‘సంతోషం’గా ఎత్తేశారు!
ABN , Publish Date - Mar 19 , 2024 | 04:22 AM
ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలోని పెద్దల బంధువులకు ‘జీ హుజూర్’ అన్నారు. సామాన్య రైతులు హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా బేఖాతర్ చేశారు! అధికారం అండతో గత సర్కారులోని పెద్దలు చేసిన నిర్వాకాలు
కేసీఆర్ బంధువుల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు
ఎంపీ సంతోష్ భార్య రోహిణి,
కవిత బంధువు శిరీష, ఎమ్మెల్సీ పోచంపల్లి భార్యకు చెందిన 16 ఎకరాలు క్లియర్
రైతుల అంశంలో కోర్టు ఆదేశాలూ బేఖాతర్
బొమ్మరాశిపేటలో అధికారుల స్వామి భక్తి
ధరణి పేరిట అడ్డగోలు వ్యవహారాలు
న్యాయం చేయాలని రైతుల వేడుకోలు
మేడ్చల్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలోని పెద్దల బంధువులకు ‘జీ హుజూర్’ అన్నారు. సామాన్య రైతులు హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా బేఖాతర్ చేశారు! అధికారం అండతో గత సర్కారులోని పెద్దలు చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేటలో అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు కలిసి ఆడిన నాటకంలో సామాన్య రైతులు సమిధలయ్యారు. ఔటర్ రింగురోడ్డుకు సమీపంలోని బొమ్మరాశిపేటలో సర్వే నంబర్లు 320 నుంచి 409 వరకు దాదాపు వెయ్యి ఎకరాల భూములు ఉన్నాయి. 300 మంది రైతులు 40-50 ఏళ్ల నుంచి ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. వీరంతా ధరణి ద్వారా పాసుపుస్తకాలు కూడా పొందారు. రైతుబంధు, రైతుబీమా, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలనూ తీసుకుంటున్నారు. అయితే ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు రైతుల భూములపై కన్నేశారు. ఈ భూమికి హక్కుదారులమంటూ కోర్టులో కేసులు వేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. అనంతరం రైతులు హైకోర్టు నుంచి అనుకూల తీర్పులు తెచ్చుకున్నా కూడా భూములను నిషేధిత జాబితా నుంచి అఽధికారులు తొలగించలేదు. ప్రతి రైతు వ్యక్తిగతంగా హైకోర్టుకు వెళ్లి నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. కానీ, కోర్టు ఆదేశాలు లేకపోయినా ప్రభుత్వంలోని పెద్దల భూములను మాత్రం నిషేధిత జాబితా నుంచి ఆగమేఘాలపై తొలగించేశారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత, కలెక్టర్ల బదిలీ జరిగిన మరుసటి రోజే ఇదంతా చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. దీనికంటే ముందు ఇక్కడ మరో ఆరెకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబీకులు కొనుగోలు చేయడం విశేషం. అప్పుడు కూడా అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేశారు!! పెద్దల పట్ల ఉదారంగా వ్యవహరించిన అధికారులు, సామాన్య రైతులు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా ఖాతరు చేయకుండా.. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?? అంటే.. దాని వెనక పెద్ద కుట్రే దాగి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల భూములన్నింటినీ ఇలా నిషేధిత జాబితాలోనే పెట్టి వారిని అష్టదిగ్బంధం చేసి, తక్కువ ధరలకే కొల్లగొట్టే యత్నాలు చేశారు. ఇందులో అప్పటి ప్రభుత్వ పెద్దలతో పాటు పొరుగు జిల్లాకు చెందిన మంత్రి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే రైతులు ఆందోళనలు చేపట్టడంతో వారి ప్రయత్నాలన్నీ విఫలమాయ్యయి. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి కూడా దీనిపై స్పందించి రైతులకు న్యాయం చేయాలని అప్పటి ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఇదీ ఆ భూమి కథ..
