Share News

‘చేవెళ్ల-ప్రాణహిత’తో ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీరు

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:20 PM

చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీరు తీసుకువచ్చేలా కృషి చేస్తామని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు.

 ‘చేవెళ్ల-ప్రాణహిత’తో ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీరు
మాట్లాడుతున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

గత పాలకుల నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

చేవెళ్లలో స్వామి వివేకానందుడి విగ్రహం ఆవిష్కరణ

చేవెళ్ల, జనవరి 12 : చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీరు తీసుకువచ్చేలా కృషి చేస్తామని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేకానందుడి విగ్రహాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిలతో కలిసి ప్రసాద్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్‌ మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు గత పాలకులు అన్యాయం చేశారని అన్నారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు పాలమూరు ఎత్తిపోతల పథకం రీడిజైన్‌ చేసి రంగారెడ్డి, వికారాబాద్‌ ప్రాంతాలకు సాగు నీరందిస్తామని స్పీకర్‌ తెలిపారు. గత ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయలేకపోయారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో చదువుకున్న యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తామన్నారు. వివేకానందుని జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. యువత స్వామిజీ సందేశాలను తెలుసుకోవాలన్నారు. యువత సన్మార్గంలో ప్రయాణించి దేశ అభివృద్ధికి దోహదపడాలని ఆకాక్షించారు. పరిపూర్ణ వ్యక్తి కావాలంటే మానసిక వికాసం, ఆలోచనలు, శారీరక, బౌద్ధిక, ఆధ్యాత్మిక శక్తి అవసరమన్నారు. అంతకు ముందు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఆధ్యాత్మిక వేత్త బాస్కర యోగిలు మాట్లాడుతూ దేశ స్థితిగతులను మార్చే గురుతర బాధ్యతను యువత తీసుకోవాలన్నారు. ప్రపంచ దేశాల్లోనే భారత దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ భీంభరత్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌లు దేవర వెంకట్‌రెడ్డి, గోనె ప్రతాపరెడ్డి, చేవెళ్ల ఉప సర్పంచ్‌ గంగి యాదయ్య, ఎంపీటీసీ సున్నపు వసంతం, మాజీ ఎంపీపీలు, విజయ్‌భాస్కర్‌రెడ్డి, బాల్‌రాజ్‌, చేవెళ్ల సర్పంచ్‌ శైలజా ఆగిరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు మాలతి, పంచాయతీరాజ్‌ ఛాంబర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:20 PM