాయలు 1820 ఎకరాలు, ఇతర రకాల పంటలు 520 ఎకరాల్లో సాగుతు అవుతుందని ప్రణాళికలు రూపొందించారు.

విత్తనాల అవసరం

జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని బట్టి వరి ఇతర పంటలతో కలుపుకుని మొత్తం 5వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం పడుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. వరి 4,725, మొక్కజొన్న 250, పత్తి 130 క్వింటాళ్ల విత్తనాలు అవసరం పడుతాయని అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా రైతులకు కావాల్సి ఎరువులు కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. యూరియా 2,194, డీఏపీ 2,345, కాంప్లెక్స్‌ 29,327 బస్తాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

ప్రణాళిక సిద్ధం చేశాం

వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేయాల్సిన పంటలపై అవగాహన కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

- మేరీ రేఖా, జిల్లా వ్యవసాయాధికారి

Updated Date - May 22 , 2024 | 11:50 PM