1965లో డి.అమరేందర్‌బాబు మరో 20 మంది కలిసి 795 ఎకరాల భూమిని పట్టాదారుల నుంచి కొనుగోలు చేశారు. 1966లో ఈ భూమిని మాజీ ఎంపీ దుగ్గిరాల బలరామకృష్ణయ్యకు జీపీఏ చేశారు. ఆయన నుంచి స్థానిక రైతులంతా 1970-80 మధ్యలో ఈ భూములను సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేశారు. అలాగే పక్కనే ఉన్న మరో 255 ఎకరాల ఇనాం భూమిని కూడా ఓఆర్సీల ద్వారా కొనుగోలు చేశారు. ఈ పక్రియ అంతా 1980కి ముందే జరిగిపోయింది. అప్పటి నుంచి రైతులే ఈ భూములు సాగు చేసుకుంటున్నారు. 1982లో దుగ్గిరాల బలరామకృష్ణయ్య మృతి చెందారు. ఇక్కడ భూముల క్రయవిక్రయాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఓఆర్‌ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించింది. తర్వాత ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ధరణి ద్వారా పాస్‌బుక్‌లు కూడా జారీ చేశారు. రైతుబంధు కూడా ఇచ్చారు. అయితే నాలుగు దశాబ్దాల తర్వాత దుగ్గిరాల బలరామకృష్ణయ్య కుటుంబీకుల పేరుతో కొందరు తెరపైకి వచ్చారు. ఈ భూములు బాలరామకృష్ణయ్య ఎవరికీ విక్రయించలేదని, వారసులైన తమకు సాదాబైనామా ద్వారా హక్కులు కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టేట్‌సకో ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత 14.06.2022న ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. బాధిత రైతులు సంఘంగా ఏర్పడి న్యాయ పోరాటానికి దిగారు. హైకోర్టును ఆశ్రయించగా రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. అయినా భూములను నిషేధిత జాబితాలోనే ఉంచారు. రైతులు పలుమార్లు దీనిపై ఆందోళనలు నిర్వహించారు. కానీ, అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల గ్రామాన్ని సందర్శించిన ధరణి పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎ.కోదండరెడ్డి, సునీల్‌కుమార్ ఎదుట రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయం చేయాలని వేడుకున్నారు.
తక్కువ ధరకే కొట్టేసే ప్లాన్!
వందల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో పెట్టడం వెనక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉన్నట్లు ప్రచారం సాగింది. 2022 నుంచి ఈ భూములు నిషేధిత జాబితాలో ఉండడంతో గ్రామంలో ఏ ఒక్క రైతు కూడా అవసరాల కోసం భూమిని అమ్ముకోలేకపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరకే భూముల్ని కొట్టేసే యత్నం చేశారు. ఈ భూములపై కన్నేసిన పెద్దలు వాటిని నిషేధిత జాబితాలోనే కొనసాగించేలా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇలా భూములపై ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో కొందరు పెద్దలు రంగ ప్రవేశం చేశారు. పొరుగు జిల్లాకు చెందిన అప్పటి మంత్రితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు బేరసారాలు సాగించారు. కానీ, రైతులంతా ఐక్యంగా ఉండడంతో వారి ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
పెద్దలకు దాసోహం
ప్రభుత్వ పెద్దలకు అధికారులు దాసోహం అన్నారు. వారి భూములకు ఎలాంటి కోర్టు ఆదేశాలు లేకున్నా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. రాజ్యసభ సభ్యుడు సంతో్‌షకుమార్ భార్య జె.రోహిణి పేరు మీద ఉన్న సర్వే నంబరు 360/వీయూలో 5 ఎకరాలు (డాక్యుమెంటు నంబరు 6410/2018)తో పాటు ఎమ్మెల్సీ కవిత బంధువు వి.శిరీష సర్వే నంబరు 360/ఈఈ, 359/ఏఏ/ఏలో 3.35 ఎకరాలు (డాక్యుమెంట్ నంబరు 4561/2018) కొనుగోలు చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి భార్య పి.మమత సర్వే నంబరు 339/ఏఏ2, 360/ఈలో 4.33 ఎకరాలు (డాక్యుమెంటు నంబరు 2157/2018), సర్వే నంబరు 361ఈ, 359/ఏఏ/ఏఏలో 3 ఎకరాలు డాక్యుమెంట్ నంబరు 5628/2018 ద్వారా కొనుగోలు చేసినట్లు ధరణిలో నమోదైంది. వీరంతా కలిసి ఎఫ్4ఎల్ ఫామ్ పేరుతో భూములు కొనుగోలు చేశారు. ఈ మొత్తం 16.28 ఎకరాల భూములను ఆగమేఘాలపై గత ఏడాది అక్టోబరు 12న నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఇది తెలుసుకున్న రైతులు అవాక్కయ్యారు. బడా బాబులకు ఓ న్యాయం.. తమకో న్యాయమా? అంటూ వాపోతున్నారు. ఇటీవల గ్రామాన్ని సందర్శించిన ధరణి పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎ.కోదండరెడ్డి, సునీల్‌కుమార్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.